పురుగుల నుంచి పంటకు రక్ష
close

ప్రధానాంశాలు

పురుగుల నుంచి పంటకు రక్ష

 పరికరం తయారు చేసిన యువ శాస్త్రవేత్త  
 ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్యశ్రీ ప్రాజెక్టుకు జేఎన్‌టీయూ గుర్తింపు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే:  సాగు సమయంలో పంటను నష్టపరిచే పురుగుల అంతానికి ఓ మార్గం కనుగొన్నారు కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుసాకకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి సీహెచ్‌ దివ్యశ్రీ. ఈమె తయారు చేసిన ‘సోలార్‌ కంట్రోల్‌ ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’కు  జేఎన్‌టీయూ గుర్తింపు లభించింది. సాధారణంగా వివిధ రకాల పంటలపై పూత దశలో తియ్యని పదార్థాన్ని తినేందుకు పెద్ద ఎత్తున రెక్కల, ఇతర పురుగులు వాలి పూతను ధ్వంసం చేస్తుంటాయి. దీంతో కాత కూడా సరిగా రాక దిగుబడి తగ్గి రైతు నష్టపోతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్న దివ్యశ్రీ పత్తి, వరి, మిరప పంటలపై ప్రయోగాలు చేశారు. ఆమె ఖమ్మంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో  బీటెక్‌ (ఈఈఈ) తృతీయ సంవత్సరం చదువుతోంది.

సౌరశక్తి ప్యానెళ్లతో...
పంట పొలాల్లో సౌరశక్తి ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా పురుగుల ఉద్ధృతిని అరికట్టవచ్చని ఆమె భావించారు. ఒక ఎకరంలో నాలుగు ప్యానెళ్లను ఏర్పాటు చేసి వాటికి బ్యాటరీతో పాటు కాంతినిచ్చే బల్బును ఏర్పాటు చేస్తే రాత్రి వేళ రెక్కల పురుగులు కాంతికి ఆకర్షితమై ఆ వేడికి తట్టుకోలేక చనిపోతాయని దివ్యశ్రీ గుర్తించారు. ఆ ప్యానెళ్ల కింద పళ్లెం లేదా టబ్బు లాంటి దాన్ని అమర్చితే మృతి చెందిన పురుగులు అక్కడే గుట్టలుగా పడిపోతాయని, వీటిని సేంద్రియ ఎరువు కింద ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ఆమె గ్రహించారు. మార్కెట్‌లో ఒక ప్యానెల్‌ ధర రూ.6,000 నుంచి రూ.7,000 వరకు ఉంటుంది. దీంతో దివ్యశ్రీ సొంతంగా ప్యానెల్‌ తయారు చేశారు. దీని వ్యయం రూ.1500. ఒకసారి ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే నాలుగేళ్లు ఉపయోగపడతాయి. సౌరశక్తిని ఉపయోగించుకుని ఇలా చీడపీడల నుంచి పంటను రక్షించుకోవచ్చు. ప్రతి ఏడాది ‘జేహబ్‌’ ద్వారా జేఎన్‌టీయూ గుర్తించే ఐదు ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టుల్లో ఈ ఏడాది ఇదీ చేరింది. దివ్యశ్రీ మాట్లాడుతూ తన ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు అతి తక్కువ ధరకే సోలార్‌ ప్యానెళ్లు అందించేందుకు ప్రయత్నిస్తానన్నారు. దీని రూపకల్పనలో ప్రియదర్శిని విద్యాసంస్థల ఛైర్మన్‌ నవీన్‌బాబు సహకరించారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని