వైద్య అనుబంధ కోర్సులకు మండలి

ప్రధానాంశాలు

వైద్య అనుబంధ కోర్సులకు మండలి

జాతీయస్థాయిలో ఒకే విధానం
రాష్ట్రంలో అమలుకు సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ‘ఆరోగ్య అనుబంధ వృత్తి నిపుణుల మండలి (ఏహెచ్‌పీసీ) త్వరలో ఏర్పాటు కానుంది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ‘ఏహెచ్‌పీ’ చట్టాన్ని తీసుకొచ్చింది. వైద్య విద్యార్థులకు ‘జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)’ ఉన్నట్లే, జాతీయ స్థాయిలో ‘అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ కమిషన్‌ (ఏహెచ్‌పీసీ)’ కూడా పనిచేస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు విధిగా ఆరు నెలల్లోపు అమలు చేయాల్సి ఉంటుంది. దీని కార్యాచరణలో భాగంగా వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ నేతృత్వంలో బుధవారం ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. ఇందులో పారామెడికల్‌ బోర్డు కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి, నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ మనోహర్‌, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ టి.గంగాధర్‌, రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ విధివిధానాలు...

* జాతీయస్థాయి కమిషన్‌కు అనుబంధంగా రాష్ట్రస్థాయిలో మండలి ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఛైర్‌పర్సన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఇందులో వేర్వేరు అధికారులు సభ్యులుగా ఉంటారు.

* పారామెడికల్‌, ఫిజియోథెరపీ, డైటీషియన్‌ వైద్య అనుబంధ కోర్సులన్నీ ఈ మండలి పరిధిలోకే వస్తాయి.

* ఈ మండలిలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యా బోర్డులతో పాటు ఆరోగ్య అనుబంధ వృత్తిదారుల అంచనా, రేటింగ్‌ బోర్డు, విలువలు, రిజిస్ట్రేషన్‌ బోర్డు కూడా ఉంటాయి.

* వైద్య అనుబంధ కోర్సుల నిర్వహణకు కళాశాలల అనుమతి, కోర్సుల్లో పాఠ్యాంశాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, తనిఖీలు, నమోదు.. తదితర ప్రక్రియలకు జాతీయస్థాయిలో ఒకే విధానం అమలవుతుంది.

* దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఇప్పటివరకు వైద్య అనుబంధ కోర్సులను సొంతంగా నిర్వహిస్తున్నాయి. ఇకపై ఈ విధానం చెల్లుబాటు కాదు.

* జాతీయస్థాయిలో ఒకే విధానంతో పర్యవేక్షణ సులువై పారదర్శకత పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.

* వైద్య అనుబంధ కోర్సును నిర్వహించే ప్రతి కళాశాల తప్పనిసరిగా సమీపంలోని ఆసుపత్రికి, వైద్యకళాశాలకు అనుబంధంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యార్థులకు అనుభవపూర్వక శిక్షణ లభిస్తుంది.

* ఏ కోర్సుకు, ఏ కళాశాలలో ఎటువంటి మౌలిక వసతులు, ఎంతమంది సిబ్బంది ఉండాలనే నిబంధనలు ఇకపై కచ్చితంగా అమలు చేయాల్సిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని