
రూ.1500 కోట్లు కావాలని మార్క్‌ఫెడ్ నివేదిక
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం
ఇదే అదనుగా వ్యాపారుల ఇష్టారాజ్యం
మద్దతు ధర కన్నా తక్కువ ఇచ్చి కొనుగోలు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మొక్కజొన్నలకు డిమాండ్ ధర ఈ సీజన్లో మెరుగ్గా ఉన్నా రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర రావడం లేదు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగానే వ్యాపారులు పోటీపడి మద్దతు ధరకన్నా ఎక్కువ చెల్లించి కొనేవారు. ఈ సీజన్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో వ్యాపారులు ధరలు తెగ్గోస్తూ రైతులకు నష్టం చేస్తున్నారు. పంటలను కొనేందుకు మార్క్‌ఫెడ్‌ను ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. మూడేళ్లుగా మక్కలను కొని తిరిగి అమ్మినప్పుడు ఈ సంస్థ భారీగా నష్టపోయి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సీజన్లో మొక్కజొన్నలు కొనాలంటే రూ.1500కోట్లు బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకోవడానికి ప్రభుత్వమే పూచీకత్తు ఉండాలని కోరుతూ తాజాగా లేఖ రాసింది. దీనికి ఆర్థికశాఖ, సీఎం ఆమోదం వస్తేనే అనుమతి వస్తుంది. అప్పటివరకూ కొనుగోలు కేంద్రాలు తెరవడం అనుమానమేనని చెబుతున్నారు.
కేంద్రం జొన్న, మొక్కజొన్నలను తెలంగాణలో కొనడానికి అనుమతించలేదు. రేషన్‌కార్డులపై నిత్యావసరాల కోటా కింద విక్రయిస్తేనే వాటిని కొంటామని కేంద్రం నిబంధన పెట్టింది. ఈ జాబితాలో తెలంగాణలో ఇవి లేనందున రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనాలి. ఈ ఏడాది మక్కల మద్దతుధర క్వింటాకు రూ.1760కాగా రూ.1300-1750లోపే వ్యాపారులు ఇస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్దదైన వరంగల్ మార్కెట్‌కు బుధవారం 379 క్వింటాళ్ల మక్కలను తెస్తే ఒక్క క్వింటాకైనా మద్దతు ధర ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. క్వింటాకు కనిష్ఠంగా బుధవారం రూ.1400-1755 వరకు వ్యాపారులు చెల్లించారు. ఎక్కువ వరకు రూ.1651 లేదా అంతకన్నా తక్కువే వచ్చినట్లు మార్కెట్ అధికారులు చెప్పారు.
పెసలకే పైసలు రాలే
కేంద్రం కొంటున్న పంటలకు సైతం రైతులకు సొమ్ము చెల్లించలేక మార్క్‌ఫెడ్ సతమతమవుతోంది. ఈ సీజన్లో పెసలు కొన్నందుకు రూ.43కోట్లను కేంద్రం తరఫున ‘జాతీయ సహకార మార్కెటింగ్ సమాఖ్య’(నాఫెడ్) మార్క్‌ఫెడ్‌కు విడుదల చేయాలి. వీటిలో ఇప్పటికి రూ.23కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.20కోట్లు ఇవ్వాలని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మద్దతుధరకు పంటను అమ్మితే 72గంటల్లోగా రైతు ఖాతాలో మార్క్‌ఫెడ్ సొమ్ము జమచేయాలి. నెలైనా సొమ్ము రాలేదని రైతులు వాపోతున్నారు. పక్షం రోజులుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సోయాచిక్కుడు అమ్మిన రైతులకూ సొమ్ము చెల్లించడంలేదు. రైతులు అమ్మిన పంటలను గోదాములకు తరలించి అవి నాణ్యతగా ఉన్నాయని అక్కడ రశీదులు తీసుకుని నాఫెడ్ రాష్ట్ర కార్యాలయానికి ఆన్లైన్లో పంపితే వాటిని దిల్లీకి పంపి సొమ్ములు తెప్పించి తిరిగి మార్క్‌ఫెడ్‌కు ఇస్తోంది. ఈ ప్రక్రియ నెలల తరబడి సాగుతుండడంతో.. తాము వెంటనే నగదు చెల్లిస్తామని చెప్పి వ్యాపారులు రైతుల పంటను తక్కువ ధరలకు కొనేస్తున్నారని ఓ అధికారి చెప్పారు.
కథనాలు
దేవతార్చన

- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి