మూడు గంటల పాటు చెట్టు కిందే కన్నతండ్రి మృతదేహం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు గంటల పాటు చెట్టు కిందే కన్నతండ్రి మృతదేహం

 సాయానికి ఎవరూ ముందుకురాని వైనం
 ద్విచక్ర వాహనంపై తరలించిన కుమారులు

అల్లాదుర్గం, న్యూస్‌టుడే: కన్నతండ్రి కళ్ల ముందే చనిపోయినా.. మృతదేహాన్ని తరలించడంలో సాయం పట్టేందుకు భయంతో ఎవరూ ముందుకురాలేదు. దీంతో మరో ఊరిలో ఉన్న సోదరుడిని తీసుకొచ్చి.. చివరికి బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన ఇది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం కేంరాజ్‌కల్లాలి గ్రామానికి చెందిన పోతురాజు గంగారాం (80)కు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు సుభాష్‌ను బాన్సువాడ మండలం తునికి గ్రామంలో ఇల్లరికం ఇచ్చాడు. చిన్నకుమారుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతంలో పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లక్ష్మణ్‌ వద్దే గంగారాం ఉంటున్నాడు. ప్రతి నెలా చిన్న కుమారుడితో కలిసి సొంతూరికి వెళ్లి వృద్ధాప్య పింఛన్‌ తెచ్చుకుంటాడు. బుధవారం కుమారుడితో పాటు ద్విచక్ర వాహనంపై సొంతూరికి బయలుదేరాడు. మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ రహదారి 161పై మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి వద్దకు చేరుకోగానే తండ్రి దాహం వేస్తోందని చెప్పడంతో బైక్‌ ఆపి నీరు తాగించాడు. ఆ వెంటనే వృద్ధుడు మృతి చెందాడు. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. కొందరు కనిపించినా దగ్గరికి రాలేదు. సోదరుడు సుభాష్‌కు ఫోన్‌ చేసి మాట్లాడుతుండగానే స్విచ్ఛాఫ్‌ అయింది. దిక్కుతోచని స్థితిలో లక్ష్మణ్‌ పక్కనే ఉన్న చెట్టు కింద తండ్రి మృతదేహాన్ని పడుకోబెట్టాడు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఉన్న సోదరుడి దగ్గరికి బైక్‌పై వెళ్లి తీసుకొచ్చాడు. అప్పటికే సమాచారం తెలుసుకున్న సీఐ జార్జి, ఎస్సై మోహన్‌రెడ్డి మృతదేహం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. సోదరుల వద్ద డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ వాహనాన్ని ఇవ్వలేదు. పెట్రోలు కోసం ఒకరు డబ్బులిచ్చారు. చేసేదేమిలేక సాయంత్రం 6 గంటలకు సోదరులిద్దరూ బైక్‌పై తండ్రి మృతదేహాన్ని కూర్చోబెట్టుకొని 60 కిలోమీటర్ల దూరంలోని సొంతూరు కేంరాజ్‌కల్లాలికి వెళ్లిపోయారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు