నడిరోడ్డులో గవర్నర్‌ జనరల్‌ డిష్షుం డిష్షుం

ప్రధానాంశాలు

నడిరోడ్డులో గవర్నర్‌ జనరల్‌ డిష్షుం డిష్షుం

వారెన్‌ హేస్టింగ్స్‌... భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనకు పునాది వేసిన ముఖ్యుల్లో ఒకరు. బ్రిటిష్‌ ఇండియాలో బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ కూడా! ఈస్టిండియా ప్రభుత్వంలో అత్యంత ఉన్నత హోదాలో ఉన్న హేస్టింగ్స్‌ ఓ రోజు నడివీధిలో తన సహచరుడితో పిస్తోళ్లతో వీధి పోరుకు దిగారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. కారణం అవినీతి ఆరోపణలు... అహంభావాలు!

హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా చేసిన కాలంలోనే గవర్నర్‌ జనరల్‌ కౌన్సిల్‌లో ఫిలిప్‌ ఫ్రాన్సిస్‌ సభ్యుడిగా ఉండేవారు. ఈస్టిండియా కంపెనీలో ఇద్దరిదీ ఉన్నతస్థానమే! కానీ ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఐదుగురు సభ్యుల కౌన్సిల్‌లో మరో ఇద్దరిని జట్టు చేసుకొని ఫ్రాన్సిస్‌ ప్రతిదానికీ హేస్టింగ్స్‌ నిర్ణయాలను అడ్డుకునేవారు. అంతేగాకుండా వారెన్‌ హేస్టింగ్స్‌ అవినీతికి పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు కూడా సంధించారు. స్పందనగా ఆయన... ‘వివాహేతర సంబంధాలు’ న్నాయంటూ ఫ్రాన్సిస్‌పై విమర్శలు చేశారు. దీంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ద్వంద్వయుద్ధానికి ప్రతిపాదించారు ఫ్రాన్సిస్‌! దానికి హేస్టింగ్స్‌ అంగీకరించారు. బ్రిటన్‌లో ఇలా ద్వంద్వయుద్ధాలతో అమీతుమీ తేల్చుకోవటం, తమ పైచేయిని నిరూపించు కోవటం పాతకాలంలో సంప్రదాయంగా ఉండేది. తొలుత మల్లయుద్ధం, ఆ తర్వాత కత్తులతో, ఆనక పిస్తోళ్లతో.... నిబంధనలు పెట్టుకొని తలపడేవారు. ఆ పాత సంప్రదాయం ప్రకారం తమ హోదాలు మరచి నడిరోడ్డులో పోరాటానికి దిగారిద్దరూ!

1780, ఆగస్టు 17న కోల్‌కతాలోని ప్రస్తుత జాతీయ లైబ్రరీ వద్ద రోడ్డును వేదికగా ఎంచుకున్నారు. ఎవరికీ తెలియకుండా ఉండాలని పొద్దున్నే 5.30కు నలుగురు సహాయకులతో కలసి పిస్తోళ్లతో రంగంలోకి దిగారు. కానీ గమ్మత్తేమంటే ఇద్దరికీ పిస్తోలుతో కాల్చటం అంతగా రాదు. ఫ్రాన్సిస్‌ ఎన్నడూ కాల్చలేదు. హేస్టింగ్స్‌ పిస్తోలు వాడి చాలాకాలమైంది. 35 అడుగుల దూరం నుంచి కాల్పులు జరపాలనేది నిబంధనగా పెట్టుకున్నారు. హేస్టింగ్స్‌ కాల్పులకు దెబ్బతాకిన ఫ్రాన్సిస్‌ కింద పడిపోయారు. అంతకుముందు ఫ్రాన్సిస్‌ పిస్తోలులో మందుగుండు పనిచేయలేదు. అది హేస్టింగ్స్‌ బృందం పనే అనేది తర్వాత తేలింది. మొత్తానికి ప్రాణహాని లేకుండా బయటపడ్డ ఫ్రాన్సిస్‌ తర్వాత ఇంగ్లాండ్‌ వెళ్లిపోయారు. కానీ హేస్టింగ్స్‌ పదవీకాలం ముగిసి ఇంగ్లాండ్‌కు తిరిగివచ్చాక ఫ్రాన్సిస్‌ పాతపగను తిరగదోడి... పార్లమెంటులో ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టారు. దాన్నుంచీ హేస్టింగ్స్‌ బయటపడ్డారు. కోల్‌కతాలో ఇప్పటికీ వీరిద్దరు డిష్షుండిష్షుం అంటూ పోరాడిన ఆ వీధిపేరు డ్యూయల్‌  స్ట్రీట్‌/అవెన్యూ అని పిలుస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని