close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏ-2 పులి చుట్టూ పద్మవ్యూహం

దాన్ని బంధించేందుకు అనువుగా రంగం సిద్ధం చేసిన అటవీబృందం
పశువుని చంపినచోట మంచె ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, అసిఫాబాద్‌: ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువకుణ్ని, మరో యువతిని హతమార్చినట్లుగా భావిస్తున్న ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎరగా వేసిన ఓ పశువును ఈ పులి సోమవారం చంపింది. అలా చంపాక ఆ మాంసాన్ని తినేందుకు ఏ పులి అయినా రెండోసారి మళ్లీ వస్తుంది. దీంతో కంది భీమన్న అటవీప్రాంతంలోని సంఘటన స్థలానికి పక్కనే అటవీశాఖ ఓ మంచె ఏర్పాటుచేసింది. అక్కడికి పులి రాగానే మత్తు ఇంజక్షన్‌తో బంధించేందుకు ప్రణాళిక రచించింది.
పులి కోసం మూడుచోట్ల..
ఆకలి తీర్చుకునేందుకు కొద్దిరోజులుగా ఈ పెద్దపులి పశువుల్ని చంపుతోంది. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు కొన్నిచోట్ల పశువుల్ని కట్టేసి ఎరగా ఉంచి పద్మవ్యూహం పన్నారు. ఇందులో చిక్కిన ఏ-2 పెద్దపులి రెండ్రోజుల క్రితం కంది భీమన్న అటవీప్రాంతంలో ఎరగా ఉంచిన పశువుని చంపింది. ఇప్పుడు ఆ ప్రదేశానికి 20-30 మీటర్ల దూరంలోనే ఓ మంచె ఏర్పాటుచేశారు. ఇద్దరు పశువైద్యులతో పాటు ఒకరిద్దరు అటవీ అధికారులు మంగళవారం నుంచే ఆ మంచెపైకి ఎక్కి పులి కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సమీపంలో ఓ క్యాంప్‌, 10 కి.మీ. దూరంలో బెజ్జూరులో మరో క్యాంప్‌ ఏర్పాటుచేశారు. ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ వినోద్‌కుమార్‌, స్థానిక డీఎఫ్‌ఓ శాంతారాంతో పాటు తెలంగాణ అటవీశాఖ అధికారులు, 40 మంది సిబ్బంది పెద్దపులిని బంధించేందుకు రంగంలోకి దిగారు. ఈ ఆపరేషన్‌కు సహకరించేందుకు మహారాష్ట్ర నుంచి 8 మంది అధికారులు వచ్చారు. మత్తు ఇంజక్షన్‌కు పులి చిక్కితే తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని రప్పించారు. చుట్టుపక్కల 3-4 కి.మీ. దూరం నుంచే అధికారులు ఆంక్షలు విధించి ప్రజల రాకపోకలను కట్టడి చేశారు. అనుకున్నట్లుగా ఏ-2 పులి పట్టుబడితే హైదరాబాద్‌ జూకి తరలించనున్నట్లు సమాచారం.
* మహారాష్ట్రలోని రాజురా ప్రాంతం నుంచి రెండు పులులు గతేడాది ఆసిఫాబాద్‌ అటవీప్రాంతానికి రావడంతో వీటికి ఏ-1, ఏ-2గా నామకరణం చేయటం తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు