కొనుగోళ్లలో కొత్త రికార్డు
close

ప్రధానాంశాలు

కొనుగోళ్లలో కొత్త రికార్డు

ఈ ఏడాది రెండు సీజన్లలో కోటి 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లలో గత రికార్డులను తెలంగాణ ప్రభుత్వం తిరగరాసిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత యాసంగి, వానాకాల సీజన్లలో కలిపి కోటి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. గురువారం పౌరసరఫరాల భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2019-20 రెండు సీజన్లలో కలిపి 1.11 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. అప్పటికి అది రికార్డు. దానిని అధిగమిస్తూ ఈ ఏడాది రెండు సీజన్లలో కలిపి దాదాపు 1.40 కోట్ల టన్నుల సేకరణ పూర్తయింది. రాష్ట్రం ఏర్పడ్డాక 2014-15 యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ప్రస్తుత యాసంగిలో 90 లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి కొనుగోలు చేశాం. 2014-15లో రెండు పంటలూ కలిపి రాష్ట్రంలో 35 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే ప్రస్తుతం, రెండు సీజన్లలో 1.06 కోట్ల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతకు ఇది నిదర్శనం. 2014-15తో పోలిస్తే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు 578 శాతం పెరిగాయి. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో పెరగలేదు’’ అని శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని