చమురు మంటలు పైపైకి!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చమురు మంటలు పైపైకి!

 ఏడాదిలో లీటరు పెట్రోల్‌పై  రూ.25.34, డీజిల్‌పై రూ.26.44 పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రో ధరల మారథాన్‌ కొనసాగుతోంది. బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర 25 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగాయి. రవాణా దూరం ఆధారంగా రాష్ట్రంలోని కుమురంభీం, జోగులాంబ-గద్వాల్‌ జిల్లాల్లో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ.101.37కు చేరింది. మరో 12 జిల్లాల్లో రూ.వంద దాటింది. హైదరాబాద్‌ సహా మిగిలిన అన్ని జిల్లాల్లో రూ.వందకు చేరువుగా ఉంది. కరోనాతో ఆదాయాలు తగ్గి అల్లాడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు భగ్గుమంటున్న పెట్రో ధరలు గోరుచుట్టుపై రోకటిపోటులా మారాయి. ఇతర ఏ వస్తువు, సేవలపై పన్ను పెంచకున్నా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచితే అన్నింటి ధరలూ పెరిగినట్టే. అంతగా ప్రజల జీవితావసరాల్లో భాగమైన చమురు ధరలు గత ఏడాది కాలంలో చరిత్రలో ఎన్నడూలేని విధంగా 25శాతంపైనే పెరగడం గమనార్హం. గత జూన్‌ 9న లీటరు పెట్రోలు ధర రూ.73.97 ఉండగా.. ఈ ఏడాది జూన్‌ 9న రూ.99.31కి చేరింది. అంటే రూ.25.34 పెరిగింది. పెట్రోలు ప్రాథమిక ధర రూ.35.71 కాగా హైదరాబాద్‌లో ప్రస్తుత విక్రయ ధర రూ.99.31 ఉంది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో రెండింతలు ఎక్కువ వసూలు చేస్తుండడం గమనార్హం.
ఏడాది నుంచి పెరుగుడే
1999లో లీటరు పెట్రోలు ధర రూ.28.55, డీజిల్‌ ధర రూ.11.72 కాగా.. 2018 సెప్టెంబరులో అత్యధికంగా పెట్రోలు రూ.89.06, డీజిల్‌ రూ.82.07కు చేరాయి. ఆ తరువాత కొద్ది కాలంపాటు తగ్గుతూ వచ్చాయి. 2020 జూన్‌ నుంచి లీటరు ధర ఎప్పుడూ రూ.80కి తగ్గలేదు. గతంలో నెలకోసారి మారే చమురు ధరలు.. నాలుగు సంవత్సరాల నుంచి అంతర్జాతీయ ధరల ఆధారంగా రోజుకో దఫానో లేక వారంలో అయిదు రోజులపాటు మారిపోతున్నాయి.  
ఎవరి ఇష్టం వారిది..
కేంద్రం తన వాటా పన్నును పెట్రోలుపై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 నిర్ణయించుకుని వసూలు చేస్తోంది. దీనికి అదనంగా తమకున్న స్వేచ్ఛతో రాష్ట్రాలు భిన్న శాతాల్లో వ్యాట్‌ రూపంలో వసూలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెట్రోలుపై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ వసూలు చేస్తుండగా.. వివిధ రాష్ట్రాలు 17 నుంచి 28 శాతం వరకూ విధిస్తున్నాయి. ఇలాంటి వ్యత్యాసాలతో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో లీటరు ఇంధనం ధర రూపాయిన్నర వరకు ఎక్కువగా ఉంది. తెలంగాణకు సరిహద్దున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో రూపాయికిపైగా తక్కువగా ఉంది. ఈ వ్యత్యాసాలు ఆయా రాష్ట్రాల ఆదాయంపైనా, బంకుల వ్యాపారంపైనా ప్రభావం చూపుతోంది.

రాష్ట్రాల్లోనూ స్థిర పన్నులతో ధర తగ్గుతుంది

పెట్రోలు, డీజిల్‌ పన్ను విధానాన్ని అన్ని రాష్ట్రాలు ఒకే తీరుగా వసూలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు శాతాల్లో వ్యాట్‌ వసూలు చేస్తున్నాయి. ఈ విధానంతో ప్రజలపై భారం పడుతోంది. వేరువేరుగా అయినా ఒకే మొత్తంలో వసూలు చేసే విధానాన్ని అమలులోకి తీసుకువస్తే ధరలు తగ్గుతాయి. గడిచిన ఏడాది కాలంగా కరోనా ప్రభావంతో చమురు విక్రయాలు సుమారు 40 శాతం వరకు తగ్గాయి. 

- రాజీవ్‌ అమరం, సంయుక్త కార్యదర్శి, కన్సార్షియం ఆఫ్‌ పెట్రోలియం డీలర్స్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు