Steroids: ఆయుధమే.. అప్రమత్తంగా వాడాలి!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Steroids: ఆయుధమే.. అప్రమత్తంగా వాడాలి!

 విచ్చలవిడిగా స్టిరాయిడ్‌ల వినియోగంతో అనర్థాలు
 సరైన రీతిలో వాడకపోతే విషతుల్యం కూడా
 వైరల్‌ న్యుమోనియా సహా తీవ్ర ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల దాడి
 తొలిదశలో ముప్పును గుర్తించకపోతే ప్రాణాంతకం
 వాడకంపై అవగాహన తప్పనిసరంటున్న నిపుణులు

కొవిడ్‌ చికిత్సలో స్టిరాయిడ్‌ ఔషధాలు అపర సంజీవనిగానే ఉపయోగపడుతున్నాయనడంలో ఎటువంటి సందేహాలు లేవు. వీటిని సకాలంలో ఇవ్వడం ద్వారా ప్రాణాపాయ ముప్పు నుంచి కొవిడ్‌ రోగులు బయటపడుతున్నారని నిపుణులే చెబుతున్నారు. పేరుమోసిన పెద్దాసుపత్రి నుంచి మామూలు పల్లెల్లో గ్రామీణ వైద్యుని వరకూ.. కొవిడ్‌ చికిత్సలో ఇప్పుడు  స్టిరాయిడ్‌ ఔషధాలను వినియోగించాలనే పరిజ్ఞానం వచ్చేసింది. కొందరు రోగులు కూడా సొంతంగానే వీటిని వినియోగిస్తున్నారు కూడా. అయితే ఇక్కడే అతి ప్రమాదకరమైన దారిలోకి చికిత్స విధానం దూసుకెళ్తోంది. స్టిరాయిడ్‌ ఔషధాలను కొవిడ్‌ రోగుల్లో ఏ సమయంలో వినియోగించాలి? ఎంత మోతాదులో ఎన్ని రోజులు వాడాలి? అనే ప్రాథమిక అవగాహన లోపిస్తోంది. కేవలం స్టిరాయిడ్‌ ఇస్తే మంచిదనే భావనతో వాడుతున్నారే తప్ప.. ఎప్పుడు వాడాలనే కనీస అవగాహనపై దృష్టిపెట్టడం లేదు. సరైన రీతిలో వాడాల్సిన విధానంలో వాటిని వినియోగించకపోవడంతో.. అపర సంజీవని కాస్తా విషంగా మారుతోంది. వైరల్‌ న్యుమోనియా సహా తీవ్ర ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల దాడికి కొవిడ్‌ రోగులు బలవుతున్నారు.  పూర్తి అవగాహనతోనే స్టిరాయిడ్‌ ఔషధాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదకరంగా ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు: కొవిడ్‌ చికిత్సలో సాధారణంగా డెక్సా మెథజోన్‌, మిథైల్‌ ప్రెడ్‌నెసలోన్‌, డెఫ్లూజకొర్ట్‌ తదితర స్టిరాయిడ్స్‌ను వినియోగిస్తుంటారు. వీటిని తీసుకున్నప్పుడు అవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఇదే సమయంలో కొవిడ్‌.. మన రక్తంలో ఐరన్‌ను పెంచేస్తుంది. ఫంగస్‌ బతకడానికి ఈ ఐరన్‌ చాలా ముఖ్యం. మనందరిలోనూ ఫంగస్‌  ఉంటుంది. కానీ అది మనపై దుష్ప్రభావం కలిగించే స్థాయిలో ఉండదు. ఎప్పుడైతే మన రోగ నిరోధక శక్తి తగ్గుతుందో.. తెల్లరక్త కణాల్లోని(డబ్ల్యూబీసీ) ‘న్యూట్రోఫిల్స్‌’ సరిగ్గా పనిచేయవు. సాధారణంగా మన శరీరంలో ఫంగస్‌ పెరగకుండా ఇవి కాపాడుతుంటాయి. అయితే స్ట్టిరాయిడ్స్‌ వాడడం వల్ల న్యూట్రోఫిల్‌్్స పనితీరు దెబ్బతింటుంది. పైగా స్టిరాయిడ్‌ వల్ల రక్తంలో చక్కెర స్థాయులు కూడా పెరుగుతాయి. ముందే మధుమేహం ఉన్నవారిలో మరింత ఎక్కువగా షుగర్‌ పెరుగుతుంది. ఈ క్రమంలో శరీరంలో ఐరన్‌ మరింతగా పెరుగుతుంది. దీంతో ఫంగల్‌ వ్యాధి ప్రబలడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దీంతో ప్రధానంగా మూడు రకాల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తున్నట్లుగా నిపుణులు గుర్తించారు.

మూడింటితోనూ ముప్పే

ఆస్పార్‌జిల్లస్‌

ఇది ప్రధానంగా ఊపిరితిత్తులు, సైనస్‌, మెదడులో వస్తుంటుంది. దీన్ని గుర్తించడానికి ఊపిరితిత్తుల స్కాన్‌ తీస్తే.. కొవిడ్‌ మచ్చలతో పాటు చిల్లులు చిల్లులుగా ఫంగస్‌ కూడా కనిపిస్తుంది. సైనస్‌లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ చేరితే.. జలుబు, తలంతా భారంగా ఉండడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో వచ్చినప్పుడు విపరీతంగా తలనొప్పి, పక్షవాతం మాదిరిగా లక్షణాలు బయటపడతాయి. ఊపిరితిత్తుల్లో చేరితే దగ్గు, ఆయాసం వస్తుంది. దగ్గుతున్నప్పుడు రక్తం కూడా పడుతుంది.


మ్యూకర్‌మైకోసిస్‌

ఇది ప్రధానంగా సైనస్‌, కళ్ల చుట్టూ ఉండే పొరల్లో, మెదడుకు కూడా వ్యాప్తి చెందుతుంది. వీరిలో ముఖంపై నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. సైనస్‌ వద్ద నున్న నరాలు ప్రభావితమైనప్పుడు ముఖం మీద కొన్నిసార్లు తిమ్మిర్లు పట్టినట్లుగా, మొద్దుబారినట్లుగా ఉంటుంది. ఇవన్నీ ముందస్తు ప్రమాదకర సంకేతాలు. కొందరికి కంటిలో ఇన్‌ఫెక్షన్‌ పెరిగినప్పుడు ఎదురుగా ఉన్న వస్తువు, మనిషి రెండులా కనిపిస్తుంటాయి. చూపు మందగించడం కూడా ఉంటుంది. కనుగుడ్డు బయటకు పొడుచుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. ముఖంపై స్పర్శ తెలియకపోవడం, ముక్కు నుంచి నల్లటి స్రావాలు కారడం, నోట్లో అంగడిపై నల్లటి మచ్చలు కూడా కనిపిస్తాయి.


క్యాండిడా

నోటిలో, అన్నవాహిక, రక్తంలో కూడా వస్తుంటుంది. నోట్లో అల్సర్లు, మింగడంలో ఇబ్బంది, కడుపులో, ఛాతీలో మంట వంటి అసిడిటీ లక్షణాలు కనిపిస్తుంటాయి. చాలామంది అసిడిటీ మాత్రలు వేసుకుంటూ కాలయాపన చేస్తుంటారు. నోట్లో తెల్లని మచ్చలు వస్తాయి. ఇది కొన్నిసార్లు రక్తంలో ఇన్‌ఫెక్షన్‌కు కూడా దారితీయొచ్చు. అప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. మింగడంలో ఇబ్బంది ఉంటే అన్నవాహికలో కూడా క్యాండిడా వ్యాప్తి చెందినట్లే అనుమానించాలి.

ఎప్పుడు వాడాలి?

*  కొవిడ్‌ గుర్తించిన మొదటి వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
* 8వ రోజు నుంచి కూడా రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పుడు స్టిరాయిడ్స్‌ వాడకూడదు.
* కొన్ని ప్రధానమైన లక్షణాలను బట్టి వాడాలా? వద్దా? అనేది వైద్యులు నిర్ణయిస్తారు.
* తొలివారంలోనూ.. 8వ రోజు తర్వాత కూడా రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు 94 కంటే తగ్గినప్పుడు వైద్యుని సలహా మేరకు వాడాలి.
* ఒకవేళ జ్వరం తగ్గకుండా వస్తున్నప్పుడు.. ‘సి-రియాక్టివ్‌ ప్రొటీన్‌ (సీఆర్‌పీ)’ పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో సీఆర్‌పీ 30-40 కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు స్టిరాయిడ్‌ ఇవ్వాలి.
* తొలివారం తర్వాత కేవలం జ్వరం వస్తోందని స్టిరాయిడ్‌ వాడకూడదు.

విచ్చలవిడి స్టిరాయిడ్స్‌తో ముప్పే
-డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా, ప్రముఖ శ్వాసకోశ నిపుణులు.

స్టిరాయిడ్స్‌ వాడడం మొదలుపెట్టిన నాలుగైదు రోజుల నుంచి ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రావడానికి అవకాశముంది. కొందరిలో కోర్సు పూర్తయిన రెండుమూడు రోజుల్లోనూ ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తున్నాయి. తలనొప్పి, ముఖంపై తిమ్మిర్లు, దగ్గు, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం అనేవి అన్ని రకాల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లలోనూ సాధారణ లక్షణాలుగానే పరిగణించాలి. సైౖనస్‌, ఛాతీకి సీటీ స్కాన్‌ చేయించడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ గుర్తించవచ్చు.  క్యాండిడా నోట్లో గానీ, అన్నవాహికలో గానీ ఉంటే సాధారణ చికిత్సతో తగ్గిపోతుంది. ఈ దశలో ప్రాణాపాయం కాదు. కానీ ఇదే క్యాండిడా రక్తంలోకి చేరితే మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. ఆస్పార్‌జిల్లస్‌ కూడా కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. అన్నిటి కంటే ప్రమాదకరమైంది.. ‘మ్యూకర్‌మైకోసిస్‌’. ఇది సైనస్‌లో మొదలై.. అక్కడి నుంచి కంటిలోకి, ఆ తర్వాత మెదడులోకి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. 2-7 రోజుల్లోనే తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. దీని చికిత్సకు ఒక్కరోజుకు సుమారు రూ.50 వేలకు పైగా ఖర్చవుతుంది. కొవిడ్‌ ఎంత ప్రమాదకరమో.. ఇందులో స్టిరాయిడ్‌ ఔషధాలను సరిగ్గా వినియోగించకపోతే వచ్చే అనర్థాలు కూడా అంతే ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి.

చూస్తుండగానే ప్రమాదకరంగా మారుతుంది
-డాక్టర్‌ శ్రీనివాస కిషోర్‌, ఈఎన్‌టీ సర్జన్‌.

క్యాండిడా, ఆస్పార్‌జిల్లస్‌లు ఎక్కువ సందర్భాల్లో ఔషధ చికిత్సతోనే తగ్గిపోతాయి. మ్యూకర్‌మైకోసిస్‌లో మాత్రం సర్జరీ అవసరమవుతుంది. వినికిడి లోపం తలెత్తుతుంది. ఇది నరం ద్వారా కూడా వ్యాప్తి చెందుతోంది. కంటి నరానికి దగ్గరగా కొన్ని గుంపులు గుంపులుగా సైనస్‌లుంటాయి. నరాలు, రక్తనాళాలు ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇది సైనస్‌కు దగ్గరగా ఉండడంతో.. ఇక్కణ్నుంచి కంటి నరాలు, రక్తనాళాల్లోకి కూడా ఈ ఫంగస్‌ వ్యాప్తి చెందుతుంది. దీంతో సమస్య ఏమిటో గుర్తించే లోగానే  కంటిని దెబ్బతీస్తుంది. మొదట విపరీతమైన తలనొప్పి ఉంటుంది. ఆ తర్వాత రెండు రోజుల్లో నొప్పి పోయి ఉన్నట్టుండి తిమ్మిర్లు వస్తాయి. స్పర్శ తెలియదు. కన్ను వెనకాల లాగుతున్నట్లుగా ఉంటుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కంటిని కూడా తొలగించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీన్ని గనుక తొలిదశలోనే పట్టుకోగలిగితే.. కంటిలోకి ఇంజక్షన్లను ఇవ్వడం ద్వారా కన్నును తొలగించకుండా కాపాడుకోవచ్చు. మ్యూకర్‌మైకోసిస్‌ను గనుక తొలి 6 రోజుల్లో గుర్తించగలిగితే.. 70 శాతం వరకూ నయం చేయొచ్చు. అదే 6 రోజులు దాటితే నయమయ్యే అవకాశాలు 40 శాతానికి తగ్గుతాయి. ఒకవేళ కంటి నుంచి ఇన్‌ఫెక్షన్‌ మెదడుకు వ్యాపిస్తే.. 70 శాతం వరకూ ప్రాణాపాయం  ఉంటుంది. ఇటీవల ఒకే వ్యక్తిలో రెండు రకాల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకడం కూడా చూస్తున్నాం. సైనస్‌కు ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు ఉప్పు కలిపిన నీటితో ‘జలనేతి’ యోగాసనాన్ని చేయడం ద్వారా ఉపయోగం ఉంటుంది. సాధారణ ఆవిరి పట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు