తిరిగి వస్తున్నారు!
close

ప్రధానాంశాలు

తిరిగి వస్తున్నారు!

పెద్ద ఎత్తున వలస కార్మికులు వెనక్కు
బిహార్‌, యూపీ నుంచి వచ్చే రైళ్లలో  భారీ వెయిటింగ్‌ లిస్ట్‌లు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి దెబ్బకు సొంతరాష్ట్రాలకు వెళ్లిన వలసకార్మికులు తిరిగి వస్తున్నారు. క్రమక్రమంగా వీరి సంఖ్య పెరుగుతోంది. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటోంది.

బిహార్‌లోని దానాపూర్‌, రాక్సల్‌, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులు జంట నగరాల్లో వేలాది మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సరిగా పనులు దొరక్క, కొవిడ్‌ కేసుల భయంతో చాలామంది సొంత రాష్ట్రాలకు తిరిగివెళ్లారు. అక్కడ పనులు దొరకడం ఇంకా ఇబ్బందిగా ఉండటం, మరోవైపు కొవిడ్‌ కేసులు దేశవ్యాప్తంగా భారీగా తగ్గుతుండంతో తిరిగి తమకు ఉపాధి కల్పించే నగరాలు, రాష్ట్రాలవైపు పయనం అవుతున్నారు. 

వెయిటింగ్‌ లిస్ట్‌ కూడా దొరకట్లేదు... బిహార్‌లోని దానాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు రోజు రెండు ప్రత్యేక రైళ్లున్నాయి. 20వ తేదీ ప్రయాణానికి నెం.02792 రైల్లో వెయిటింగ్‌లిస్ట్‌- స్లీపర్‌లో 397, సెకండ్‌ సిట్టింగ్‌లో 192, థర్డ్‌ ఏసీలో 47, సెకండ్‌ఏసీలో 24గా ఉంది. ఛార్జి అధికంగా ఉండే పండగ ప్రత్యేక రైల్లో (నెం.02788) స్లీపర్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ 146గా ఉంది. యూపీలోని గోరఖ్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌కి వెళ్లే రైల్లో అయితే 21వ తేదీ ప్రయాణానికి.. గరిష్ఠ పరిమితి కూడా దాటిపోవడంతో స్లీపర్‌, సెకండ్‌ సిట్టింగ్‌లో వెయిటింగ్‌లిస్ట్‌ టికెట్లు కూడా దొరకట్లేదు. 22న ప్రయాణానికి స్లీపర్‌లో 405, థర్డ్‌ ఏసీలో 89, సెకండ్‌ ఏసీలో 22 వెయిటింగ్‌లిస్ట్‌ నమోదైంది

వలసకార్మికుల సొంతప్రాంతాల నుంచి వారు ఉపాధి పొందే నగరాల మార్గాల్లో ప్రయాణాలుచేసే రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో ఏకంగా 110.2 శాతంగా నమోదవుతోందని రైల్వేశాఖ శనివారం ప్రకటించింది. వలసకార్మికుల సొంత ప్రాంతాలైన తూర్పు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, బెంగాల్‌, ఒడిశాల నుంచి దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణే, సూరత్‌ వంటి నగరాలకు వెళ్లే దూరప్రాంత రైళ్లలో జూన్‌ 11-17 వరకు వారం రోజుల్లో 32.56 లక్షల మంది ప్రయాణించారని.. వీరిలో వలస కార్మికులతో పాటు సాధారణ ప్రయాణికులూ ఉన్నారని రైల్వేశాఖ తెలిపింది. దానాపూర్‌-సికింద్రాబాద్‌, రాక్సల్‌-సికింద్రాబాద్‌, గోరఖ్‌పూర్‌-సికింద్రాబాద్‌ల మధ్య రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్‌ 19-28 వరకు 29.5 లక్షల మంది టికెట్లు బుక్‌ చేసుకున్నారని..ఇందులో వలస కార్మికులతో పాటు ఇతర ప్రయాణికులూ ఉన్నారని పేర్కొంది. 18వ తేదీన రైల్వేశాఖ 983 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపింది. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే ఈ సంఖ్య 56 శాతం. రానున్నరోజుల్లో మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రంగం సిద్ధం అవుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని