close
సమష్టి కృషి.. శనగ వంగడాల సృష్టి

రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇక్రిశాట్‌ ఏర్పాట్లు

ఈనాడు, సంగారెడ్డి: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లు పోషకాహారాన్ని అందించడం సవాల్‌గా మారింది. సంప్రదాయ విధానంలో ఒక వంగడాన్ని అందుబాటులోకి తేవాలంటే 10 నుంచి 11 ఏళ్లకు పైనే సమయం పడుతోంది. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మూడు కలిసి సంయుక్తంగా కృషి చేశాయి. శనగలో తొలిసారిగా జీనోమిక్స్‌ను ఉపయోగించి రెండు సరికొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోనే వీటిని సృష్టించారు. రైతుల పొలాల్లో వీటిని సాగు చేసుకునేందుకు వీలుగా తాజాగా శనగకు సంబంధించి ఆలిండియా కోఆర్డినేటెడ్‌ రీసెర్చి ప్రాజెక్టు వీటిని గుర్తించింది. పూసా-10216, సూపర్‌ అన్నిజెరి-1గా పిలిచే ఈ వంగడాలు కరవు పరిస్థితుల్లోనూ అధిక దిగుబడులు ఇస్తాయని, తెగుళ్లను సమర్థంగా తట్టుకుంటాయని స్పష్టం చేస్తున్నారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, ఇక్రిశాట్‌లు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. ఈ వంగడాల ద్వారా అధిక దిగుబడులు సాధ్యమవుతాయని భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌ త్రిలోచన్‌ మోహాపాత్ర వివరించారు. వీటివల్ల భారత్‌, ఆఫ్రికా రైతులకు మేలు చేకూరుతుందని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ పీటర్‌ కార్‌ బెర్రీ పేర్కొన్నారు. ఈ వంగడాలను త్వరలో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్రిశాట్‌ శుక్రవారం ఓప్రకటనలో పేర్కొంది.

పూసా(బీడబ్ల్యూజీ)- 10216
భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు చెందిన భరద్వాజ్‌ చెల్లపిల్ల, ఇక్రిశాట్‌కు చెందిన రాజీవ్‌ వర్షణే, మహేందర్‌ తూడి,  మనీష్‌ రూర్కీవాల్‌ కలిసి వంగడాన్ని అభివృద్ధి చేశారు. కరవును సమర్థంగా తట్టుకొనే ఐసీసీ 4958 వంగడం నుంచి జన్యువులను తీసుకొని పూసా-372ను మరింతగా అభివృద్ధి చేశారు. ఈ వంగడానికి పూసా-10216 అని పేరు పెట్టారు.

సూపర్‌ అన్నిజెరి-1 (ఎంఏబీసీ-డబ్ల్యూఆర్‌- ఎస్‌ఏ-1)
ఈ వంగడాన్ని సాగు చేసేందుకు కర్ణాటక రైతులు ప్రాధాన్యమిస్తారు. ప్యుజేరియం అనే శిలీంధ్రం వల్ల వచ్చే తెగులును డబ్ల్యూఆర్‌ 315 వంగడం సమర్థంగా తట్టుకుంటుంది. దీనిలో నుంచి జన్యువులను తీసుకున్న శాస్త్రవేత్తలు అన్నిజెరి-1లో వీటిని జొప్పించారు. ఈ వంగడానికి సూపర్‌ అన్నిజెరి-1 అని నామకరణం చేశారు. రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌, ఇక్రిశాట్‌ ఈ వంగడాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశాయి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.