మగ్గాల మౌన వేదన
close

ప్రధానాంశాలు

మగ్గాల మౌన వేదన

నూలు కొరత... కష్టాల మోత  
కొవిడ్‌తో ఒడిదుడుకుల్లో చేనేత కుటుంబాలు

కరోనాతో రాష్ట్రంలోని చేనేత కార్మికులను కష్టాలు చుట్టుముట్టాయి. చాలారోజులపాటు కొనసాగిన లాక్‌డౌన్‌ కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌- ఎన్‌హెచ్‌డీసీ) నుంచి నూలు అందకపోవడంతో ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మొత్తంగా ఈ రంగం ఒడిదుడుకుల మధ్య నలిగిపోతోంది.

తెలంగాణ రాష్ట్రంలో 20 వేల కుటుంబాలు ఈ వృత్తిలో ఉన్నాయి. చేనేత సహకార సంఘాలు 30 శాతం మేరకే నడుస్తున్నాయి. ఫలితంగా స్థిర ఆదాయం లేని చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. కార్మికులకు ఉపాధి కల్పించే చేనేత సంఘాలూ కోలుకోవడం లేదు. పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. సంఘాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని సంఘాల నేతలు వాపోతున్నారు. గత ఏడాది కొవిడ్‌ చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఆ సంవత్సరం జులైలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కార్మికులు మళ్లీ వృత్తి పనులను ప్రారంభించారు. కోలుకుంటున్న సమయంలో మళ్లీ గత నెలలో లాక్‌డౌన్‌ విధించారు. ఎన్‌హెచ్‌డీసీ వద్ద నూలు లభించకపోవడంతో చేనేత సంఘాల వారు, కార్మికులు ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వం ఇచ్చే ధరల కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువ పెట్టి కొంటున్నారు.


కొనుగోళ్లేవీ?

ధిక ధరలకు నూలు తెచ్చి ఉత్పత్తులు ప్రారంభించినా కొనుగోళ్లు జరగడం లేదు. ప్రభుత్వ పథకం కావడంతో టెస్కో బతుకమ్మ చీరలను మాత్రమే కొంటోంది. ప్రైవేటు సంస్థలు కొనడం లేదు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేటలలో చీరల ఉత్పత్తి 20 శాతం మేరకు జరగగా కొనేవారు లేరు. వరంగల్‌లో రూ.లక్షల విలువైన కార్పెట్ల నిల్వలు పేరుకొని ఉన్నాయి.

* గత రెండు నెలలుగా ఏర్పడిన సంక్షోభం వల్ల వేతనాలకు కటకట ఏర్పడిందని కార్మికులు వాపోతున్నారు.


ప్రభుత్వమే నూలు సరఫరా చేయాలి

- కృష్ణమూర్తి, గూడూరు చేనేత సంఘం అధ్యక్షుడు, జనగామ జిల్లా

ప్రభుత్వమే నూలు సరఫరా చేయాలి. విపత్కర పరిస్థితి దృష్ట్యా చీరలు, ఇతర దుస్తుల నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలి. కార్మికులకు పని కల్పించాలంటే సంఘాలకు క్యాష్‌ క్రెడిట్‌ సౌకర్యం పెంచాలి.


కష్టంగా చేనేత వృత్తి

- మచ్చ వెంకటరాజం, కార్మికుడు, కొత్తవాడ, వరంగల్‌ నగర జిల్లా

రోనాతో పని లేదు. ఉత్పత్తి చేసిన వస్త్రాలు ఎవరూ కొనడం లేదు. కరోనా గండాలు పోయే వరకు ప్రభుత్వమే ఆదుకొని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలి.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని