హిట్లర్‌తో క్షమాపణ చెప్పించి..

ప్రధానాంశాలు

హిట్లర్‌తో క్షమాపణ చెప్పించి..

చెంపక రామన్‌ పిళ్లై... జాతీయోద్యమంలో చాలా తక్కువ మందికి తెలిసిన పేరు. కానీ, భారత్‌ను బ్రిటిష్‌వారి చెర నుంచి విడిపించటానికి విదేశాల్లో ఆయన పడ్డ తపన, చేసిన కృషి అమోఘం! సాయుధ పోరాటంతో బ్రిటిష్‌ వారిని ఓడించి, భారత్‌ను స్వతంత్ర దేశంగా చూడాలని కలలుగన్న ఆయన సుభాష్‌ చంద్రబోస్‌కు మార్గదర్శి! ఒక దశలో హిట్లర్‌ను సైతం ఎదిరించి క్షమాపణలు చెప్పించిన దేశభక్తుడు!

చెంపక రామన్‌ పిళ్లై చాలా తెలివైన విద్యార్థి. ఆయన తిరువనంతపురంలోని పాఠశాలలో చదువుతున్నప్పుడు పశ్చిమ కనుమల్లో సీతాకోకచిలుకలపై పరిశోధనల కోసం వచ్చిన బ్రిటిష్‌ శాస్త్రవేత్త సర్‌ వాల్టర్‌ స్ట్రిక్‌లాండ్‌ దృష్టిని ఆకర్షించారు. స్ట్రిక్‌లాండ్‌ తనతో పాటు పిళ్లైని ఐరోపాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆస్ట్రియాలో ఇంజినీరింగ్‌ చేసి వివిధ జర్మన్‌ కంపెనీల్లో పనిచేసిన పిళ్లై... క్రమంగా భారత స్వాతంత్య్రం దిశగా దృష్టిసారించారు. తొలి ప్రపంచయుద్ధ సమయానికే స్విట్జర్లాండ్‌లోని కొంతమందితో కలసి ఓ బృందంగా ఏర్పడ్డారు. వీరిలో సరోజినీనాయుడు సోదరుడు వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ ఒకరు. వీరిని చటో-చంపక్‌ జోడీగా పిలిచేవారు. బ్రిటిష్‌ గూఢచారులు వీరిని చంపటానికి పథకం వేశారు. పిళ్లై బెర్లిన్‌కు పారిపోయారు. అక్కడే అనేకమంది భారతీయ విప్లవవాదులతో కలసి బెర్లిన్‌ కమిటీని ఏర్పాటుచేశారు. అనేక దేశాలు తిరిగి భారత పరిస్థితిని వివరించారు. అక్కడివారిని బ్రిటిష్‌కు వ్యతిరేకంగా కూడగట్టారు. 1914 జులై 31న ఇండియన్‌ నేషనల్‌ వాలంటరీ కార్ప్స్‌ను ఏర్పాటు చేసిన బెర్లిన్‌ కమిటీ... భారత్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వంపై దాడికి పిలుపునిచ్చింది. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో చెన్నై హార్బర్‌పై దాడి చేసిన జర్మనీ ఓడ సారథుల్లో పిళ్లై కూడా ఉన్నారంటారు. తమ ప్రయత్నాలకు మద్దతు కూడగట్టడానికి వివేకానందుడి సోదరుడు భూపేంద్రనాథ్‌ దత్తాను రష్యా పంపించారు. టర్కీ, అఫ్గానిస్థాన్‌...ఇలా చాలా దేశాల మద్దతు కూడగడుతున్న దశలో... తొలి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. దీంతో వీరి ప్రయత్నాలకు గండిపడింది.

1919లో జర్మనీ కేంద్రంగా పిళ్లై మళ్ళీ ప్రయత్నాలు ఆరంభించారు. జర్మనీలో అప్పటికి తిరుగులేని నేతగా ఎదుగుతున్న హిట్లర్‌తో ఆయనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. భారత్‌కు సాయం చేస్తానన్న హిట్లర్‌ మాటలను విశ్వసించారు. కానీ 1931 ఆగస్టు 10న హిట్లర్‌ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... ‘‘భారతీయులు ఆర్యేతరులు. బ్రిటిష్‌వారి పాలనలోకి వెళ్లటం వారి తలరాత’’ అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత మరో సందర్భంలో బ్రిటన్‌- భారత్‌ను వదలివెళ్లటం జర్మనీకి కూడా మంచిది కాబోదన్నాడు హిట్లర్‌. దీంతో తన స్నేహితుడైనప్పటికీ ఆయనతో వాదనకు దిగాడు పిళ్లై. ‘‘రక్తం కంటే దేహ రంగుకు మీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. మా రంగు నలుపే కావొచ్చు. కానీ మా మనసు కాదు’’ అంటూ ఘాటుగా బదులిచ్చి... తక్షణమే హిట్లర్‌ క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టారు.  అసహనానికి గురైన హిట్లర్‌ క్షమాపణ తెలిపాడు. అదే సమయంలో తమను పరోక్షంగా నలుపు మనసు అని అన్నందుకు పిళ్లైపై ఆగ్రహం పెంచుకున్నాడు. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. హిట్లర్‌ 1933లో జర్మనీకి ఛాన్స్‌లర్‌ కాగానే నాజీ దళాలు పిళ్లై ఇంటిపై దాడి చేశాయి. అక్కడి నుంచి ఇటలీ వెళ్లిన  పిళ్లై అనారోగ్యం పాలై వైద్యం సరిగా అందక 1934, మే 28న చనిపోయారు.


వియన్నాలో తనను కలిసినప్పుడు సుభాష్‌చంద్రబోస్‌కు రామన్‌ పిళ్లై మార్గదర్శనం చేశారని భగత్‌సింగ్‌ బంధువు సర్దార్‌ అజిత్‌సింగ్‌ తన ఆత్మకథలో గుర్తుచేసుకున్నారు. జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే తన అస్థికలను భారత్‌కు తీసుకెళ్లాలనే పిళ్లై చివరి కోరికను ఆయన భార్య లక్ష్మీబాయి 32 ఏళ్ల తర్వాత 1966లో నెరవేర్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని