కరోనాలోని కొత్త రూపాలకు ఏఐ సాధనంతో చెక్‌

ప్రధానాంశాలు

కరోనాలోని కొత్త రూపాలకు ఏఐ సాధనంతో చెక్‌

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన

హ్యూస్టన్‌: కరోనా వైరస్‌లో కొత్త రకాలను ఎదుర్కొనేందుకు, టీకా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించారు. దీని ద్వారా టీకాల పనితీరుపై విశ్లేషణను వేగవంతం చేయవచ్చని, అందులో ఉత్తమ వ్యాక్సిన్‌ను గుర్తించొచ్చని తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. వైరస్‌లో వచ్చే అవకాశమున్న మార్పుల (ఉత్పరివర్తనలు)ను విశ్లేషించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వారు చెప్పారు. సాధారణంగా టీకా రూపకల్పనకు నెలలు లేదా సంవత్సరాలు పడుతుంటుందని, తాజా విధానంతో దీన్ని సెకన్లు లేదా నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రయోగించి.. కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేసే అవకాశమున్న 29 టీకాలను పరిశోధకులు గుర్తించారు. వీటిలోని 11 అత్యుత్తమ టీకాలతో బహుళ ఎపిటోప్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇవి కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్లపై దాడి చేయగలవని పేర్కొన్నారు. మానవ కణంలోకి చొరబడటానికి ఈ స్పైక్‌ ప్రొటీన్‌ను వైరస్‌ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రొటీన్‌ను విచ్ఛిన్నం చేయడానికి టీకాలు నిర్దిష్ట ప్రాంతాన్ని (ఎపిటోప్‌) లక్ష్యంగా చేసుకుంటాయి. ఫలితంగా వైరస్‌ పునరుత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట పడుతుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని