గూడు చెదిరింది.. గుండె కదిలింది!
close

ప్రధానాంశాలు

గూడు చెదిరింది.. గుండె కదిలింది!

 కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన ఎందరో చిన్నారులు..
 వారిని అక్కున చేర్చుకునేందుకు ముందుకొస్తున్న ఔత్సాహికులు

ఆస్తిపాస్తులున్నాయి. ఆరోగ్యంగా ఉన్నాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల్లో ఎవర్నైనా అక్కున చేర్చుకోవాలని అనుకుంటున్నాం. మగ పిల్లవాడిని దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం

- దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి

నా కుమార్తె కడుపులో బిడ్డను నవమాసాలు మోసింది. ఎదుగుదల లోపంతో ప్రాణాలు కాపాడలేకపోయాం. తన గర్భసంచిలో తలెత్తిన సమస్యతో భవిష్యత్‌లో తల్లి అయ్యే అవకాశం లేదు. కరోనా వల్ల అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లల గురించి వాకబు చేస్తున్నాం. బిడ్డను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. చట్టప్రకారం దత్తత తీసుకునేందుకు అధికారులను సంప్రదిస్తున్నాం

- ఫిలింనగర్‌కు చెందిన ఓ గృహిణి

రోనాతో ఏర్పడిన పరిస్థితులు బతుకు విలువను చాటిచెబుతున్నాయి. సేవాగుణాన్ని తట్టిలేపుతున్నాయి. మహమ్మారి ప్రభావంతో కన్నప్రేమకు దూరమైన చిన్నారులను అక్కున చేర్చుకుని ఆప్యాయతలు పంచేందుకు ఆపన్నహస్తాలు ఎన్నో ముందుకొస్తున్నాయి. అప్పటివరకు కంటికి రెప్పలా చూసిన తల్లిదండ్రుల స్థానాన్ని తాము భర్తీ చేస్తామంటూ ఎందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొవిడ్‌తో తల్లిదండ్రులు మరణించిన పిల్లల్ని అక్కున చేర్చుకుంటున్నారు. అయితే, ఇదే అదనుగా మోసగాళ్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని..నిజంగా దత్తత తీసుకోవాలనుకునేవారు చట్టప్రకారం ముందుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

దరఖాస్తులు వస్తున్నాయి..  

కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి దయనీయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారుల కోసం ప్రభుత్వం వెంగళరావునగర్‌లోని మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తోంది. 31 జిల్లాల్లో ఇలాంటి పిల్లలకు విద్య, వసతి సదుపాయం కల్పిస్తున్నారు. మహిళా-శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తున్న సహాయక కేంద్రాన్ని రోజూ 40-50 మందికి పైగా సంప్రదిస్తుంటారు. అందులో 10-20 వరకూ అనాథ పిల్లల దత్తత గురించే ఉంటున్నట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 19 నుంచి మే నెలాఖరు వరకూ సుమారు 100-120 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. స్పందించి ముందుకు వస్తున్న వారిలో పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టని దంపతులు, అప్పటికే ఒకరిద్దరు పిల్లలున్నా.. మరొక బిడ్డను సాకేందుకు స్తోమత ఉన్నవారూ ఉంటున్నారు.

చట్టప్రకారమే దత్తత

సామాజిక మాధ్యమాలు, మధ్యవర్తుల మాటలు నమ్మి పిల్లలను దత్తత తీసుకోవటం చట్టరీత్యా నేరం. దత్తతకు ప్రత్యేకమైన చట్ట ప్రక్రియ ఉంది. జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌) 2015, సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ-2017 నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మహిళా-శిశు సంక్షేమ శాఖ, జిల్లా శిశు సంరక్షణ విభాగం (డీసీపీయూ), పిల్లల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ), చైల్డ్‌ లైన్‌ వంటి సంస్థలు దత్తత ప్రక్రియను పర్యవేక్షిస్తుంటాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. దరఖాస్తు చేసే దంపతుల ఫొటో/పాన్‌కార్డు/జనన ధ్రువీకరణ పత్రం/ఆధార్‌కార్డు/నివాస/దత్తత తీసుకునే వ్యక్తులు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారంటూ వైద్య ధ్రువీకరణ, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, ఒకవేళ విడాకులు/ఒంటరిగా ఉన్నవారైతే సంబంధిత పత్రాలను జతచేయాల్సి ఉంటుంది.

ఆశ్రమాలకు రాము!
 బంధువుల దగ్గర ఉండి చదువుకుంటామంటున్న పిల్లలు
 కరోనాతో కన్నవారిని కోల్పోయిన చిన్నారుల మనోగతం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, న్యూస్‌టుడే-వెంగళ్‌రావునగర్‌

కొవిడ్‌ రెండో దశ ఎంతో మంది పిల్లల కన్నవారిని తీసుకెళ్లింది. వారి కలలను నిర్దాక్షిణ్యంగా తుంచేసింది. అనాథలుగా మిగిల్చి.. వారి భవితవ్యాన్ని అయోమయంలోకి నెట్టేసింది. అలా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలిచి ఆందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 140 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వీరిలో ఏడాది వయస్సు నుంచి పదిహేనేళ్ల వారూ ఉన్నారు. వీరి సంరక్షణ కోసం హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో చిన్నపిల్లల హోంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైద్యులతో పాటు సిబ్బందినీ నియమించింది. ప్రతి జిల్లాలోనూ హోంలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనాథలుగా మారిన పిల్లల అభిప్రాయాలను తెలుసుకోగా.. వారిలో ఒక్కరు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనాథాశ్రమాలకు రావడానికి ఇష్టపడటం లేదని ఓ అధికారి తెలిపారు. ‘‘బంధువుల దగ్గరే ఉండి చదువుకోవడానికి వాళ్లు ఇష్టపడుతున్నారు. అందుకే వారికి ఇతరత్రా తోడ్పాటు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున రెండు నెలలకు సరిపడా రేషన్‌, ఇతర వస్తువులను అందజేశాం. ప్రైవేటు సంస్థల సహకారంతో ప్రతి నెలా రూ.2 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నాం. గురుకుల పాఠశాలల్లో చేరతామంటే పూర్తిస్థాయిలో విద్య అందించేందుకూ ఏర్పాట్లు చేశాం. కొన్ని ప్రైవేటు పాఠశాలలు సైతం ఉచితంగా విద్య అందించేందుకు ముందుకు వస్తున్నాయని’’ ఆయన వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని