రేషన్‌ కార్డుల్లో ‘మ్యుటేషన్‌’కు మోక్షమెప్పుడు?

ప్రధానాంశాలు

రేషన్‌ కార్డుల్లో ‘మ్యుటేషన్‌’కు మోక్షమెప్పుడు?

పెండింగ్‌లో 3 లక్షలకు పైగా దరఖాస్తులు
ఏళ్లు గడుస్తున్నా పరిష్కరించని పౌరసరఫరాల శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: పౌరసరఫరాల శాఖలో ‘మ్యుటేషన్‌’ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. కొత్త రేషన్‌ కార్డులను జారీ చేసిన అధికారులు.. వీటివైపు కన్నెత్తి చూడటం లేదు. ఏళ్లు గడుస్తున్నా పరిష్కరించకపోవడంతో లక్షల మంది పౌరసరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే తప్ప తామేం చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తుండటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90.5 లక్షల కార్డులున్నాయి. కొత్తగా వివాహమైన వారు భార్య పేరు, పిల్లలు పుడితే వారి వివరాల నమోదుకు.. చిరునామా వంటి వాటిని  మార్చుకోడానికి దరఖాస్తు చేసుకోవాలి. వీటినే మ్యుటేషన్‌ దరఖాస్తులుగా వ్యవహరిస్తారు. మూడు.. నాలుగేళ్ల కిందట ప్రభుత్వం కొత్త కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. అప్పుడే ‘మ్యుటేషన్‌’ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుమారు 3 లక్షలకు పైగా ఇలా వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సగం దరఖాస్తులు హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నట్లుగా పేర్కొంటున్నారు.

నష్టమేంటంటే...
ఇటీవల పౌరసరఫరాల శాఖ కొత్త కార్డులను జారీ చేసింది. ‘మ్యుటేషన్‌’ దరఖాస్తులను మాత్రం పక్కన పెట్టింది. ఆన్‌లైన్‌లో కొత్త కార్డుల జారీకే అవకాశమిచ్చినట్లుగా సంబంధిత అధికారులు తేల్చి చెబుతున్నారు. మ్యుటేషన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో అర్హులకు పలు రకాలుగా నష్టం జరుగుతుంది. ఉదాహరణకు.. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి (ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున) బియ్యం పంపిణీ చేస్తారు. పేర్లు చేర్చకపోవడంతో అదనపు కోటా అందటం లేదు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేటప్పుడు రేషన్‌ కార్డు కీలకంగా మారుతుంది. అందులో ఉన్న చిరునామా ఒకటి.. ప్రస్తుతం నివాసముండేది మరొకటి అయితే ఇబ్బందులు తలెత్తుతున్నట్లు దరఖాస్తుదారులు వాపోతున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని