పిల్లలకూ టీకా రక్షణ అవసరం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలకూ టీకా రక్షణ అవసరం

ప్రభుత్వాలు తప్పనిసరి చేయాలి
లేకుంటే కొవిడ్‌పై పోరు అసాధ్యం
అంతర్జాతీయ నిపుణులు  

ఆక్స్‌ఫర్డ్‌: చిన్నారులకు కొవిడ్‌-19 టీకా వేసే అంశం ఇటీవల విస్తృతంగా చర్చనీయాంశమైంది. 12-15 ఏళ్ల మధ్యవారికి వ్యాక్సిన్‌ వేసేందుకు ఈ నెల 5న కెనడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ వెంటనే అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ఇతర దేశాలూ ఈ మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. అంతేకాదు.. 12 ఏళ్ల కన్నా తక్కువ వయసువారికీ టీకాలు వేసే అంశం ఆయా చోట్ల పరిశీలనలో ఉంది. నైతిక విలువల నిపుణులు ఆంటోనీ స్కెలిటన్‌ (వెస్ట్రన్‌ యూనివర్సిటీ, కెనడా), లీసా ఫోర్స్‌బర్గ్‌ (ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌) దీన్ని స్వాగతిస్తున్నారు. కౌమారప్రాయులు, చిన్నారుల్లో ఎక్కువ మందికి టీకా వేయకుంటే కొవిడ్‌-19 నుంచి సమాజాన్ని రక్షించడం అసాధ్యమని వారు పేర్కొన్నారు. వ్యాక్సిన్ల పట్ల సంకోచం, ఇతర అపోహల వల్ల ఈ లక్ష్యసాధనలో సవాళ్లు ఎదురుకావొచ్చని తెలిపారు. తమ సంతానానికి టీకాలు వేయించని తల్లిదండ్రులకు జరిమానాలు విధించడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు పెట్టడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవచ్చని, అవి నైతికంగా సబబేనని ఆంటోనీ, లీసాలు తెలిపారు. చిన్నారులకు వ్యాక్సిన్లను సమర్థిస్తూ వారు మూడు తార్కిక కారణాలను తెరపైకి తెచ్చారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
చిన్నారులకు హాని
కొవిడ్‌ వల్ల పిల్లల్లో కొందరికి గణనీయ ముప్పు పొంచి ఉంది. అవయవాలు దెబ్బతినడం, మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌-సీ), మరణం వంటివి తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యానికి హాని, మరణం వంటి ముప్పులను గణనీయంగా తగ్గించడానికి చౌకైన, సులువైన సాధనం అందుబాటులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాటిని వినియోగించుకోవాలి. చిన్నతనంలో వేసే ఇతర టీకాల స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా సురక్షితం, సమర్థమంతమని తేలితే.. అది చిన్నారులను కరోనా బారి నుంచి రక్షించే సులువైన చౌకైన సాధనమవుతుంది. మరోవైపు తమ సంతానాన్ని సులువుగా రక్షించే అవకాశమున్నప్పటికీ దానిపై అలక్ష్యం వహించే తల్లిదండ్రుల నుంచి పిల్లలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై కూడా ఉంది. అందులో భాగంగా.. బలమైన కారణాలు లేకుంటే చిన్నారులకు కొవిడ్‌ టీకా కచ్చితంగా వేయించాలన్న నిబంధనలను పెట్టాలి.
ఇతరులకు ముప్పు
కొవిడ్‌ ముప్పు అందరికీ పొంచి ఉంది. ముఖ్యంగా.. టీకా పొందని చిన్నారుల ద్వారా అది మరింత ఎక్కువగా ఉంటుంది. తరగతులు వంటి భారీ బృంద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి పిల్లలు ఎక్కువగా కారణమవుతుంటారు. వారు టీకా పొందనంతకాలం.. కరోనాలో కొత్త వైరస్‌లు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అందువల్ల చిన్నారులకు సురక్షిత, సమర్థ కొవిడ్‌ టీకా ఇవ్వడం ద్వారా.. కరోనా సంబంధ ఆరోగ్య సమస్యలు, మరణం బారి నుంచి ఇతరులను రక్షించేందుకు తల్లిదండ్రులకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనా ఉంది.
పిల్లల శ్రేయస్సు..  
లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలు, పాఠశాలల మూసివేత వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. వాటి నుంచి చిన్నారులను కాపాడాల్సిన అవసరం ఉంది. పిల్లల వికాసంలో ‘శ్రేయస్సు’ కీలకం. తోడ్పాటును అందించే బంధాలు, వివిధ రూపాల్లో ఆటలు, మేధో వికాసం వంటి అంశాలు పిల్లల శ్రేయస్సుకు దోహదపడతాయి. కొవిడ్‌ వ్యాప్తి, ఆంక్షల వల్ల వీటికి అవకాశాలు తగ్గిపోయాయి. వారి విద్యపైనా పెను ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో మహమ్మారికి త్వరగా ముగింపు పలకడం వల్ల.. ముప్పు గురించి చింతలేని స్వేచ్ఛాయుత వాతావరణంలో చిన్నారులు వీటిని ఆస్వాదించగలుగుతారు. ఒకవ్యక్తి జీవితంలో బాల్యం నిడివి చాలా స్వల్పం. అయితే పెరిగి పెద్దయ్యాక ఎదురయ్యే సవాళ్లకు ఆ చిరుప్రాయమే వారిని సన్నద్ధం చేస్తుంది. ఇందుకోసం బాల్యానికే ప్రత్యేకమైన కొన్ని అంశాలను చిన్నారులు  ఆస్వాదించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అందుకు పూచీకత్తు వహించే సమర్థ సాధనం.. టీకా.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు