పల్లెవిస్తున్న టీకాస్త్రం

ప్రధానాంశాలు

పల్లెవిస్తున్న టీకాస్త్రం

వ్యాక్సినేషన్‌లో గ్రామీణుల స్ఫూర్తి
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 5.10 లక్షల మందికి టీకాలు
ఫలిస్తున్న ప్రజాప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది కృషి

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: పల్లెలు కరోనాపై పోరుకు టీకాస్త్రాన్ని సంధిస్తున్నాయి. వైరస్‌ రూపంలో ఎదురొచ్చిన కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాయి. గడిచిన వారం రోజుల్లో గ్రామాల్లో టీకాల కార్యక్రమం జోరందుకుంది. కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఇప్పటివరకు 5.10 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకుని స్ఫూర్తి చాటారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాలలో ఒకేరోజు 45 ఏళ్లు పైబడిన 718 మందికి టీకాలు వేశారు. గర్షకుర్తిలో 761 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. గోపాల్‌రావుపల్లె అనే చిన్నపల్లెలో అర్హులందరూ టీకా తీసుకునేలా ఆ ఊరి సర్పంచి చొరవ చూపించారు. పల్లె నుంచి గంగాధరలోని పీహెచ్‌సీకి వెళ్లేందుకు ట్రాక్టర్‌ సమకూర్చి 65 మందికి టీకా వేయించారు. పెద్దపల్లి జిల్లా రత్నాపూర్‌ గ్రామం 80 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా 100కిపైగా గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
15 జిల్లాల్లో లక్ష మందికి పైగా..
హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల తరువాత సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లోని గ్రామీణ ప్రజలు టీకాపై అత్యధిక ఆసక్తి కనబరుస్తున్నారు.  సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 1,98,370 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కరీంనగర్‌ (1,93,011 మంది), యాదాద్రి- భువనగిరి (1,62,712), నిజామాబాద్‌ (1,50,621), కామారెడ్డి (1,47,037), సంగారెడ్డి (1,24,243), జగిత్యాల (1,22,573), నిర్మల్‌ (1,20,135), ఖమ్మం (1,20,085), భద్రాద్రి- కొత్తగూడెం (1,15,285), సూర్యాపేట (1,15,736), నల్గొండ (1,06,594) జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎక్కువగా పట్టణాలున్న హైదరాబాద్‌ (7,36,612), మేడ్చల్‌- మల్కాజిగిరి (4,07,480), రంగారెడ్డి (3,81,934) జిల్లాల్లోనూ టీకాల కార్యక్రమం జోరందుకుంటోంది. మొత్తంగా 15 జిల్లాల్లో లక్ష మందికి పైగా వ్యాక్సిన్‌ పొందటం విశేషం.

అవగాహన మంత్రంతో..
ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యఆరోగ్య సిబ్బంది కలిసికట్టుగా గ్రామీణ ప్రజల్ని టీకాలు వేసుకునేలా అవగాహన కల్పించడంతో సఫలీకృతులవుతున్నారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక వాహనాలు సమకూర్చుతున్నారు. కరీంనగర్‌, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని చాలా పీహెచ్‌సీల్లో 3వేల నుంచి 5వేలకుపైగా డోస్‌లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 45.20 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోగా.. ఇందులో 45-60 ఏళ్లవారు 20.47 లక్షల మంది ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన 14.53 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇక ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పనిచేస్తున్న వారిలో 30 ఏళ్లలోపు వాళ్లు 1.29 లక్షల మంది టీకా తీసుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని