పకడ్బందీగా దళితబంధు అమలు  

ప్రధానాంశాలు

పకడ్బందీగా దళితబంధు అమలు  

అర్జీల పునఃపరిశీలన కోసం సర్వే
యూనిట్‌ల ఏర్పాటులో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఇప్పటికే వారం రోజులపాటు సర్వే నిర్వహించి గుర్తించిన లబ్ధిదారుల దరఖాస్తుల్లో తప్పిదాలను సవరించడంతోపాటు, గతంలో నమోదుకాని కుటుంబాలకు అవకాశం కల్పించేలా బుధవారం మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా రేషన్‌కార్డు లేనివారి వివరాలను నమోదు చేయడంతోపాటు స్థానికంగా లేని వారి పేర్లను గుర్తిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దళితబంధు సర్వేలో గుర్తించిన కుటుంబాల్లో ఇప్పటివరకు 14,400 మంది ఖాతాలలో రూ.10 లక్షల చొప్పున జమచేశారు. వారిలో డెయిరీ ఏర్పాటుకు ఎంతమంది ఆసక్తిని చూపిస్తున్నారనే విషయమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. దాదాపు 3,700 మంది ట్రాక్టర్లు కావాలని, మరో 3,500 మంది వరకు కార్లు కావాలని దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో..వారికి ఏ యూనిట్‌ అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకునేలా దళిత మేధావులతో కలిసి గ్రామాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఛైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో జమ్మికుంట, ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, చిన్నకోమటిపల్లిలో అవగాహన సమావేశాల్ని నిర్వహించి లబ్ధిదారుల ఆసక్తిని తెలుసుకున్నారు. ‘ఎంచుకున్న ఐదు రకాల యూనిట్‌ల ఏర్పాటులో లబ్ధిదారులకు ఉన్న కష్టనష్టాలు, ప్రయోజనాలను సర్వే సందర్భంగా గుర్తించి నివేదికను తయారు చేస్తామని’ అధికారులు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని