ఒక్క మర్రి.. వెయ్యి మంది ఉరి!

ప్రధానాంశాలు

ఒక్క మర్రి.. వెయ్యి మంది ఉరి!

మన జలియన్‌వాలాబాగ్‌.. నిర్మల్‌

నిర్మల్‌ అనగానే కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి అని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. కానీ జాతీయోద్యమంలో యావత్‌భారతాన్ని కదిలించిన జలియన్‌వాలాబాగ్‌లాంటి దారుణ మారణ కాండకు ఇది వేదికనీ... సిపాయిల తిరుగుబాటు కాలంలోనే బ్రిటిష్‌-నిజాంలపై రాంజీగోండ్‌లాంటి గోండు యోధుడు పోరాడిన స్థానమని చాలామందికి తెలియదు. రాంజీ సహా వెయ్యిమందిని మర్రిచెట్టుకు ఉరితీసి, పోరాటాన్ని అణచివేశాయి బ్రిటిష్‌ - నిజాం సేనలు!

బ్రిటిష్‌ పాలనకు ముందే మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలోని ప్రాంతాలతో కూడిన గోండ్వానా రాజ్యం ఉండేది. మరాఠాల పతనం తర్వాత గోండ్వానాను బ్రిటిష్‌వారు, నిజాం ఆక్రమించుకున్నారు. బలహీనపడ్డా గోండులు వారిని ప్రతిఘటించేవారు. 1836-1860 దాకా రాంజీగోండ్‌ నాయకత్వంలో పోరాటం నడిచింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఉత్తరాది నుంచి ఝాన్సీ, తాంతియాతోపే సేనల్లోని రోహిల్లాలు కూడా వచ్చి రాంజీతో చేతులు కలిపారు. అలా బలం, బలగం పెరిగిన గోండువీరులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పర్బనీ, నిర్మల్‌ ప్రాంతాలతో పాటు అజంతా, బస్మత్‌, లాతూర్‌, మఖ్తల్‌ వంటి ప్రాంతాల్లో పోరాటం సాగింది.

గోదావరి తీరంలో దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్‌ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని రాంజీ పోరు సాగించారు. బ్రిటిష్‌-నైజాం సైన్యానికి కొరకరాని కొయ్యగా మారారు. రైతుల నుంచి బలవంతపు వసూళ్లను నిలిపి వేయించారు. తమను తాము రక్షించుకోవడానికి గోదావరి పరీవాహక ప్రాంతంలో (ఇప్పటి సోన్‌ పరిసరాలు) ప్రజలకు సైనిక శిక్షణ కూడా ఇచ్చేవారు. దీంతో వీరిని దెబ్బతీయటానికి నిజాం ప్రభువు బ్రిటిష్‌ సేనల సహకారం కోరాడు. కొంతమంది రాంజీ అనుచరులను విచారణ పేరిట పట్టుకొచ్చి నిర్మల్‌ పట్టణం నుంచి ఎల్లపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉండే మర్రి చెట్టు వద్ద శిక్షలు అమలు చేసేవారు.చెట్టు ఊడలకు వీరిని ఉరి తీసేవారు.

1860 ఏప్రిల్‌ 8న రాంజీగోండ్‌ తన అనుచరులతో నిర్మల్‌కు సమీపంలో ఉన్నట్లు కలెక్టర్‌కు రహస్య సమాచారం అందింది. కేవలం ఇద్దరు మాత్రమే పక్కపక్కన నడుస్తూ వెళ్లగలిగే ఆ ఇరుకు ప్రాంతాన్ని నిజాం పోలీసు బలగాలతోపాటు బ్రిటిష్‌ సైన్యం ముట్టడించింది. వీరోచితంగా పోరాడిన రాంజీ సైన్యాన్నే విజయం వరించింది. దీంతో మరుసటి రోజు బ్రిటిష్‌వారు భారీ సైన్యంతో విరుచుకుపడ్డారు. చెట్టు, పుట్ట అన్నీ గాలించారు. సోన్‌ ప్రాంతంలో రాంజీగోండ్‌ వారికి బందీగా చిక్కారు. ఆ తర్వాత కూడా మళ్లీ రాంజీలాంటివారు పుట్టకుండా ఉండటానికి, ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించటానికి బ్రిటిష్‌ సైన్యం- రాంజీతో పాటు పట్టుబడ్డ అతని అనుచరులందరినీ కలిపి వేయి మందిని ఆ మర్రి చెట్టు ఊడలకు ఉరితీసి వేలాడదీశారు. అలా ఆంగ్లేయుల సేనలను, నిజాంను గడగడలాడించిన తొలి ఆదివాసీ స్వాతంత్య్ర పోరాటాన్ని దారుణంగా అణచివేశారు.

గోండు వీరుల బలిదానానికి సజీవ సాక్ష్యమైన మహా మర్రిచెట్టుకు వెయ్యి ఉరుల మర్రిగా పేరొచ్చింది. 1995లో బలమైన గాలులతో కురిసిన వానకు ఆ చెట్టు నేల కొరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి వీరులను స్మరిస్తూ 14 నవంబరు 2007న పలు సంఘాల నాయకులు స్తూపాన్ని నిర్మించారు. 14 నవంబరు 2008న నిర్మల్‌ పట్టణంలోని చైన్‌గేట్‌ వద్ద రాంజీగోండ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

- నిర్మల్‌, న్యూస్‌టుడే


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని