తెల్లవారి గుండెల్లో చపాతీ గుబులు!

ప్రధానాంశాలు

తెల్లవారి గుండెల్లో చపాతీ గుబులు!

ప్రముఖులు, సామాన్యులు, రాజులు, రాణులు... ఇలా ఎంతో మంది జాతీయోద్యమంలో తమ పాత్ర పోషించారు. వీరందరితో పాటు సామాన్యుడి భోజనమైన ‘చపాతీ’ సైతం తెల్లదొరలను గడగడలాడించింది! స్వాతంత్య్ర సమరంలో తనదైన ముద్రవేసింది. సిపాయిల తిరుగుబాటు (1857)కు కొద్దికాలం ముందే ప్రజల్లో ఒకరకమైన అశాంతి! యావద్దేశంలో అసహనం! ఎదురు తిరగాలనే ఆలోచనలు వినిపిస్తున్న దశ! దీన్ని ఈస్టిండియా కంపెనీ అధికారులు కూడా కనిపెట్టారు. కానీ ఆ తిరుగుబాటు ఎలా ఆరంభమవుతుందో అర్థం కాలేదు. దీంతో చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడే వారు. అలాంటి తరుణంలో 1857 ఫిబ్రవరిలో ఓ అనూహ్యం చోటు చేసుకుంది. అదే చపాతీ కదలిక! వందల చపాతీలు ఒక ఊరి నుంచి మరో ఊరికి చేరుకునేవి. ఒక ఊరికి చపాతీలు రాగానే... ఆ ఊరివాళ్లు అంతే సంఖ్యలో లేదా మరింత ఎక్కువ చేసి పక్క ఊరికి పంపేవారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రత్యేకంగా చేరవేసేవారు. మథుర కలెక్టర్‌ మార్క్‌ థోర్న్‌హిల్‌ ఈ చపాతీల వ్యవహారాన్ని తొలుత గుర్తించాడు. ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాలేదు. రోజూ వేల చపాతీలు చేస్తున్నారు.... పక్క ఊర్లకు చేరవేస్తున్నారు. వెంటనే ఆంగ్లేయ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు కలెక్టర్‌! ఈస్టిండియా యంత్రాంగమంతా అప్రమత్తమైంది. చపాతీల వెనకాల ఏం జరుగుతుందో ఆరాతీసింది. చపాతీల ద్వారా ఏమైనా రహస్య సందేశాలు పంపిస్తున్నారేమోనని అనుమానించారు. తిరుగుబాటు ప్రణాళికలేమైనా చపాతీల్లో దాగున్నాయనుకున్నారు. ఎన్ని చపాతీలను చూసినా వాటిపై ఏమీ లేదు. పైగా వీటిని చేరవేస్తున్నవారిలో చాలామంది పోలీసు చౌకీదారులే కావటం వారిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. కోల్‌కతా, అవధ్‌, ఇండోర్‌లతో పాటు నేపాల్‌ దాకా ఈ చపాతీల గొలుసుకట్టు నడుస్తోందని తేలింది. కానీ చపాతీల్లో ఏముందో, దీన్ని ఎవరు నడుపుతున్నారో మాత్రం తేలలేదు. చివరకు మేలో సిపాయిల తిరుగుబాటు జరగటంతో... చపాతీలతో దీనికి సంబంధం ఉందని అనుకున్నారే తప్ప నిర్ధారణకు రాలేకపోయారు. తెల్లవారిని మానసికంగా దెబ్బతీయటానికే ఇలా చేశారని కొందరు, కలరాతో బాధపడుతున్నవారికి భోజనం అందించటానికి, ఆకలితో బాధపడుతున్నవారిని ఆదుకోవటానికి... ఈ చపాతీల ఉద్యమం సాగిందని అన్నవారూ లేకపోలేదు. మొత్తానికి సిపాయిల తిరుగుబాటుకు ముందు జరిగిన చపాతీల రవాణా ఓ ప్రహేళికగా మిగిలిపోయినా, ఈస్టిండియా కంపెనీ అధికారులను మానసికంగా ఆందోళనకు గురిచేయటంలో సఫలమైందన్నది మాత్రం నిజం!

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని