
నీళ్లు తాగకుండా ఉండలేం. ఇది మనకు అత్యవసర పోషకం. అంతమాత్రాన ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని అనుకోవటం అపోహే! మన ఒంట్లో దాదాపు 60% నీరు, ద్రవాలే ఉంటాయి. నీళ్లు తాగకపోతే గట్టిగా వారం కూడా బతకలేం. మరే పోషకలోపమూ మనల్ని ఇంత వేగంగా మృత్యువు దగ్గరకు తీసుకుపోలేదు. మన దేహంలో నీళ్లకు అంతటి ప్రాముఖ్యం ఉంది. అయితే- నేటికీ మనం నిత్యం ఎంత నీరు తాగాలి? అన్న ప్రశ్నకు విస్పష్ట సమాధానం లేదు. సాధారణంగా వైద్యరంగంలో అంతా కూడా- మనకు దాహం వేసినా వేయకున్నా.. సగటున రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు (సుమారు 2 లీటర్లు) తాగాలని చెబుతుంటారు.
నీరు- ప్రాణాధారం
మనం ఎన్ని నీళ్లు తాగాలన్న దానికి దాహమే కొలమానమనీ అమెరికా నిపుణులంటున్నారు. ఒక్క వృద్ధుల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. ఎందుకంటే వృద్ధుల్లో ఒంట్లో నీళ్లు తగ్గిపోతున్నా కూడా దాహం అనిపించకపోవచ్చు. అందుకని దాహమనిపించినా లేకున్నా కూడా రోజంతా అప్పుడప్పుడు నీళ్లు తాగుతుండాలి. అలాగని మరీ ఎక్కువగా తాగితే కొందరు వృద్ధుల్లో రక్తంలో సోడియం పాళ్లు కాస్త తగ్గొచ్చు. దీంతో తలతిరిగి పడిపోయే ముప్పు కూడా పెరుగుతోందని గుర్తించారు. చాలామంది నీళ్లు అధికంగా తాగితే ఒంట్లోంచి మలినాలు బాగా బయటకుపోతాయనీ, చర్మం నిగనిగలాడుతుంటుందనీ, మలబద్ధకం దరిజేరదనీ చెబుతుంటారు. కానీ ఇవేవీ కూడా శాస్త్రీయంగా రుజువైనవి కాదు. నీరు ఎక్కువగా తాగితే పెద్ద నష్టం లేకపోవచ్చుగానీ ప్రత్యేకించి లాభం మాత్రం లేదని వైద్యరంగం స్పష్టంగా చెబుతోంది.
ఒంట్లో నీటి శాతం తగ్గటాన్ని ‘డీహ్రైడేషన్’ అంటారు. ఈ స్థితి తలెత్తకుండా చూసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే నీరు తగ్గిపోతే కిడ్నీలు వ్యర్థాలను సరిగా బయటకు పంపలేవు. ఈ క్రమంలో అవి దెబ్బతింటాయి. ఒంట్లో నీరు తగ్గితే తలనొప్పి రావచ్చు. జలుబు చేసినప్పుడు నీరు ఎక్కువగా తాగితే జిగురుస్రావాలు పల్చగా తయారై, బాధలు అంతగా ఇబ్బంది పెట్టవు. నీటిని తగినంత తీసుకోవటం ద్వారా కొన్ని క్యాన్సర్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ల వంటి సమస్యలను నివారించుకోవచ్చని పరిశోధనలు పేర్కొంటున్నాయి. పిల్లలకు డీహైడ్రేషన్‌తో చురుకుదనం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గే ముప్పూ పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు తరచుగా నీరు ఇవ్వటం మంచిది.
|

తరచూ కూల్డ్రింకులు తాగటం మజాగానే అనిపించొచ్చు. కానీ ఇవి తీవ్ర అనర్థాలకు దారితీస్తాయి. కూల్‌డ్రింకులను ఎంత ఎక్కువగా తాగితే దంతాలు అంతగా దెబ్బతింటాయి. కూల్‌డ్రింకుల్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ వాయువు వల్ల మూత తీయగానే బుడగలు పొంగుకొని వచ్చేస్తుంటాయి. చాలామంది దంతాలు పాడవటానికి ఇదే కారణమని భావిస్తుంటారు. కానీ సమస్యకు మూలం ఇది కాదు.. దీనిలో తీపి కోసం చాలా పెద్దమొత్తంలో కలిపే చక్కెర, రుచికోసం కలిపే ఫాస్ఫోరిక్ ఆమ్లాలే!
హాని డ్రింకులు

కూల్‌డ్రింకుల్లో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు మొత్తమ్మీద తీసుకోదగిన చక్కెరలో సగానికి పైగా ఒక్క కూల్డ్రింకు నుంచే వచ్చేస్తుంది. ఇలా వచ్చే అదనపు క్యాలరీలన్నీ ఒంట్లో కొవ్వుగా మారిపోతాయి. దీంతో బరువు పెరుగుతారు. అందుకే కొందరు క్యాలరీలు తక్కువగా ఉండే ‘డైట్’ పానీయాలు తీసుకుంటున్నారు. కానీ కృత్రిమ తీపి పదార్థాలతో తయారు చేసే ఈ డైట్ డ్రింకులతోనూ బరువు పెరుగుతున్నట్టు అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. పైగా కృత్రిమ తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం క్రమేపీ మధుమేహానికి దారితీస్తోందని కూడా గుర్తిస్తున్నారు. డైట్ డ్రింకుల్లో క్యాలరీలు తక్కువగానే ఉన్నా వీటితోనూ బరువు పెరుగుతున్నారు. సాధారణ చక్కెరతో పోలిస్తే కృత్రిమ తీపి పదార్థాలు- దాదాపు 200 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. దీంతో మరింత తియ్యగా ఉండే పదార్థాలు తినాలనే కోరిక బయలుదేరుతుంది. దీనికి తోడు ఈ కృత్రిమ చక్కెరతో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా, ఆకలికి కీలకమైన హార్మోన్ల వ్యవస్థ సైతం అస్తవ్యస్తమైపోతున్నాయి. దీంతో ఇతరత్రా సమయాల్లో మనం సాధారణ చక్కెర తీసుకున్నా కూడా.. శరీరం దానికి అంతగా స్పందించదు. ఫలితంగా ఎక్కువెక్కువ తీసుకోవటం, బరువు పెరిగిపోవటం.. రెండూ తటస్థిస్తున్నాయి. కాబట్టి కృత్రిమ చక్కెర, డైట్ పానీయాలతో పెద్ద ప్రయోజనం లేదు.
* చక్కెర విషయంలో మన పండ్ల రసాలూ తక్కువేం కాదు. పండ్ల రసాల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండేమాట నిజమేగానీ ఇవీ కూల్డ్రింకులంత తియ్యగానే ఉంటున్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కొన్ని రకాల పండ్ల రసాల్లో కూల్‌డ్రింకుల కన్నా చక్కెర ఎక్కువే ఉంటుంది! ఎంత సహజమైనదైనా అధిక మోతాదుల్లో ఉండటం వల్ల ఇది కూడా- అదనంగా కలిపే చక్కెరల మాదిరే హాని చేస్తుంది. అందుకే పండ్ల రసాయల విషయంలోనూ పరిమితి పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సిఫార్సు చేస్తోంది. అతిగా పంచదార కలిపిన డ్రింకులు, కృత్రిమ చక్కెరల డ్రింకులు, పండ్ల రసాలన్నింటినీ కూడా- మధుమేహ ముప్పు కారకారకాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి విషయంలో ఎక్కడా మితం తప్పకూడదు.
|
బీట్రూట్ రసం- మితంగానే మేలు

రక్తనాళాలు విప్పారేలా చేసే నైట్రేట్లు బీట్రూట్లో దండిగా ఉంటాయి. అందువల్ల దీని సారం రక్తప్రసరణ మెరుగు పడటానికి దోహదం చేస్తుంది. కానీ దీన్ని మితంగానే తీసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్లో సైతం నారింజ వంటి పండ్లలో మాదిరిగానే చక్కెర పాళ్లు ఎక్కువే. అలాగే నైట్రేట్ల మోతాదులు మరీ ఎక్కువైతే జీర్ణాశయ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశమూ ఉంది. కాబట్టి మితంగా బీట్రూట్ రసం తీసుకోవటం మంచిదే.
|

పాలను ‘క్యాల్షియం గని’ అనుకోవచ్చు. కాకపోతే పాలతో ప్రయోజనం పిల్లల్లోనే ఎక్కువ. పెద్దల్లో అందరం చెప్పుకొనేటంతటి గొప్ప ప్రయోజనమేం ఉండటం లేదని తేలుతోంది. సమస్త జీవరాశుల్లో పెద్దయ్యాక కూడా పాలు తాగేది ఒక్క మనిషే! పాలలో నీరు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, చక్కెరలు, సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివన్నీ ఉంటాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారమనీ అంటుంటారు. పుట్టిన తర్వాత తొలి సంవత్సరంలో శిశువులకు అవసరమైన అన్ని పోషకాలూ తల్లిపాల నుంచే లభిస్తాయి. ఏడాది తర్వాత మాత్రం పిల్లలకు అదనంగా వెన్నతీయని పాలు ఇవ్వాలని సిఫారసు చేస్తుంటారు. వీటిలో ఉండే కొవ్వు పిల్లల మెదడు వృద్ధికి తోడ్పడుతుంది.
పాలు- క్యాల్షియం గని
అమెరికా, బ్రిటన్‌లో బడులకు వెళ్లే విద్యార్థులకు పాలు ఇచ్చి పరిశీలించగా.. వారి ఆరోగ్యం బాగా మెరుగుపడినట్టు తేలింది. పాల నుంచి లభించే ప్రోటీన్లు, పోషకాల వల్లనే ఈ ఫలితాలు బాగున్నాయా? లేక పాలల్లో ఇంకేదైనా ప్రత్యేక గుణముందా? అనేది ఇంకా అంతుబట్టలేదు. ఎదుగుదల దెబ్బతిన్న పిల్లలకు పాలు ఇస్తే ఎత్తు పెరిగినట్టు కెన్యా అధ్యయనంలో బయటపడింది. అయితే ఎదుగుదల మామూలుగా ఉన్న పిల్లల్లో మాత్రం పాలు పెద్దగా ప్రభావం చూపకపోలేదు. అలాగే పెద్దల విషయంలోనూ పాలతో ప్రత్యేకంగా ఒనగూడే ప్రయోజనాలేవీ కనబడటం లేదు. ఉదాహరణకు.. ఎముకల పటుత్వానికి, ఎముకలు విరగకుండా నివారించుకోవటానికి పాలు తోడ్పడతాయని చెప్పేందుకు బలమైన ఆధారాలేవీ లభించలేదు. క్యాల్షియం పాలలోనే కాదు... ఆకుకూరలు, చిక్కుళ్ల వంటి వాటిలోనూ ఉంటుంది. కాబట్టి క్యాల్షియం లబ్ధి ఒక్క పాలతోనే లభిస్తుందని భావించాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలో ఎముక పుష్టికి- పాలే కాదు- ఆరోగ్యకరమైన ఆహారం, బరువులను మోసే వ్యాయామాల వంటివి ముఖ్యం. వాస్తవానికి పెద్దవయసులో రోజూ అధికంగా పాలు తాగటం వల్ల కొంత నష్టం జరుగుతోందా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 20 ఏళ్ల పాటు రోజూ ఒక గ్లాసు పాలు తాగిన వారితో పోలిస్తే.. 3 గ్లాసుల పాలు తాగిన వారిలో మరణాలు అధికంగా ఉన్నట్టు స్వీడన్ అధ్యయనంలో వెల్లడైంది. ఇదే సమయంలో- పెరుగు, ఛీజ్ వంటి పులియ బెట్టిన పాల పదార్థాలతో ఎముకలు విరిగే ముప్పు, మరణాలు తగ్గినట్టు తేలటం విశేషం. పులిసే సమయంలో పాలలోని లాక్టోజ్ రకం చక్కెర స్థాయులు తగ్గిపోతుండటమే దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.
|

నిస్సత్తువ ఆవరించినప్పుడు ఓ కప్పు కాఫీ పడితే.. ఉత్సాహం వెల్లువెత్తే మాట నిజం. చాలామంది ఇలా కాఫీకి అలవాటుపడటం మంచిదికాదంటుంటారుగానీ ఇదేమంత చెడ్డది కాదంటున్నారు పరిశోధకులు. కాఫీలో కెఫీన్ ఉంటుందని, దీనికి అలవాటుపడితే ఇదో వ్యసనంలా తయారై... తలనొప్పి, నిద్రాభంగం, గుండె జబ్బు, క్యాన్సర్ల వంటి ముప్పులూ పెరుగుతాయని చాలామంది చెబుతుంటారు. కానీ అధ్యయనాలను తరచి చూస్తే కాఫీ వల్ల ఇంత పెద్ద ఇబ్బందులేం లేవనే అర్థమవుతుంది.
కాఫీ- ఉత్సాహ తరంగిణి!
కాఫీతో ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది- మొదట్లో దీనివల్ల ఉత్సాహం, ఏకాగ్రత పెరిగినా క్రమేపీ మన శరీరం దీనికి అలవాటు పడిపోతుంద. దీంతో మాటిమాటికీ కాఫీ తాగటం మొదలై సమస్యలు బయల్దేరతాయి. వాస్తవానికి కాఫీ తాగని వాళ్లతో పోలిస్తే కాఫీ అలవాటు ఉన్నవారిలో చురుకుదనం ఏమంత ఎక్కువగా ఉండటం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటివన్నీ వినగానే కాఫీ చెడ్డదనే అనిపించొచ్చు. కానీ మితంగా.. రోజుకు 3-4 కప్పులకు మించకుండా తాగితే పెద్దగా హాని చేయకపోవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఒకవేళ దీనికి అలవాటు పడినా మానెయ్యటం పెద్ద కష్టమేం కాదు. కాఫీలో కెఫీన్ ఒక్కటే కాదు. క్లోరెజెనిక్ ఆమ్లాలు కూడా పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరం గ్లూకోజును స్వీకరించే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీంతో కాఫీ తాగే వారికి మధుమేహం ముప్పు తగ్గుతుందనే వాదనకు బలం చేకూరుతోంది.
కాఫీ గింజల్లో ‘చెడ్డ’ కొలెస్ట్రాల్‌ను పెంచే కేఫెస్టాల్, కావీయోల్ రకం నూనె పదార్థాలుంటాయిగానీ మనం ఎక్కువగా తీసుకునే ఇన్స్టంట్, ఫిల్టర్ కాఫీల్లో ఇవి తొలగిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. అయితే కాఫీ అతిగా తాగితే మాత్రం క్యాన్సర్ ముప్పు పెరగొచ్చు. కాఫీ తాగేవారు సిగరెట్లు, మద్యం కూడా ఎక్కువగా తాగుతుంటారని.. ఇవన్నీ కలిసి క్యాన్సర్‌కు దారితీస్తుండొచ్చని భావిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా కాఫీ ‘క్యాన్సర్ కారకం కావొచ్చు’ అనే అభిప్రాయాన్ని ‘కచ్చితమైన రుజువేదీ లేదు’ అని మార్చుకుంది. నిజానికి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ వేడిగా ఉండే పానీయాలేవైనా అన్నవాహిక క్యాన్సర్‌కు దారితీయొచ్చు. కాబట్టి కాస్త వేడి చల్లారిన తర్వాతే కాఫీ తాగటం మంచిది.
|

గరంగరం చాయ్ తాగితే.. ఆ తృప్తే వేరు! ఇది గింజల నుంచి వచ్చే కాఫీ లాంటిది కాదు.. జీవంతో తొణికిసలాడే ఆకుల నుంచి వస్తుంది. తేయాకులో ఫ్లేవనాయిడ్లు దండిగా ఉంటాయి. ముఖ్యంగా గ్రీన్‌టీలో ‘ఎపిగాలోక్యాటెచిన్-3-గలేట్’ (ఈజీసీజీ) అనే ఫ్లేవనాయిడ్లు మరీ ఎక్కువ. ఇవి యాంటీఆక్సిడెంట్లు కావటం వల్ల క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. గ్రీన్‌టీ మూలంగా రొమ్ము, పేగులు, వూపిరితిత్తుల క్యాన్సర్ల ముప్పు తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు సూచిస్తుంటే.. 2009లో 16 లక్షల మందిపై నిర్వహించిన దాదాపు 51 అధ్యయనాలను సమీక్షించినపుడు ఫలితాలు మరీ ఇంత గొప్పగా ఏమీ లేవని గుర్తించారు.
తేనీరు - ఆరోగ్యదాయిని
మధుమేహం ఉన్న ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో గ్రీన్, బ్లాక్ టీ డికాక్షన్ల మూలంగా వాటి రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే మనుషుల విషయానికి వచ్చేసరికి- గ్లూకోజును వినియోగించుకునే జీవక్రియలు మెరుగుపడినట్టు కనుగొనటం విశేషం. గుండెజబ్బు ముప్పు గలవారిలో తేయాకు, తేనీరు కొలెస్ట్రాల్ తగ్గటానికీ తోడ్పడుతున్నాయి. తేయాకులోని క్యాటెచిన్స్ అనే రసాయనాలు కొవ్వును, పిండి పదార్థాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లను అడ్డుకుంటున్నట్టు.. నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తూ జీవక్రియలు పుంజుకోవటానికి తోడ్పడుతున్నట్టు తేలింది. వూబకాయులు, అధికబరువు గలవారిలో స్వల్పంగా బరువు తగ్గటానికీ తేయాకు దోహదం చేస్తున్నట్టు బయటపడింది. అయితే తేయాకులో ఫ్లోరైడ్ కూడా ఉంటుంది. ఒంట్లో దీని స్థాయులు మరీ పెరిగిపోతే దంతాలు వూడిపోయే ప్రమాదముంది. కాకపోతే రోజూ పదుల సంఖ్యలో టీలు తాగుతుంటేనే దీంతో నష్టం. చాలావరకు తేయాకులోని ఫ్లోరైడ్, యాంటీబ్యాక్టీరియా గుణాలు చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్రీన్‌టీ మౌత్‌వాష్ మాదిరిగా నోట్లోని బ్యాక్టీరియాను చంపుతున్నట్టూ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక బ్లాక్‌టీ పిప్పిపళ్లతో పోరాడుతుంది. నోట్లో సహజ యాంటీబ్యాక్టీరియా ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది కూడా. టీ గురించి వైద్య పరిశోధనల్లో ఎక్కడా కూడా ఏమంత ప్రతికూల ఫలితాలు కనబడకపోతుండటం విశేషం!
|
గోధుమ గడ్డి రసం
ఆకుకూరల మాదిరిగానే ఇతరత్రా ఆకుకూరల మాదిరే గోధుమ గడ్డిలో పత్రహరితంతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచిదే. కాకపోతే గోధుమగడ్డి రసంతో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయని చాలామంది నమ్ముతుంటారు. పరిశోధనల్లో మాత్రం- పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలకన్నా దీంతో అదనపు ప్రయోజనాలేం ఒనగూడటం లేదని వెల్లడవటం విశేషం.
|