బినామీ కంపెనీలతో విత్తన దందా!

ప్రధానాంశాలు

బినామీ కంపెనీలతో విత్తన దందా!

పంటలు పండించిన రైతులకు సొమ్ము ఎగవేత

దగాకోరు సంస్థపై ఇటీవలే పోలీసు కేసు

పాతది మూసివేసి 4 బినామీ కంపెనీల ఏర్పాటు

విచారణలో విస్తుగొలిపే విషయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రైతన్నల నుంచి సాధారణ పంటలు కొనేటపుడు వ్యాపారులు మార్కెట్లలో మోసాలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు మార్కెట్లకే రాకుండా ఒప్పందాలతో నేరుగా పొలాల నుంచే విత్తన పంటలను తరలిస్తూ.. ఆపై వాటికి సొమ్ము చెల్లించకుండా టోపీ వేస్తున్నాయి. మోసాలు బయటపడితే తొలి కంపెనీని మూసివేసి బినామీ పేర్లతో మరో దాన్ని తెరిచి యథావిధిగా దందా కొనసాగిస్తున్నారు వాటి నిర్వాహకులు. ఇదే బాటలో రైతును మోసం చేసిన విత్తన కంపెనీపై పోలీసులు ఇటీవల నమోదు చేసిన కేసులో విచారణ సందర్భంగా అనేక విషయాలు వెలుగుచూశాయి. కంపెనీకి, రైతులకు మధ్య ఏజెంటుగా వ్యవహరించిన సంపత్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సూపర్‌ అగ్రి సీడ్స్‌ విత్తన కంపెనీ యజమాని రవి శ్రీనివాస్‌, అతని భార్య గీతాకుమారి, కంపెనీ ప్రతినిధులు నేతింటి అప్పల నర్సింహం, రావెల్లి భూషణం అనే వ్యక్తులపై కరీంనగర్‌ జిల్లా వీణవంక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బు అడిగితే తనను చంపుతామని బెదిరిస్తున్నారని సంపత్‌ తెలిపారు. పైగా విత్తన పంటలు తీసుకున్న సూపర్‌ అగ్రి సీడ్స్‌ కంపెనీని మూసివేసి.. బినామీ పేర్లతో ‘ఎటెర్నా క్రాప్‌ సైన్సెస్‌, ఎటెర్నా లైఫ్‌ సైన్సెస్‌, బయో జెనెటిక్స్‌, బయో ఎనర్జిటిక్స్‌’ పేర్లతో 4 కంపెనీలను పెట్టి ఎప్పటిలాగే రూ.కోట్ల విలువైన విత్తన వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు.

రైతులను ఎలా మోసగించారంటే...

సూపర్‌ అగ్రి సీడ్స్‌ పేరుతో విత్తన కంపెనీని ఏర్పాటుచేసిన రవి శ్రీనివాస్‌.. రైతులతో విత్తన పంటలు పండించి తిరిగి తమకు ఇవ్వమని పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు. అలా పంటలు తీసుకొని డబ్బు ఎగవేశాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్లభాపూర్‌ గ్రామానికి చెందిన సంపత్‌ను కంపెనీకి ప్రతినిధిగా నియమించాడు. తొలుత 2013-15 మధ్యకాలంలో రూ.2.42 కోట్ల విలువైన విత్తనాలను సంపత్‌ రైతుల నుంచి తీసుకుని కంపెనీకిచ్చాడు. ఈ సొమ్ము ఇవ్వమని పలుమార్లు రవి శ్రీనివాస్‌ను అడిగితే ఓ ప్రైవేటు బ్యాంకులో  సంపత్‌ పేరుపైనే రూ.70లక్షలు రుణం తీసుకుని ఇచ్చాడు. వాటిని కంపెనీయే తిరిగి బ్యాంకుకు చెల్లిస్తుందని నమ్మబలికాడు. కానీ, రుణ బకాయి వడ్డీ సహా రూ.85 లక్షలు చెల్లించాలని బ్యాంకు సంపత్‌కు నోటీసులిచ్చింది. దీనిపై కంపెనీని గట్టిగా అడిగితే గత ఫిబ్రవరి 10న నేతింటి అప్పల నర్సింహం అనే వ్యక్తి బయో ఎనెర్జిటిక్స్‌ కంపెనీ ఖాతా నుంచి సంపత్‌ ఖాతాలో రూ.3లక్షలు జమచేశాడు. ఇకనుంచి బకాయి డబ్బు గురించి ఏ సమాచారం కావాలన్నా నేతింటి అప్పల నర్సింహంతో మాట్లాడమని రవిశ్రీనివాస్‌ సంపత్‌కు చెప్పాడు. అనుమానమొచ్చి ఆరాతీస్తే సూపర్‌ అగ్రి సీడ్స్‌ పేరుతో రైతులకు డబ్బు చెల్లించకుండా మోసం చేసిన క్రమంలో.. దానిని మూసివేసి మరో 4 బినామీ కంపెనీలు ఏర్పాటుచేసి రవి శ్రీనివాస్‌ విత్తన దందా చేస్తున్నట్లు తేలిందని ఫిర్యాదులో సంపత్‌ పోలీసులకు తెలిపారు. పాత బకాయిలు రూ.1.29 కోట్లు ఇప్పించాలని కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదే కంపెనీపై గతేడాదే ఫిర్యాదు..

సూపర్‌ అగ్రి సీడ్స్‌ కంపెనీ రైతులకు విత్తన పంటల డబ్బు చెల్లించకుండా వారి పేరుతో బ్యాంకుల్లో రూ.28 కోట్లు రుణాలు తీసుకుందని గతేడాది రాష్ట్ర రుణ విముక్తి కమిషన్‌కు ఫిర్యాదు అందింది. అప్పుడు కమిషన్‌ విచారణకు హాజరైన కంపెనీ ప్రతినిధులు తామే బ్యాంకు బకాయిలు చెల్లిస్తామని రైతులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారని కమిషన్‌ సభ్యుడిగా పనిచేసిన పాకాల శ్రీహరిరావు ‘ఈనాడు’కు చెప్పారు. ఇలా పలు విత్తన కంపెనీలు రైతులను మోసగిస్తున్నాయని ఆయన వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని