close
ఇలా నియామకం.. అలా బాధ్యతలు

విధులపై అవగాహన కొరవడిన పంచాయతీ కార్యదర్శులు
50కి పైగా బాధ్యతలు నిర్వహించలేక సతమతం
మరో 1,300 పంచాయతీలకు కార్యదర్శుల నియామకం
పని ఒత్తిడి వల్లనే ఒకరి ఆత్మహత్య అంటున్న ఉద్యోగుల సంఘం

రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు నియమితులవుతున్నప్పటికీ వారికి కనీస శిక్షణ ఉండటంలేదు. నియమితులైన మరుసటి రోజు నుంచే వారు 50కి పైగా విధులను చేపట్టాల్సి వస్తోంది. ఏ అంశంపైనా అవగాహన లేక.. పనిఒత్తిడి భరించలేక ఇప్పటికే కొందరు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా గుమ్మకొండ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకూ పని ఒత్తిడే కారణమని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. ఈమె మృతికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాలవారు నిరసనలు చేపట్టారు.

ప్రతి పంచాయతీకి కార్యదర్శి ఉండి తీరాలన్న భావనతో ప్రభుత్వం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పేరుతో 9,335 కొత్త తరహా పోస్టులను సృష్టించి.. 5.62 లక్షల మంది దరఖాస్తుదారులకు గతేడాది అక్టోబరు 10న రాత పరీక్షను నిర్వహించింది. ఎంపికైన వారికి 2019, ఏప్రిల్‌ 12న నియామక ఉత్తర్వులివ్వగా.. వారిలో కొందరు బాధ్యతలను చేపట్టనేలేదు. మరికొందరు విధులను చేపట్టి వివిధ కారణాలతో నిష్క్రమించారు. ఇలాంటి పోస్టులు 1,300 వరకు ఉన్నాయి. రాష్ట్రంలో 30 రోజుల కార్యాచరణ ఈనెల 6 నుంచి ప్రారంభమవ్వనున్నందున ఈ పోస్టులన్నింటినీ పంచాయతీరాజ్‌శాఖ కొద్దిరోజుల క్రితం భర్తీ చేసింది. ఈ కార్యదర్శులకు పంచాయతీరాజ్‌ కొత్త చట్టంపై అధికారులు కనీస అవగాహన కల్పించలేదు. 50కి పైగా విధులను కార్యదర్శులకు నిర్దేశించి.. వాటిని సక్రమంగా అమలు చేయకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. కార్యదర్శులు తమ రోజువారీ పనితీరును వెబ్‌సైట్‌లో పొందుపరిచి.. అందులో మంచి మార్కులను పొందగలిగితేనే మూడేళ్ల తర్వాత వారి ఉద్యోగాలు ఖాయమయ్యేలా నిబంధనలను విధించింది.

పని ఒత్తిడి వల్లనే స్రవంతి ఆత్మహత్య
కార్యదర్శులకు పని ఒత్తిడి పెరిగింది. గుమ్మకొండలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో ప్రాణాలొదిలింది. కార్యదర్శులకు ఆయా అంశాల్లో పట్టు ఏర్పడేలా శిక్షణ ఉండాలి. పంచాయతీ వ్యవహారాలు అంటే తెలియని పలువురు యువతీ యువకులు పరీక్ష రాసి ఉత్తీర్ణులై వచ్చారు. ఒకేసారి కీలక బాధ్యతలను చేపట్టడం, ప్రతి అధికారి, ప్రజాప్రతినిధి వారినే ప్రశ్నిస్తుండటం వంటి కారణాల వల్ల వారు చాలా ఒత్తిడికి, ఆందోళనకు లోనవుతున్నారు. తీవ్ర చర్యలు ఉంటాయంటూ వారిని భయాందోళనలకు గురిచేసే హెచ్చరికలు చేయడం పాలకులు మానుకోవాలి. సెలవురోజులు, సాయంత్రం సమయాల్లో సమావేశాలను నిర్వహించడం విరమించుకోవాలి.
- పి.మధుసూదన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం
- ఈనాడు, హైదరాబాద్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.