ఏమిటీ పరీక్ష?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏమిటీ పరీక్ష?

ప్రభుత్వ ఆధ్వర్యంలో తగ్గుతున్న కరోనా నిర్ధారణ టెస్ట్‌లు
15 నిమిషాలకే కిట్‌లు అయిపోయాయంటున్న సిబ్బంది
   సతమతమవుతున్న  పేద, మధ్యతరగతి ప్రజలు

* వరంగల్‌ శివనగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి రెండు రోజులుగా సీకేఎం ఆసుపత్రికి వెళ్లినా కరోనా పరీక్ష చేయలేదు. బుధవారం పరిమిత సంఖ్యలో చేసిన అధికారులు ఆయన్ను తిరిగి వెనక్కు పంపించారు. దీంతో ప్రైవేటులో రూ.వెయ్యి చెల్లించి చేయించుకున్నారు.
* మెదక్‌ జిల్లా కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకి 150 మందికి పరీక్షలు నిర్వహించేవారు. వారం రోజులుగా 50 మందికే చేస్తున్నారు. టెస్టులు ప్రారంభించిన 15 నిమిషాల్లోనే కిట్లు అయిపోయాయంటూ వెనక్కు పంపిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంటే... ప్రభుత్వ ఆధ్వర్యంలో వైరస్‌ నిర్ధరణ పరీక్షలు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్‌ 20 నుంచి చూస్తే.. ఆ రోజు అత్యధికంగా 1.30 లక్షల టెస్టులు నిర్వహించారు. ఇప్పుడు దాదాపు 70 వేలకు అటూఇటూగా ఉంటున్నాయి. సొంతూళ్ల నుంచి 10-20 కి.మీ దూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకొని ఉదయం ఆరు గంటలకే వరుస కట్టినా పరీక్ష జరుగుతుందన్న భరోసా లేకుండా పోయింది. వైద్యఆరోగ్య సిబ్బంది ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పది పదిహేను నిమిషాలకే కిట్లు అయిపోయాయని చెబుతున్నారు. కిట్ల సంఖ్యకు తగ్గట్టు టోకెన్లు జారీచేసి మిగతా వారిని పంపించేస్తున్నారు. సకాలంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయక, ఫలితంగా వైద్యం అందడంలో జాప్యంతో బాధితుల ఆరోగ్యం క్షీణించి అత్యవసర వైద్య కేటగిరీలోకి వెళ్తున్నారు. ప్రైవేటులో ఏప్రిల్‌ 20 నుంచి గణాంకాలను పరిశీలిస్తే ప్రతిరోజూ సగటున 18 వేలకు పైగా పరీక్షలు జరుగుతున్నాయి. వారం రోజులుగా మొత్తం పరీక్షల్లో 25 శాతం ప్రైవేటు కేంద్రాల్లో చేసినవి ఉన్నాయి.
పేద కుటుంబాలపై భారం....
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరాల మేరకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ల్లో రూ.1,500 వరకు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జనం తాకిడి ఎక్కువగా ఉంటే రూ.2 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఆర్టీపీసీఆర్‌కు రూ.500, ఇంటికి వచ్చి పరీక్ష నిర్వహిస్తే రూ.750 తీసుకోవాలి. ‘‘ఇంట్లో ఒక్కరికి కరోనా వస్తే అందరూ పరీక్ష చేయించుకోవాలంటూ ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. మా ఇంట్లో ఒకరికి కొవిడ్‌ వచ్చింది. ఇంట్లో ఐదుగురం ఉంటాం. మిగతా నలుగురం ప్రభుత్వ కేంద్రానికి వెళ్లి వరుసలో నిలబడినా టెస్టు చేయలేదు. ప్రైవేటులో ఒక్కొక్కరికి రూ.వెయ్యి చెల్లించాల్సి వచ్చింది.’’ అని హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన దేవేందర్‌ తెలిపారు. ‘‘జ్వరం వచ్చింది. కొవిడ్‌ అనే సంశయంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ కిట్లు లేవు. ఇంట్లోని ముగ్గురు కుటుంబ సభ్యులం ఉండగా ఒక్కొక్కరం రూ.1,100 చెల్లించి ప్రైవేటు ల్యాబ్‌లో యాంటిజెన్‌ పరీక్ష చేయించుకున్నాం’’ అని హైదరాబాద్‌లోని మూసాపేటకు చెందిన రవీందర్‌ వివరించారు. మరోపక్క పరీక్షల సంఖ్య ఎక్కువ ఉంటే కేసులు ఎక్కువగా, తగ్గితే తక్కువగా వస్తున్నాయి. ఏప్రిల్‌ 26న అత్యధికంగా 10,122 కేసులు వచ్చాయి. ఆరోజు జరిగిన మొత్తం 99,638 పరీక్షల్లో పాజిటివ్‌ రేటు 10.15 శాతం. మే 4న పరీక్షల సంఖ్య 77,435 కాగా పాజిటివ్‌ రేటు 8.21. ఈ తొమ్మిది రోజుల సగటు చూస్తే 9.67గా ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు