close

ప్రధానాంశాలు

కునుకు పడితే మనసు కాస్త కుదుటపడతది

కరోనా ఆందోళనలకు సుఖనిద్రే మందు

కరోనా వ్యాప్తి తాలూకు భయాలు, పరిణామాలు ప్రజల్లో ఒత్తిడి, ఆందోళలను పెంచుతున్నాయి. ప్రజల నిద్రపై ఇది ప్రభావం చూపుతోంది. నిద్ర సరిగా లేకుంటే రోగనిరోధక శక్తి తగ్గి శరీరం వైరస్‌ తాకిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. శారీరక, మానసిక కుంగుబాటుకు దారితీస్తుంది. ప్రస్తుతం కరోనా నివారణ మార్గాలుగా పాటిస్తున్న భౌతిక దూరం, చేతుల శుభ్రతతో పాటు నిద్రకూ అంతే ప్రాధాన్యముందని న్యూరోసైకాలజిస్టులు వివరిస్తున్నారు. హాయిగా నిద్రించేందుకు ఆరు చిట్కాలు సూచిస్తున్నారు.


ఏం ఫరవాలేదు

కరోనా విజృంభణతో చాలామంది దినచర్య మారిపోతోంది. ఎందరో ఉపాధి కోల్పోతున్నారు. కొందరు ‘వర్క్‌ ఫ్రం హోం’కు అలవాటు పడుతున్నారు. మరెందరో ఇళ్లలోనే ఉన్న పిల్లల చదువులు సాగేదెలా అన్న బెంగ పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులు, ఆలోచనలు ఎన్ని ఉన్నా నిద్ర విషయంలో ఆ ప్రభావం పడకుండా చూసుకోండి. వీలైనంత వరకు గతంలో ఎలా వ్యవహరించేవారో అలాగే గడిపేయాలి. ఇంటినుంచి పనిచేస్తున్న వారయితే మునుపటిలాగే నిద్ర లేచి సిద్ధంకండి. వెళ్లేది పక్క గదిలోకే అయినా ముందు ఆఫీసులో ఎలా ఉండేవారో అంతే సన్నద్ధం కండి.


సమయపాలన మరవొద్దు

ఇంట్లోనే స్వీయ నిర్బంధం చేసుకుని గడిపే రోజులివి. ఏమాత్రం వీలున్నా నిద్ర వైపు మనసు లాగుతుంటుంది. వీలుంది కదాని కునుకు తీయకుండా మునుపటి నిద్రవేళలే పాటించండి. ఉదయాన్నే లేచి పనులు చక్కబెట్టేలా ఉత్సాహంగా మారండి. ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్న వారైనా ఇలాగే చేయండి.


కసరత్తులు కొనసాగించు

లాక్‌డౌన్‌లో మీ జిమ్‌ మూతపడింది. అలాగని కసరత్తులు ఆపేయొద్దు. రోజూ చేసే వ్యాయామం సరైన నిద్రకు ఎంతో ముఖ్యం. మీరు చేసిన కసరత్తులే ఆ రోజు నిద్రించే ముందు ఏదో సాధించామన్న భావన కలిగిస్తాయి. అలాగని నిద్రించే ముందు శరీరాన్ని కష్టపెట్టడం సరికాదు. అది నిద్రాభంగానికి దారి తీయొచ్చు.


రోజంతా టీవీ చూస్తే ఆందోళనే

ఇప్పుడు వార్తలన్నీ కరోనానే. అదే పనిగా, రోజంతా ఇదే ధ్యాసగా టీవీ చూస్తున్నా ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. ఓ పద్ధతి, సమయం ప్రకారం విశ్వసనీయ వార్తలే చూడండి. అందుకోసం ప్రముఖ దినపత్రికలు చదవండి. సాధ్యమైనంత వరకు ఫోన్‌ చూడటం తగ్గించండి. నిద్రించే ముందు అయితే కరోనా సంబంధిత వార్తలు చూడకపోవడమే మంచిది.


పడక ముందు నెట్‌ వద్దు

ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్న తరుణంలో సమాచారానికి, వినోదానికి అంతర్జాలం(ఇంటర్‌నెట్‌) ఎంతగానే ఉపయోగపడుతోందనడంలో సందేహం లేదు. అయితే రోజంతా నెట్‌ వీక్షణకే కేటాయిస్తే అది నిద్రకు ఆటంకంగా మారుతుంది. కనీసం పడుకొనే గంట ముందు ఫోన్లు, టీవీ అన్నీ కట్టేయండి. కావాలంటే ఆ సమయంలో పుస్తకం చదవడం, సంగీతం వినడం చేయవచ్చు.


మద్యంతో ప్రమాదం

మద్యం తీసుకుంటే బాగా నిద్ర పడుతుందన్నది నిజం కాదు. తాగినప్పుడు అప్పటికి బాగానే ఉన్నా తర్వాత సరైన నిద్ర రాదు. పైగా ఆరోగ్యానికి హానికరం. పైగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మద్యం ఎక్కువై, నిద్ర తగ్గితే రోగనిరోధక శక్తి మరింతగా క్షీణిస్తుంది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.