రామప్ప.. ఎన్నెన్ని ప్రత్యేకతలో..

ప్రధానాంశాలు

రామప్ప.. ఎన్నెన్ని ప్రత్యేకతలో..

రామప్ప ఆలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. నేటికీ అంతుబట్టని సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడి ప్రత్యేకత.. 800 ఏళ్ల క్రితం నాటి కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. నిర్మాణంలో శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ వినియోగించడమే కారణం. ఆలయ నిర్మాణ స్థలంలో 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో ఇసుక నింపుతారు. అది ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ ఇసుకపై రాళ్లు పేర్చుకుంటూ గుడి నిర్మించారు. అందువల్లే అది ఇప్పటికీ కుంగిపోకుండా దృఢంగా ఉందని నిపుణుల అభిప్రాయం.


నేను ఎవరికైనా శత్రువును కావొచ్చు. కానీ ఈ ఆలయం కాదు. దీన్ని ధ్వంసం చేయొద్దు

- ఆలయ నిర్మాత రేచర్ల రుద్రుడు శాసనంలో పేర్కొన మాటలివి.


ఎక్కడా కనిపించని ఇటుకలు ఇక్కడే..

ఆలయం రాతితోనే ఉంటుంది. కానీ గర్భగుడి గోపురం మాత్రం ఇటుకలతో నిర్మించారు. నేల స్వభావానికి అనుగుణంగా ఆలయంపై బరువు తగ్గించడానికి తేలికపాటి ఇటుకను వినియోగించారు. ఇవి నీటిలో తేలియాడతాయి. మనం వినియోగించే వాటి కన్నా చాలా చిన్నగా ఉంటాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడ కట్టడాలు చేపట్టలేదు. వీటిని ఎలా తయారు చేశారో ఇప్పటికీ గోప్యమే.


శివలింగంపై కిరణాభిషేకం

గర్భాలయంలో విద్యుత్తు దీపాలు లేకున్నా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. గర్భగుడి ముందున్న మహామండపానికి నాలుగు పెద్ద నల్లరాతి స్తంభాలుంటాయి. బయటి వెలుగు వాటి మీద పడి పరావర్తనం చెంది శివలింగంపై ప్రతిబింబించడం వల్ల లింగం తేజోవంతంగా కనిపిస్తుంది.


మూడు రంగుల రాళ్లు.. ఎలా చెక్కారో వాళ్లు

ఆలయంలో చాలాచోట్ల మూడు రంగుల రాళ్లను వినియోగించారు. కొన్నిచోట్ల ఎరుపు, తెలుపు మిశ్రమ రంగుల రాళ్లు కూడా కనిపిస్తాయి. ఆలయం లోపల, మహామండపం, కొన్ని శిల్పాలకు పూర్తిగా నల్లరాళ్లనే వాడగా ఆలయం వెలుపల ఎరుపు, తెలుపు రాళ్లను వినియోగించారు. కొన్నిచోట్ల ఈజిప్టు, పర్షియన్‌ వ్యక్తుల చిత్రాలు కొన్ని కనిపిస్తాయి. ఆ కాలంలోనే విదేశీయులతో సంబంధాలు ఉన్నట్లు వాటి ద్వారా తెలుస్తుంది. జైనులు, బౌద్ధుల శిల్పాలు సైతం కొన్ని ఉన్నాయి.


మీటితే స్వరాలు..

గోపికా వస్త్రాపహరణం సమయంలో పొన్నచెట్టుపై కూర్చుని శ్రీకృష్ణుడు వేణునాదం వినిపించే ఘట్టాన్ని ప్రతిబింబించే శిల్పాన్ని వేలితో మీటితే సప్త స్వరాలు పలుకుతాయి. అలాగే ఓ శిల్పంలో ముగ్గురు మనుషులకు నాలుగు కాళ్లు మాత్రమే ఉంటాయి. కానీ వేర్వేరుగా కాళ్లున్నట్లు కనిపిస్తాయి. ఇలాంటి ప్రత్యేక శిల్పాలెన్నో.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని