close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సిబ్బందిని నియమించారు... శకటం మాట మరిచారు..

స్కైలిఫ్ట్‌ అగ్నిమాపక యంత్రాల కొనుగోలులో జాప్యం
బడ్జెట్‌ లేక ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: అత్యంత ఎత్తయిన స్కైలిఫ్ట్‌ కలిగిన అగ్నిమాపక శకటం కొనుగోలు వ్యవహారం కాగితాల్లోనే మగ్గుతోంది. ఘనమైన ప్రణాళికలు ఉన్నా నిధులు మంజూరు కావట్లేదు. ‘101 మీటర్ల ఎత్తయిన అగ్నిమాపక శకటం.. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తయిన వాటిల్లో ఒకటి కానుంది. ఇందుకోసం ప్రత్యేకమైన హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫాం.. 18 మంది ప్రత్యేక సిబ్బంది అవసరం’ అని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రతిపాదనలకు పరిపాలన అనుమతులూ లభించాయి. తర్వాత జిల్లా అగ్నిమాపక అధికారి(డీఎఫ్‌వో)తోసహా 18 మంది సిబ్బందిని నియమించారు. నానక్‌రాంగూడలోని వైఎస్సార్‌ భవన్‌ సమీపంలో హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటుకు స్థలాన్నీ కేటాయించారు. ఇదంతా జరిగి ఏడాది పూర్తవుతున్నా శకటం కొనుగోలుకు బడ్జెట్‌ కేటాయించలేదు. ఇందుకు దాదాపు రూ.25 కోట్లు అవసరం.
చెన్నైలో ఇప్పటికే 104 మీటర్లవి రెండు...
ప్రస్తుతం విదేశాలలో 112 మీటర్ల వరకు ఎత్తయిన స్కైలిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో అయితే ఒక్క చెన్నైలో తప్ప మరే నగరంలోనూ వంద మీటర్ల కంటే ఎత్తయినవి లేవు. చెన్నైలో 104 మీటర్లవి రెండు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం సమకూర్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 54 మీటర్లవి రెండు ఉన్నాయి. సికింద్రాబాద్‌, మాదాపూర్‌ అగ్నిమాపక కేంద్రాల్లో వీటిని ఉంచారు. ఫిన్లాండ్‌కు చెందిన బ్రాంటో సంస్థ నుంచి 2007లో వీటిని సమకూర్చుకున్నారు. అప్పట్లో మూడు తీసుకురాగా.. ఒకదాన్ని విశాఖపట్నానికి తరలించారు. అవసరమైన చోట నిచ్చెనలా మార్చుకోవడం వీటి ప్రత్యేకతల్లో ఒకటి. హైడ్రాలిక్‌ విధానం ద్వారా అగ్నిమాపక సిబ్బంది పెద్ద భవంతుల్లోకి చేరుకునేలా వీటిని తీర్చిదిద్దారు. ఈ నిచ్చెనకే నీటి పైపు అనుసంధానమై ఉంటుంది. దాంతో 54 అడుగుల ఎత్తు నుంచి మంటలు ఆర్పవచ్చు.
101 మీటర్ల ఎత్తయిన శకటం తిరిగేలా  స్థలం వదిలితేనే అనుమతులిస్తున్నా..
హైదరాబాద్‌ శివార్లలో బహుళ అంతస్తుల భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. సమీప భవిష్యత్తులో 100-150 మీటర్ల ఎత్తయిన వాటిని నిర్మించే అవకాశాలూ ఉన్నాయి. ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మితమవుతున్న భవంతులకు 101 మీటర్ల ఎత్తైన శకటం తిరిగేలా స్థలం వదిలితేనే అనుమతులిస్తున్నారు. కానీ అసలు శకటం కొనుగోలుకే బడ్జెట్‌ లేకపోవడం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఈ బహుళ అంతస్తుల ప్రాంతంలో ఏదైనా భారీ అగ్నిప్రమాదం సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టం ముప్పు అనంతం.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు