close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నగరం కాదది..

అయోధ్య,...

ఇతర నగరాల మాదిరిగా అదో భౌగోళిక ప్రాంతం కాదది! భారతీయ ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు దిక్సూచి. సనాతన సాంస్కృతిక హర్మ్యానికి హృదయపీఠి. ఆదికవి వాల్మీకి రామాయణానికి పునాది... ఈ అయోధ్య! వేదాల నుంచి మొదలెడితే... పురాణాల దాకా అయోధ్య ప్రస్తావన కన్పిస్తుంది.
‘అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా
తస్యాగ్‌ం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్తః...’

అంటూ...
ఇది కేవలం నగరం కాదు... మానవ జీవ చైతన్యానికి ఇదో ప్రతీక అని అధర్వణవేదం చెప్పిన అయోధ్య గురించి... వాల్మీకి అద్భుతంగా వర్ణించారు.


ఎంత పెద్దదంటే...

అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా
మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితాస్వయమ్‌!

కోసల దేశంలో ఉన్న ఈ అయోధ్య స్వయంగా మనువు నిర్మించింది. అయోధ్య పొడవు 12 యోజనాలు. వెడల్పు మూడు యోజనాలు. ఇప్పటి లెక్కలో ఇది సుమారు 168 కి.మీ పొడవు, 42 కి.మీ వెడల్పునకు సమానం. అంటే అప్పటి అయోధ్య వైశాల్యం 7,056 చ.కిమీ! ప్రతిభావంతులైన శిల్పులు, వాస్తు నిపుణులు శాస్త్రప్రమాణాలతో తీర్చిదిద్దారని వాల్మీకి వర్ణించారు.
చిత్రామ్‌ అష్టాపదాకారాం వరనారీగణైర్యుతామ్‌
సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్‌

చదరంగంలో ఉండే పలకల వంటి నిర్మాణాలు కలిగిన భవనాలు ఇక్కడ ఉండేవని వాల్మీకి స్పష్టంగా చెప్పారు. అందంతో పాటు ప్రజల్ని కాపాడేందుకు శత్రువుల ఊహకు అందనివిధంగా నిర్మాణాల కోసం అప్పటి శిల్పులు తీసుకున్న శ్రద్ధ ఇందులో కనిపిస్తుంది.  ఎత్తైన కోట బురుజులు, ధ్వజాలు, వందలకొద్దీ శతఘ్నులు ఉండేవి. కోటకు రక్షణగా మేలుజాతి గుర్రాలు, వేగంగా నడిచే ఏనుగులు, వృషభాలు, ఒంటెలు ఉండేవి. మొత్తంగా శత్రుదుర్భేద్యంగా అయోధ్యను తీర్చిదిద్దారు నిపుణులు.


ప్రజలెలా ఉండేవారంటే...

దశరథుడు పరిపాలించిన కాలంలో సంపన్నుడు కాని వ్యక్తి ఆ నగరంలో లేడు. గో, ధన, ధాన్య, వాహన సమృద్ధి లేని గృహం ఉండేది కాదు. ఈ సంపదనంతా యజమానులు కేవలం ధర్మబద్ధంగా సంపాదించి, అలాగే ఖర్చు చేసేవారు. ఈ నగర ప్రజలంతా మహర్షులతో సమానమైన ఇంద్రియ నిగ్రహం, తేజస్సు కలిగి ఉండేవారు. అయోధ్యలో ఆకలితో అలమటించే వ్యక్తి ఒక్కడూ లేడు. దానం కోసం అర్రులు చాచే వ్యక్తి లేడు. నుదుట తిలకం ధరించని మనిషి కనిపించడు. దీనుడు కానీ, రోగపీడితుడు కానీ ఉండేవారు కాదు. అయోధ్య అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు... ధర్మానికి అది నిలయం!
వాణిజ్యంలో అయోధ్యకు సాటిరాగల నగరం అప్పట్లో లేదు. నగరం మధ్యభాగంలో అంగడులు ఉండేవి. క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో ప్రధానవీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కేవలం కప్పం చెల్లించటానికి వచ్చే సామంతరాజులు బారులు తీరేవారట. సంగీత, సాహిత్య, నృత్య, నాటక, గీతాది కళారంగాల్లో నిష్ణాతులంతా అయోధ్యలో ఉండేవారు.


‘యోద్ధుం అశక్యా ఇతి అయోధ్య’
జయించటానికి వీలుకానిది అయోధ్య అంటారు వాల్మీకి. కాంభోజ, బాహ్లిక, వనాయు, సింధు దేశాలకు చెందిన ఉత్తమ జాతి గుర్రాలు ఇక్కడ ఉండేవని వాల్మీకి బాలకాండలో వివరించారు. వింధ్య పర్వతాల్లో సంచరించే ఏనుగుల్ని ప్రత్యేకంగా ఈ నగరానికి తెప్పించి వాటికి శిక్షణనిచ్చేవారు. ఉత్తమజాతి పశుగణం అయోధ్యలో ఉండేది. అంతేకాదు...రెండు, మూడేసి జాతుల సాంకర్యంతో పశుగణాల్ని ఉత్పత్తిచేసే విధానం ఇక్కడ ఉండేది. భద్రమంద్ర, భద్రమృగ, మృగమంద్ర జాతులకు చెందిన ఏనుగులు ఇలా పుట్టినవే. బలమైన రాజ్యవ్యవస్థ అయోధ్యలో ఉండేది. అందుకే అయోధ్య అంటే అక్కడి ప్రజలకు మాత్రమే కాదు విదేశీయులకూ ఎంతో ప్రీతిగా ఉండేది.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా

స్కాందపురాణ దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది. ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది. అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి. యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది.  అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్‌లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.