దండిగా ఫండుంది.. స్పందనే లేదండి!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దండిగా ఫండుంది.. స్పందనే లేదండి!

ఉద్యాన పంటల శుద్ధి, నిల్వ యూనిట్లకు కేంద్రం ప్రోత్సాహం 

  యూనిట్‌కు గరిష్ఠంగా రూ. 50 లక్షల రాయితీ

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ విపత్తు నేపథ్యంలో పంటలపై ఆదాయం పెంచేందుకు ఉద్దేశించిన ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’(ఏఐఎఫ్‌) రాష్ట్రంలో సద్వినియోగానికి నోచుకోవటం లేదు.. సాగు సంబంధిత మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఈ నిధి కింద రూ.లక్ష కోట్లను కేటాయించింది. ఒక్కో యూనిట్‌ ఏర్పాటుకయ్యే వ్యయంలో సుమారు రూ.అరకోటి మేర భారీగా రాయితీలిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ తదితర రాష్ట్రాల రైతులు, పారిశ్రామికవేత్తలు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నా.. తెలంగాణ నుంచి ఈ నిధికి దరఖాస్తులు రావడం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
మౌలిక సదుపాయాల కొరత
పంటల కోత అనంతరం శుద్ధి, నిల్వ, ప్యాకింగ్‌ వంటి మౌలిక సదుపాయాల కొరత తెలంగాణలో తీవ్రంగా ఉంది. వీటి కల్పనకు భారీ రాయితీలిస్తున్నా రాష్ట్రంలో స్పందన కరవైంది. జాతీయ ఉద్యాన మండలి(ఎన్‌హెచ్‌బీ)కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఒక్కో యూనిట్‌ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో గరిష్ఠంగా రూ.50.75 లక్షల రాయితీ లభిస్తుంది. రాష్ట్ర ఉద్యానశాఖ ఈ పథకానికి నోడల్‌ ఏజెన్సీగా ఉన్నా రైతులకు పెద్దగా ప్రోత్సాహం అందడం లేదు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలయ్యాక జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పంటలకు డిమాండు పెరిగింది. కానీ.. మౌలిక సదుపాయాలు లేక ఎగుమతులు కష్టసాధ్యమవుతున్నాయి. సమస్యను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా శీతల గిడ్డంగులు, ప్యాక్‌ హౌస్‌లు, రవాణా పార్కులు, కాయలను మాగబెట్టే కేంద్రాలు(రైపనింగ్‌ ఛాంబర్లు), గోదాములు తదితరాల నిర్మాణాలకు ఏఐఎఫ్‌ నుంచి రుణాలు, రాయితీలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఉదాహరణకు తెలంగాణలో ఈ ఏడాది మామిడికాయల దిగుబడి భారీగా ఉన్నా శాస్త్రీయంగా మాగబెట్టేందుకు రైపనింగ్‌ ఛాంబర్లు లేవు. ఔత్సాహికులు గరిష్ఠంగా రూ.కోటిన్నరలోపు ఖర్చుతో ఛాంబర్‌ను నిర్మిస్తే నిర్మాణ వ్యయంలో 35 శాతం (రూ.50.75 లక్షల) వరకూ రాయితీ లభిస్తుంది. శీతల గిడ్డంగిని నిర్మిస్తే నిల్వ సామర్థ్యాన్ని బట్టి టన్నుకు రూ.6800-9500 వరకూ రాయితీ దక్కుతుంది. యూనిట్ల నిర్మాణానికి బ్యాంకుల నుంచి రూ.2కోట్ల వరకూ రుణమిస్తారు. ఏడేళ్లలోగా చెల్లించవచ్చు. వడ్డీలో 3 శాతాన్ని ఎన్‌హెచ్‌బీ భరిస్తుంది.

 ఎన్‌హెచ్‌బీకి దరఖాస్తు చేసుకోవచ్చు

ఏఐఎఫ్‌ పరిధిలో యూనిట్ల ఏర్పాటుకు రైతులతో పాటు ఆసక్తిగలవారు ఎన్‌హెచ్‌బీకి దరఖాస్తు చేస్తే రాయితీ, బ్యాంకు రుణం మంజూరవుతాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డ్వాక్రా సంఘాల వంటివి వీటిని నిర్మించుకుంటే ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుంది. ఏ జిల్లాలో ఏ పంట ఎక్కువ పండుతుంటే అక్కడ దానికి సంబంధించి ప్యాక్‌హౌస్‌, రైపనింగ్‌ ఛాంబర్‌, శీతలగిడ్డంగి వంటివి నిర్మించుకోవచ్చు.

- వెంకట్రాంరెడ్డి, ఉద్యానశాఖ సంచాలకుడు


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు