పేదింటి అమ్మాయి చదువులు ఆగమాగం!

ప్రధానాంశాలు

పేదింటి అమ్మాయి చదువులు ఆగమాగం!

టీవీ పాఠాలు లేవు... జూమ్‌ తరగతులు అందవు..
కేజీబీవీ విద్యార్థినుల దైన్యం

ఈనాడు, హైదరాబాద్‌: పేదింటి ఆడపిల్లల చదువులు ఆగమాగమవుతున్నాయి. కనీసం టీవీ పాఠాలకూ అవకాశం కరవైంది. ఇతర పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష తరగతులు మొదలై రెండు వారాలవుతున్నా.. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీలు) తెరచుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంస్థల్లో చదువుకునే అమ్మాయిలందరూ అత్యంత పేద కుటుంబాలకు చెందిన వారే. వారిలో 12 శాతం మంది తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా వారిలో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలే.

ప్రత్యామ్నాయం ఉన్నా..

గురుకులాలు, వసతిగృహాలను ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించడంతో కేజీబీవీలను ప్రభుత్వం తెరవలేదు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో చదువుకోవచ్చని ఉత్తర్వులిచ్చిన విద్యాశాఖ టీవీల ద్వారా ప్రసారం చేసే డిజిటల్‌ పాఠాలను ఆగస్టు నెలాఖరుకు నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాల తర్వాతా వాటిని కొనసాగించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఊళ్లో ఉండే కేజీబీవీ విద్యార్థులు అక్కడున్న బడులకు వెళ్లి తాత్కాలికంగా చదువుకోవాలని ఆదేశాలిస్తే కొంతవరకైనా విద్య అందేది.

ఫోన్లే లేవు.. జూమ్‌ పాఠాలట..

జూమ్‌ పాఠాలు కొనసాగుతున్నాయని. దాదాపు 50 శాతం మంది హాజరవుతున్నారని డీఈవోలు, కేజీబీవీ అధికారులు చెబుతున్నా అది 30-40 శాతానికి మించకపోవచ్చని తెలుస్తోంది. ఎక్కువ మందికి స్మార్ట్‌ ఫోన్‌ సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణం.

ఇవీ గణాంకాలు..

రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య: 475
వాటిలో విద్యార్థినులు: 1,10,634
తరగతులు: ఆరు నుంచి 10 వరకు (172 చోట్ల ఇంటర్‌ వరకు)

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని