close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పుస్తకం.. ఖర్చు యథాతథం

1-5 తరగతులకు అమలుకాని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల వినియోగం
ప్రైవేటులో భారం రూ.కోట్లలోనే!

విద్యాశాఖ తలచుకుంటే కరోనా కష్టకాలంలో తల్లిదండ్రులపై పాఠ్యపుస్తకాల రూపేణా రూ.కోట్ల భారం తగ్గనుంది. రాష్ట్రంలో 1-10 తరగతుల విద్యార్థులు ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలను తప్పక వినియోగించాలన్న ఉత్తర్వులు 1-5 తరగతులకు ఏమాత్రం అమలుకావడం లేదు. కార్పొరేట్‌ పాఠశాలల్లో అయితే మిగిలిన తరగతులకూ అతీగతీ లేదు. విద్యాశాఖ ఏళ్ల తరబడి పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏటేటా పెరుగుతున్న పుస్తకాల ధరలతో తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

ఏ తరగతికి ఏ సిలబస్‌ ఉండాలో శాస్త్రీయంగా నిర్ణయించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) పలువురు నిపుణులతో రాయించి పాఠ్య పుస్తకాలకు రూపమిస్తున్నా వాటిని ప్రైవేట్‌ పాఠశాలలు వాడటం లేదు. విద్యాశాఖ ముద్రించిన పాఠ్య పుస్తకాలనే 6-10 తరగతులతో పాటు 1-5 తరగతులకు సైతం తప్పక వాడాలని 2015లో అప్పటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిరంజీవులు ఆదేశాలు జారీచేశారు. దానిపై కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు పిటిషన్‌ వేసినా హైకోర్టు కొట్టివేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వినియోగిస్తామని అప్పుడు యాజమాన్యాలు రాతపూర్వకంగా కమిషనర్‌కు హామీనిచ్చాయి. తర్వాత కమిషనర్‌గా వచ్చిన కిషన్‌ 1-5 తరగతుల పుస్తకాల అంశాన్ని బయటకు తీశారు. ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి చేయించడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏమీ చేయలేకపోయారు. 1-5 తరగతులకు సర్కారు పుస్తకాలు వాడితే ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై కనీసం రూ.2000 భారం తగ్గుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందిపై రూ.360 కోట్ల భారం తగ్గనుంది.

 

రూ.వందల్లో అవి ... రూ.వేలల్లో ఇవి
సర్కారు పాఠ్యపుస్తకాలు 1-5 తరగతుల సెట్టు ధర రూ.158 నుంచి రూ.236 ఉంటుంది. అదే ప్రైవేట్‌ ముద్రణదారుల పుస్తకాల ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఒకటో తరగతి విద్యార్థికి సైతం జీకే, కంప్యూటర్‌, గ్రామర్‌, ఇతరత్రా రకరకాల పుస్తకాలు అంటగడుతున్నారు. ఫలితంగా రూ.వేలల్లో పుస్తకాల భారం తల్లిదండ్రులపై పడుతోంది.

ఇదీ పరిస్థితి
ప్రైవేట్‌ పాఠశాలల్లో 1-5 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య: సుమారు 18 లక్షలు
వాటిల్లో ఒక్కో విద్యార్థికి పుస్తకాల ఖర్చు: రూ.1500ల నుంచి రూ.3 వేల వరకు
కార్పొరేట్‌ పాఠశాలల్లో ఖర్చు: రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు

* ప్రభుత్వ పుస్తకాలు వాడితే తల్లిదండ్రులపై తగ్గే భారం రూ.360 కోట్లు (ఒక్కో విద్యార్థికి సగటున రూ.2 వేలు)

- ఈనాడు, హైదరాబాద్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.