వేడి సమస్యలు-రకరకాలు
ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతోంది. ఏటేటా ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల ఉద్ధృతి పెరుగుతోంది. గాలిలో తేమ పెరగటం కూడా దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇవన్నీ మన ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపుతున్నాయి. ఇవి రకరకాల ‘వేడి’ సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.
చెమట పొక్కులు ఇది మామూలు సమస్యే కావొచ్చు గానీ దురద, మంటతో తెగ ఇబ్బంది పెడుతుంది. మన చర్మ కణాల్లో కొన్ని నిరంతరం చనిపోతుంటాయి. ఇవి కొన్నిసార్లు అలాగే ఉండిపోవచ్చు. దుమ్ము, మురికి వంటివీ అక్కడ చేరుకోవచ్చు. ఇవన్నీ స్వేద రంధ్రాలకు అడ్డుపడితే అవి మూసుకుపోతాయి. దీంతో అక్కడి చర్మం ఉబ్బిపోయి, చిన్న చిన్న పొక్కులు బయలుదేరతాయి. సాధారణంగా చెమట పొక్కులు పిల్లల్లో ఎక్కువ. అలాగని పెద్దవాళ్లకు రాకూడదనేమీ లేదు. ఇవి మెడ, ఛాతీ పైభాగం, గజ్జల్లో, రొమ్ముల కింద, మోచీతి మడతల్లో ఎక్కువగా వస్తుంటాయి. ఎండలో ఎక్కువగా తిరిగేవారికి, అపరిశుభ్ర ప్రాంతాల్లో నివసించేవారికి, నైలాన్ వంటి దుస్తులు వేసుకునేవారికి, బిగుతైన దుస్తులు ధరించేవారికి వీటి ముప్పు ఎక్కువ. స్వేదగ్రంథులు మరీ ఎక్కువగా ఉండేవారికీ, స్వేదనాళాలు పూర్తిగా ఏర్పడనివారికీ ఇవి ఎక్కువగా వస్తుంటాయి. ఏం చెయ్యాలి?: నిజానికి చెమట పొక్కులు వాటంతటవే తగ్గిపోతుంటాయి. అయితే కొందరికి ఇవి చర్మం లోపలి పొరల్లోకీ వ్యాపించొచ్చు. చీము కూడా పట్టొచ్చు. అందువల్ల పొక్కులు ఉన్న భాగం పొడిగా ఉండేలా, రాపిడి పడకుండా చూసుకోవటం మంచిది. పొక్కులు బాగా వేధిస్తుంటే కొన్ని పూతమందులు బాగా ఉపయోగపడతాయి. దురద ఉంటే యాంటీ హిస్టమిన్ మందులతో మంచి ఉపశమనం లభిస్తుంది. అరుదుగా కొందరికి.. ముఖ్యంగా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు గలవారిలో పొక్కులు ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. వీరికి అవసరాన్ని బట్టి యాంటీబయోటిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
|
కండరాలు పట్టేయటం ఇది ఉండేది కొద్దిసేపే గానీ తీవ్రమైన నొప్పితో వేధిస్తుంది. ఎండకాలంలో చెమటతో పాటు సోడియం, పొటాషియం వంటి లవణాలూ బయటకు వెళ్లిపోతాయి. కణజాలం, కండరాలు సజావుగా పనిచేయటానికి తోడ్పడే ఇవి తగ్గిపోతే కండరాలు పట్టేయటానికి దారితీస్తుంది. ముఖ్యంగా పిక్క కండరాలు పట్టేస్తుంటాయి. కొందరికి కాళ్లు, చేతులు కొంకర్లు (టెటనీ) పోవచ్చు కూడా. ఎండలో ఎక్కువసేపు గడపటం, నడవటం, వ్యాయామం, శ్రమ చేయటం వంటివి కండరాలు పట్టేయటానికి దారితీస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు గలవారికీ దీని ముప్పు ఎక్కువే. రక్తపోటు తగ్గించే కొన్ని మందులు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేయటం వల్ల లవణాల మోతాదులూ తగ్గుతాయి. ఇక మధుమేహుల్లో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉండటం మూలంగానూ కండరాలు పట్టేస్తుంటాయి. ఏం చెయ్యాలి?: కండరాలు పట్టేసినపుడు విశ్రాంతి తీసుకోవటం మంచిది. అలాగే లవణాలతో కూడిన ద్రావణాలు తాగాలి. మజ్జిగలో ఉప్పు, నిమ్మరసం వేసుకొని తాగొచ్చు. వీలుంటే ఓఆర్ఎస్ పొడిని నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు. ఎండకు బయటకు వెళ్లటానికి ముందే తగినంత నీరు తాగితే ఇంకా మంచిది. ఒకవేళ విశ్రాంతి తీసుకున్నా.. నీళ్లు, లవణాలు తీసుకున్నా లక్షణాలు తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రతించాలి. అవసరమైతే సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. తలతిప్పు, నిస్సత్తువ, వాంతులు, తలనొప్పి, తీవ్రమైన జ్వరం వంటివీ ఉంటే అవసరాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. |
కాళ్ల వాపు వేసవిలో.. ముఖ్యంగా ఎండకాలం తొలిరోజుల్లో కొందరికి పాదాలు, మడమలు, కాళ్లు ఉబ్బుతుంటాయి. ఇది ఎండకు, వేడికి అలవడటానికి శరీరం చేసే ప్రయత్నమే. ఎండ, వేడిగాలి మూలంగా రక్తనాళాలు వ్యాకోచిస్తుంటాయి. అలాగే మూత్రం ఉత్పత్తిని తగ్గించే హార్మోన్లు ఎక్కువవుతుంటాయి. మరోవైపు అధిక వేడి కారణంగా శరీరానికి దూరంగా ఉండే కాళ్ల వంటి భాగాల నుంచి గుండెకు తిరిగి రక్తం చేరుకోవటం మందగిస్తుంది. దీంతో రక్తంలోని ద్రవాలు బయటకు వచ్చి పాదాలు ఉబ్బుతుంటాయి. కొందరికి చేతులు, వేళ్లు కూడా ఉబ్బొచ్చు. నిజానికిదేమీ పెద్ద సమస్య కాదు. కానీ చాలామంది భయపడిపోతుంటారు. సాధారణంగా కిడ్నీ, లివర్ జబ్బుల వంటి తీవ్ర సమస్యల్లో పాదాలు ఉబ్బటం కనబడుతుంటుంది. అందువల్ల తమకేమయ్యిందోనని ఆందోళనకు గురవుతుంటారు. కొందరైతే తమకు తామే మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు వేసుకుంటుంటారు కూడా. ఇది చాలా తప్పు. ఎండకాలంలో చెమట మూలంగా రక్తం పరిమాణం తగ్గుతుంది. ఇక మూత్రం వచ్చే మందులూ వేసుకుంటే నీరు మరింత ఎక్కువగా బయటకు పోతుంది. సోడియం, పొటాషియం వంటి లవణాలూ తగ్గుతాయి. దీంతో స్పృహ తప్పటం వంటి ఇబ్బందులూ తలెత్తొచ్చు. ఏం చెయ్యాలి? కిడ్నీ, కాలేయ సమస్యలేవీ లేకపోతే కాళ్ల వాపునకు అంతగా భయపడాల్సిన పనేమీ లేదు. దీనికి ప్రత్యేకమైన చికిత్స కూడా అవసరం లేదు. పాదాలు ఎత్తుగా ఉండేలా కాళ్ల కింద దిండు పెట్టుకొని పడుకుంటే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. ఎక్కువసేపు నిలబడకుండా, ఒకేచోట కూచోకుండా చూసుకోవాలి. |
వడదెబ్బ ఇది ప్రాణాపాయానికి దారితీసే సమస్య. ఒంట్లో నీటి శాతం పడిపోవటం దీనికి మూలం. అధిక వేడి మూలంగా ఒంట్లో నీరంతా చెమట రూపంలో ఆవిరి అవుతూ వస్తుంటుంది. ఇది దీర్ఘకాలం కొనసాగుతే చివరికి ఒంట్లో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. దీంతో చెమట పట్టటం ఆగిపోతుంది. చర్మం పొడి బారుతుంది. శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగిపోతుంది. ఉన్నట్టుండి జ్వరం 105 డిగ్రీల ఫారన్హీట్ దాటుతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గటం వల్ల రక్తపోటూ పడిపోతుంది. ఎండలోకి వెళ్తేనే వడదెబ్బ తగులుతుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఎండలోకి వెళ్లకపోయినా వడదెబ్బ తగలొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వృద్ధులకు దాహం వేస్తుందనే సంగతి అంతగా తెలియదు. దీంతో తగినంత నీరు తీసుకోరు. ఫలితంగా తెలియకుండానే ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. పైగా పిల్లల్లో, వృద్ధుల్లో స్వేదగ్రంథులు తక్కువగా ఉండటం వల్ల చెమట అంతగా పట్టదు. కొన్నిరకాల మందులు- గుండెజబ్బులు, కిడ్నీజబ్బులు, అధిక రక్తపోటు, మానసిక సమస్యలకు వేసుకునే మందులతోనూ వడదెబ్బ ముప్పు పెరగొచ్చు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చెమట బాగా పోస్తుంది గానీ ఆవిరి కాదు. దీంతో ఒళ్లు చల్లబడదు. అందువల్ల ఇలాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా వడదెబ్బ తగిలే అవకాశముంది. చికిత్స: శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారన్హీట్ దాటితే మాంసకృత్తులు, ఫాస్ఫోలిపిడ్లు దెబ్బతింటాయి. దీంతో మెదడుతో పాటు కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలన్నీ దెబ్బతినటం ఆరంభిస్తాయి. రక్తం గడ్డకట్టే ప్రక్రియ కూడా అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా స్పృహ తప్పటం, తికమక పడటం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ వంటివన్నీ దాడిచేస్తాయి. గుండె రక్తాన్ని పంప్ చేయటం తగ్గుతుంది. కోమాలోకీ వెళ్లిపోవచ్చు. ఇది ప్రాణాపాయ పరిస్థితి. దీంతో కొందరు చూస్తుండగానే మరణించే ప్రమాదముంది. కాబట్టి వడదెబ్బకు అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. సెలైన్ ఎక్కించటం వల్ల రక్తం మోతాదు పెరిగి రక్తపోటు పెరుగుతుంది. చర్మానికి తగినంత రక్తం సరఫరా అయ్యి చెమట పట్టటం ఆరంభిస్తుంది. అపస్మారక స్థితిలో ఉండి, శ్వాస సరిగా తీసుకోలేకపోతుంటే వెంటిలేటర్ సాయంతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఏం చెయ్యాలి? * వడదెబ్బకు గురైనప్పుడు ముందుగా చేయాల్సింది శరీరం చల్లబడేలా చూడటం. ఎండలో ఉన్నట్టయితే వెంటనే నీడపట్టుకు చేర్చాలి. బిగుతుగా ఉన్న దుస్తులను విప్పేయాలి. గాలి బాగా ఆడేలా చూడాలి. చల్లటి నీటిలో బట్టను ముంచి ఒళ్లంతా తుడవాలి. లేదా ఐస్ ముక్కలను బ్యాగులో వేసి ఒళ్లంతా తడమాలి. వీలుంటే ఒంటి మీద నీళ్లు గుమ్మరించి.. ఫ్యాన్ గాలి తగిలేలా చేయటం మంచిది. ఫ్యాన్ లేకపోతే విసనకర్రతోనైనా ఊపుతుండాలి. చంకల్లో, గజ్జల్లో స్వేదగ్రంథులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అక్కడ ఐస్ ముక్కలు పెట్టొచ్చు. ఇవన్నీ ఒళ్లు చల్లబడటానికి దోహదం చేస్తాయి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఒళ్లు కాలిపోతోంది కదాని జ్వరం తగ్గించే ప్యారాసిటమాల్ వేయటం తగదు. అలాగే నొప్పి తగ్గించే ఐబూప్రొఫెన్ వంటి మందులు కూడా ఇవ్వకూడదు. |
స్పృహ తప్పటం కొందరు ఎండలోకి వెళ్లి రెండడుగులు వేస్తారో లేదో.. హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతుంటారు. మెదడుకు తగినంత రక్తం అందకపోవటం వల్ల ఇలా జరుగుతుంది. బయటి వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు శరీరం చల్లబడటానికి రక్తనాళాలు ఉన్నట్టుండి వ్యాకోచిస్తుంటాయి. దీంతో రక్తమంతా చర్మం వైపు వచ్చేస్తుంది. దీంతో మిగతా అవయవాలకు.. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది. ఇది స్పృహ తప్పటానికి దారితీస్తుంది. తలతిప్పు, తలనొప్పి, నాడీ పడిపోవటం, చికాకు, వాంతి, వికారం వంటి లక్షణాలు కూడా ఉండొచ్చు. ఏం చెయ్యాలి?: వేడి మూలంగా స్పృహ తప్పటం కొద్దిసేపే ఉండొచ్చు. చాలామంది త్వరగానే లేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. స్పృహ తప్పినట్టు గుర్తించగానే నీడకు చేర్చాలి. విశ్రాంతిగా కూచోబెట్టాలి. పడుకున్నా ఫర్వాలేదు. దుస్తులు వదులు చేయాలి. కాళ్లు ఎత్తుగా ఉండేలా చూడాలి. తెలివి రాగానే నీరు వంటివి తాగించాలి. రక్తపోటు బాగా తగ్గినా, మరీ నీరసంగా ఉన్నా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. |
తీవ్ర నీరసం, నిస్సత్తువ తీవ్రమైన ఎండ, తేమ వాతావరణంలో ఎక్కువసేపు ఉన్నప్పుడు శరీరం అంతగా చల్లబడదు. దీంతో చెమట ఎక్కువగా పోయటం, కండరాలు పట్టేయటం వంటివి తలెత్తుతాయి. అప్పటికీ పట్టించుకోకపోతే నీరసం, నిస్సత్తువకు దారితీస్తుంది. కొందరు ‘ఏం పని చేయలేకపోతున్నాం. చాలా నీరసంగా ఉంటోంది’ అనీ చెబుతుంటారు. కొందరైతే అడుగు తీసి అడుగైనా వేయలేరు. వీరికి జ్వరం ఉంటుంది గానీ 105 డిగ్రీల ఫారన్హీట్ కన్నా పెరగదు. కొందరు దీన్ని వడదెబ్బగానూ పొరపడుతుంటారు. వడదెబ్బలో చెమట పట్టదు. కానీ ఇందులో చెమట బాగానే పడుతుంది. రోమాలు నిక్కబొడుచుకున్నట్టూ కనబడుతుంది. నాడి వేగం పెరుగుతుంది. పిల్లలకు, వృద్ధులకు, కొన్నిరకాల మందులు వేసుకునేవారికి, ఊబకాయులకు, నీడ పట్టున ఉండేవారికి దీని ముప్పు ఎక్కువ. ఏం చెయ్యాలి?: నిస్సత్తువను పట్టించుకోకపోతే నిజంగానే వడదెబ్బలోకి జారుకునే ప్రమాదముంది. కాబట్టి నిస్సత్తువగా అనిపిస్తే వెంటనే చేసే పనులు ఆపెయ్యాలి. నీడలోకి చేరుకొని, విశ్రాంతి తీసుకోవాలి. చల్లటి నీళ్లు తాగాలి. లవణాలను కలుపుకొని తాగితే మరింత మంచిది. నీళ్లు తాగితే దాహం తీరొచ్చు. రక్తం పరిమాణం పెరగొచ్చు. కానీ సోడియం, పొటాషియం వంటి లవణాలు లభించవు. అవసరమైతే కొందరికి సెలైన్ ఎక్కించాల్సి రావొచ్చు. |
జాగ్రత్తలు-నివారణ

* అవసరమైతే తప్ప ఎండలోకి వెళ్లకూడదు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. పిల్లలకు, వృద్ధులకు ఇది మరింత ముఖ్యం. * బాగా పొద్దెక్కిన తర్వాత పిల్లలు ఎండలో ఆడకుండా చూసుకోవాలి. * బయటకు వెళ్లే ముందే తగినంత నీరు తాగాలి. ఇంట్లో ఉన్నా తరచుగా నీళ్లు తాగాలి. దాహం వేస్తేనే నీళ్లు తాగాలని అనుకోవద్చు. మనకు దాహం వేస్తుందంటేనే అప్పటికే ఒంట్లో ఎంతో కొంత నీరు తగ్గిందని అర్థం. * బయటకు వెళ్లినపుడు విధిగా గొడుగు తీసుకెళ్లాలి. వెడల్పయిన అంచులున్న టోపీ ధరించాలి. * కాటన్ దుస్తులు ధరించటం మంచిది. దుస్తులు వదులుగా ఉండేలా చూసుకోవాలి. ముదురు రంగుల కన్నా లేత రంగు దుస్తులు ధరించాలి. * తలనొప్పి, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనబడితే ఏమాత్రం తాత్సారం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రతించాలి. * ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి వస్తే తరచుగా నీరు తాగటం తప్పనిసరి. మూత్రం ముదురు పసుపుపచ్చ రంగులో వస్తుందంటే తగినంత నీరు తాగటం లేదని తెలుసుకోవాలి. అలాగే చెమట సరిగా పట్టకపోతున్నా పరిస్థితి చేయి దాటుతోందనే అర్థం. * గుండె జబ్బులకు, అధిక రక్తపోటుకు, మానసిక సమస్యలకు, పార్కిన్సన్స్ వంటి జబ్బులకు చికిత్స తీసుకునేవారు ఎండకాలంలో విధిగా డాక్టర్ను సంప్రతించాలి. అవసరమైతే డాక్టర్లు మందులు మార్చటం గానీ మోతాదు తగ్గించటం గానీ చేస్తారు. * ఏసీ లేని కార్లలో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా చూసుకోవాలి. * విహార యాత్రలకు వెళ్లినవారు ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లటం మంచిది. ముఖ్యంగా చల్లటి ప్రాంతాల నుంచి వేడి ప్రాంతాలకు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. * ఎండకాలం రాగానే చాలామంది కూల్డ్రింకులు తాగేస్తుంటారు. ఇవి వడదెబ్బ తగలకుండా చూస్తాయని భావిస్తుంటారు. నిజానికి వీటితో మంచి కన్నా చెడే ఎక్కువ. కూల్డ్రింకులు చల్లగా ఉండటం, చక్కెర పెద్దమొత్తంలో ఉండటం వల్ల తాగినపుడు హాయిగా అనిపించొచ్చు. అంతే తప్ప.. కూల్డ్రింకుల్లో ఎలాంటి ఖనిజ లవణాలూ ఉండవు. అందువల్ల చెమట ద్వారా బయటకు పోయిన లవణాలేవీ భర్తీ కావనే సంగతిని గుర్తించాలి. పైగా కూల్డ్రింకులతో మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో రక్తం పరిమాణం తగ్గుతుంది. మరోవైపు రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువవుతాయి. ఇది మరింత హాని చేస్తుంది. * బీరు, మద్యం మూలంగా మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇది ఒంట్లో నీరు తగ్గిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎండకాలంలో మద్యానికి దూరంగా ఉండటమే మేలు. * ఎండకాలంలో జీర్ణాశయానికి రక్తసరఫరా తగ్గే అవకాశముంటుంది. అందువల్ల తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.
|