ఆచార్యుల పదవీ విరమణ పెంపెన్నడు?

ప్రధానాంశాలు

ఆచార్యుల పదవీ విరమణ పెంపెన్నడు?

అయిదు నెలలవుతున్నా నిర్ణయం తీసుకోని సర్కారు

బోధనేతర సిబ్బందికి ఏప్రిల్‌లోనే ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును గత మార్చిలో 58 నుంచి 61కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యులకు మాత్రం వర్తింపజేయడం లేదు. ఫలితంగా ప్రతి నెలా పలువురు ఆచార్యులు పదవీ విరమణ పొందుతున్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధనేతర సిబ్బందికి మూడేళ్లు పదవీ విరమణ పెంచుతూ ఏప్రిల్‌లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఆయా విశ్వవిద్యాలయాలు కూడా వర్తింపజేస్తూ పాలకమండళ్ల సమావేశాల్లో తీర్మానాలు చేశాయి. ఆచార్యుల విషయంలో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని మొదట విద్యాశాఖ భావించింది. ఈ మేరకు కమిటీని నియమించి సిఫారసులు ఇవ్వాలని మార్చిలోనే అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. యూజీసీ వేతనాల అమలుపై నియమించిన కమిటీ ఉండడంతో ఆ కమిటీతోనే పదవీ విరమణ వయసు పెంపుపై సిఫారసు చేశామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు తేల్చలేదు. పదవీ విరమణ వయసు పెంచకున్నా ఈ ఏడాది పదవీ విరమణ చెందేది 40 మందేనని విద్యాశాఖ లెక్కలు తీసినట్లు సమాచారం. గత మార్చి నుంచి ఇప్పటివరకు 15 మంది వరకు పదవీ విరమణ పొందారు. అయిదు నెలల నుంచి వర్సిటీల ఆచార్యుల సంఘాలు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇటీవల గవర్నర్‌ తమిళిసైకి సైతం విన్నవించాయి.

15 రాష్ట్రాల్లో అమలు

ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయసు 65గా ఉంది. యూజీసీ సైతం 65కు పెంచుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ ప్రకారం దాదాపు 15 రాష్ట్రాల్లో అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ 62కు పెంచారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్లు పెంచినందున ఆచార్యులకు ఇప్పుడున్న 60ని 63కి పెంచాలా? లేదా 65కి పెంచాలా? అన్నది తేల్చాల్సి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని