* శుభ్రత ముఖ్యం: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు మూలం అపరిశుభ్రత. ఇంటా బయటా సరైన శుభ్రత పాటిస్తే వీటి బారినపడకుండా చూసుకోవచ్చు. మందులు వాడాల్సిన అవసరమే ఉండదు. నిరోధకత వచ్చే అవకాశమే లేదు. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవటం ద్వారా చాలావరకు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుకోవచ్చు. |
* సొంతంగా వాడకూడదు: మనదగ్గర చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, సొంతంగానే యాంటీబయోటిక్ మందులు కొనుక్కొని వేసుకుంటుంటారు. ఇది ఎంతమాత్రమూ తగదు. |
* బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకే: బ్యాక్టీరియా ఏక కణజీవులు. ఇవి మన శరీరం లోపల, బయట.. అంతటా ఉంటాయి. నిజానికి చాలారకాల బ్యాక్టీరియాలు మనకేమీ హాని చేయవు. పైగా ఎంతో మేలు చేస్తాయి. కొన్ని మాత్రం గొంతునొప్పి, చెవి ఇన్ఫెక్షన్ల వంటి జబ్బులను తెచ్చిపెడతాయి. వైరస్లు బ్యాక్టీరియా కన్నా చిన్నవి. ఇవి శరీరంలో తప్ప బయట వృద్ధి చెందవు. కణాల్లోకి చొచ్చుకెళ్లి, వేగంగా వృద్ధి చెందుతూ జబ్బులను తెచ్చిపెడతాయి. సాధారణ జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి ఇలాంటివే. వీటికి యాంటీబయోటిక్స్ పనిచేయవు. గొంతునొప్పి, టాన్సిల్ వాపు, చీము వంటివి ఉంటేనే ఇవి అవసరమవుతాయని గుర్తించాలి. |
* అరకొరగా వద్దు: యాంటీబయోటిక్ మందులను పూర్తి మోతాదులో, పూర్తి కాలం వాడుకోవాలి. మధ్యలో మానెయ్యొద్దు. చాలామంది రెండు మూడు రోజులు మందులు వాడి, లక్షణాలు తగ్గగానే జబ్బు నయమైందనుకొని ఆపేస్తుంటారు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ తిరగబెడుతుంది. ఈసారి మరింత తీవ్రంగానూ దాడిచేస్తుంది. |
* డాక్టర్ చెప్పినట్టుగానే: సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవటం ముఖ్యం. యాంటీబయోటిక్స్లో కొన్ని కొంత సమయం వరకే (టైమ్ డిపెండెంట్) పనిచేస్తాయి. మందు ఒంట్లోకి ప్రవేశించాక కొంత సమయానికి దాని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. అప్పుడు మరో మోతాదు ఇవ్వగానే తిరిగి సమర్థంగా పనిచేయటం ఆరంభిస్తుంది. అందుకే డాక్టర్లు కొన్నింటిని పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఇలా ఒకో మాత్ర వేసుకోమని చెబుతుంటారు. దీన్ని కచ్చితంగా పాటించాలి. మరికొన్ని మందులను మోతాదుల వారీగా (డోస్ డిపెండెంట్) ఇస్తుంటారు. వీటిని రోజుకు ఒకసారే పెద్ద మోతాదులో ఇస్తారు (ఉదా: అమికసిన్, అజిత్రోమైసిన్). ఇవి చాలాసేపు అదే స్థాయిలో పనిచేస్తాయి. కానీ మనలో చాలామంది ఒక మాత్రతో ఏమవుతుంది? కావాలని డాక్టర్ తక్కువగా రాశాడేమోనని మూడు నాలుగు వేసుకుంటుంటారు. ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. |
* మిగిలిపోయినవి వాడొద్దు: ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చినపుడు డాక్టర్ ఏవైనా యాంటీబయోటిక్స్ మందులు రాసిచ్చారనుకోండి. ఇంకెవరికైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లటం ఎందుకు దండగ అనుకుంటూ అవే మందులు వేసేస్తుంటారు. ఇది తప్పు. డాక్టర్లు మన వయసు, బరువును బట్టి మందుల మోతాదును నిర్ణయిస్తారు. ఆయా సమస్యలను బట్టి యాంటీబయోటిక్స్ ఎంచుకుంటారు. అందువల్ల అవే మందులు అందరికీ పనిచేస్తాయని, ఒకే మోతాదు అందరికీ సరిపోతుందని అనుకోవటం తగదు. మిగిలిపోయిన మందులను పారెయ్యటం ఉత్తమం. |
* సమతులాహారం, వ్యాయామం: ఇవి రోగనిరోధకశక్తిని బలోపేతం చేసి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. ఫలితంగా యాంటీబయోటిక్స్ అవసరమే ఉండదు. |
* టీకాలు: అవసరమైన టీకాలన్నీ తీసుకోవటం ద్వారా యాంటీబయోటిక్స్ వేసుకోవాల్సిన పరిస్థితిని నివారించుకోవచ్చు. |
* కల్చర్ పరీక్ష తర్వాతే: బ్యాక్టీరియా ఉన్నదీ లేనిదీ.. ఏ రకానికి చెందినది అనేవి కల్చర్ పరీక్ష చేస్తేనే తెలుస్తాయి. ఆ తర్వాతే తగు యాంటీబయోటిక్స్ వాడుకోవాలి. సాధారణంగా పరీక్ష ఫలితాలు రావటానికి రెండు మూడు రోజులు పడుతుంది. ఆలోపు పరిస్థితిని బట్టి, అనుభవాన్ని ఉపయోగించి డాక్టర్లు యాంటీబయోటిక్ మందులను సూచిస్తారు. ఫలితాలు వచ్చాక అదే మందును కొనసాగించొచ్చు. అవసరమైతే మందును, మోతాదులను మార్చొచ్చు. ఒకవేళ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేకపోతే లక్షణాలు తగ్గటానికి ఇతరత్రా పద్ధతులేంటో డాక్టర్ను అడిగి తెలుసుకోవాలి. అంతేతప్ప యాంటీబయోటిక్ మందులు రాయాలని పట్టుబట్టొద్దు. |