close

ప్రధానాంశాలు

పనుల్లేక.. పస్తులుండలేక..

 ఇళ్లలో పనిచేసే వారి అవస్థలు
 గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 10 లక్షల మంది వరకు..

ఈనాడు - హైదరాబాద్‌

మా ఆయన ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తాడు. నలుగురు ఆడపిల్లలు. నేనూ నాలుగిళ్లలో పనిచేస్తున్నా. కరోనా భయంతో 8 రోజుల నుంచి పనోళ్లను లోపలికి రానివ్వట్లేదు. పాలు, కూరగాయలు కొనడానికీ కష్టంగా ఉంది. మూడిళ్లకు చేస్తే ఫోనే ఎత్తట్లేదు. మరో యజమానురాలికి ఫోన్‌ చేసి ఏడ్చా. రూ.రెండు వేలు పంపిస్తానన్నారు. వచ్చే నెల పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉంది.’’

-హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉండే రాములమ్మ ఆవేదన ఇది

 

 

కరోనా చిరుజీవుల జీవితాలతో ఆడుకొంటోంది. పనుల్లేక.. పస్తులుండలేక ఆ పేద కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇంటి పని, వంట పని, ఇస్త్రీ, ఇతరత్రా పనులు చేసే జీవుల పరిస్థితి దయనీయంగా మారింది. సామాజిక దూరం పాటించాలన్న జాగ్రత్తలతో చాలాచోట్ల ఇంటి యజమానులు పనులకు రానివ్వట్లేదు. ఇస్త్రీ చేసేవాళ్లు, కార్లు కడిగేవారిపైనా ప్రభావం చూపుతోంది. ‘ఇంటిపనివారి సంక్షేమం కోసం’ పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ ఎనిమిదేళ్లలో చేసిన అధ్యయనంలో హైదరాబాద్‌లోనే ఇళ్లల్లో పనిచేసేవారు 6 లక్షల మంది ఉన్నట్లు తేలింది. గ్రేటర్‌ పరిధిని, తాజా లెక్కలనూ కలిపితే ఈ సంఖ్య 10 లక్షల వరకు ఉంటుందని అంచనా. రాజధానితో పాటు.. గ్రామాల్లోనూ పనులు చేసేవారి సంఖ్యను కలిపితే మరింత ఉంటుంది. నగరాలు, పట్టణాల్లో ఉంటూ ఇళ్లలో, ఇతర చిన్న పనులు చేసేవారు కరోనా దెబ్బకు అక్కడ ఉండలేక, గ్రామాలకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన పథకాలు అందరికీ అందడం లేదని పలు సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. ‘‘కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు పేదలకు సాయం చేస్తామంటున్నాయి. తెల్లరేషన్‌ కార్డులు అందరికీ లేవు. కొత్త కార్డుల జారీ గడిచిన ఆరేడేళ్లుగా లేక కొత్తగా పెళ్లయిన వారికి రాలేదు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా పేదలందరికీ నగదు సాయం, ఉచిత బియ్యం పంపిణీ చేయాలి. ఇళ్లలో పనిచేసే వారి పరిస్థితి అర్థం చేసుకుని యజమానులు సాయం చేయాలి.’’ అని ఐద్వా నాయకురాలు అరుణజ్యోతి విన్నవించారు.


సంపాదన పోయింది

* ఎల్‌బీనగర్‌ సమీపంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో డజను మంది ఇస్త్రీ వాళ్లు పనిచేస్తుంటారు. ‘ముగ్గురు పిల్లలు. ఇస్త్రీ పనే కుటుంబానికి ఆధారం. కరోనా భయంతో లోపలికి రానివట్లేదు. రోజంతా ఇస్త్రీ చేస్తే వచ్చే రూ.500 సంపాదనా పోయింది’ అంటూ అక్కడ ఇస్త్రీ చేసే బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.
* చిన్న అపార్టుమెంట్లలో భర్త ఇస్త్రీ, భార్య ఇళ్లలో పనిచేస్తుంటారు. కొన్నిచోట్లయితే బొగ్గులు దొరక్క ఇస్త్రీ పెట్టెలు అటకెక్కాయి.
* పాత మల్కాజిగిరికి చెందిన బీబీ నాలుగిళ్లలో పనిచేస్తుంది. భర్తకు అనారోగ్యం. కరోనా దెబ్బతో కుటుంబం ఎలా గడిచేదంటూ ఆందోళన చెందుతోంది. కరోనా పోయేంతవరకు జీతం ఇస్తానంటూ.. ఓ ఇంటి యజమాని, రైల్వే ఉద్యోగి నారాయణరావు ఉదారత చూపారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.