ఏ కాలంలోనైనా రావొచ్చు గానీ..
ఒక్క చలికాలంలోనే కాదు.. స్వైన్‌ఫ్లూ ఏ కాలంలోనైనా రావొచ్చు. అయితే చల్లటి వాతావరణంలో.. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌లోపు ఉన్నప్పుడు ఫ్లూ వైరస్ ఎక్కువకాలం బతికి ఉంటుంది. అలాగే మంచు కురిసినపుడు వైరస్ అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటుంది. అందుకే చలికాలంలో వైరస్ మరింత ఉద్ధృతంగా విహరిస్తుంటుంది. ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో చలి మరీ ఎక్కువగా ఉండటం, దీనికి తోడు హఠాత్తుగా వర్షాలు కురిసి వాతావరణం మరింత చల్లబడటం వైరస్ విజృంభించటానికి అవకాశం కల్పిస్తోంది.

|
మామూలు జలుబు లక్షణాలే!
మామూలు ఫ్లూ జ్వరంలో కనిపించే దగ్గు, తుమ్ములు, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, ముక్కు కారటం, ముక్కు బిగుసుకోవటం, నీరసం వంటి లక్షణాలే స్వైన్‌ఫ్లూలోనూ ఉంటాయి. అందుకే చాలామంది దీన్ని తేలికగా తీసుకుంటారు. నిజానికి ఆరోగ్యవంతులను ఇది పెద్దగా ఏమీ చేయదు కూడా. అయితే లక్షణాలు తీవ్రం అవుతున్నా కూడా చికిత్స తీసుకోకపోతే మాత్రం న్యుమోనియాగా మారి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. స్వైన్‌ఫ్లూ మరణాలకు చాలావరకు ఇదే కారణం. దీంతో మరణిస్తున్న చాలామందిలో మధుమేహం, గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు గలవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలోనూ నిర్లక్ష్యం తగదు. ఎందుకంటే వీరికి స్వైన్‌ఫ్లూ తీవ్రమైతే మరణించే అవకాశం ఎక్కువవుతుంది. అందువల్ల మామూలు జలుబే కదా, అదే తగ్గిపోతుందని అనుకోవటానికి వీల్లేదు. జలుబు లక్షణాలతో పాటు జ్వరం, ఒళ్లునొప్పుల వంటివి తగ్గకుండా పెరుగుతోంటే తాత్సారం చేయరాదు.
|
స్రావాల నమూనాతో పరీక్ష
స్వైన్‌ఫ్లూ కారక వైరస్ రక్తంలో ఉండదు. ముక్కు, శ్వాసనాళాల వంటి శ్వాసకోశ అవయవాల్లోనే ఉంటుంది. అందువల్ల స్వైన్‌ఫ్లూను అనుమానిస్తే దూదిపుల్లతో ముక్కులోంచి లేదా గొంతు వెనకాల భాగం నుంచి స్రావాలను తీసి పరీక్షిస్తారు. దీంతో వైరస్ ఉన్నదీ లేనిదీ నిర్ధరణ అవుతుంది. ఈ పరీక్షను నిర్దేశించిన ప్రయోగశాలల్లోనే చేస్తారు. ఎక్కడపడితే అక్కడ చేయరు. వైరస్ యాంటీబోడీల ఆధారంగా రక్త పరీక్షతోనూ స్వైన్‌ఫ్లూను నిర్ధరించొచ్చు. అయితే ఫ్లూ ఆరంభమైన నాలుగు వారాల తర్వాత గానీ వైరస్ యాంటీబోడీలు రక్తంలో కనబడవు. ఒకవైళ వైరస్ సోకితే అప్పటికే జబ్బు ముదిరిపోయి ఉంటుంది. కాబట్టి రక్తపరీక్ష కన్నా దూదిపుల్ల పరీక్షే ఉత్తమమైన పద్ధతని గుర్తించాలి.
|
ఉన్నది టీకా రక్షణ
స్వైన్‌ఫ్లూ బారినపడకుండా కాపాడుకోవటానికి ప్రస్తుతం టీకా కూడా అందుబాటులో ఉంది. దీన్ని ఫ్లూ జ్వరాలు విజృంభించటానికి ముందే.. అంటే ఏప్రిల్‌లో తీసుకుంటే ఏడాదంతా రక్షణగా నిలుస్తుంది. అందరికీ కుదరకపోయినా కొందరికి మాత్రం ఈ టీకా తప్పనిసరి.
* ఆరేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ఊబకాయులు, మధుమేహంతో బాధపడేవారు, క్యాన్సర్ మందులు వేసుకునేవారు, రోగులకు చికిత్స, సేవలు అందించే వైద్య సిబ్బంది.. వీరందరూ టీకా తీసుకోవటం మంచిది.
* గర్భిణులకు మొదటి 3 నెలల్లో టీకా ఇవ్వకూడదు. 4-6 నెలల మధ్య ఇస్తే పుట్టబోయే పిల్లలకూ రక్షణగా నిలుస్తుంది. సాధారణంగా ఫ్లూ టీకాను 6 నెలలు పైబడిన పిల్లలకే ఇస్తారు. అదే గర్భిణులు తీసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత తొలి ఆరునెలల కాలంలోనూ టీకా రక్షణ లభిస్తుంది.
|
గర్భిణులు మరింత జాగ్రత్తగా..
కడుపులో పిండం పెరుగుతున్నకొద్దీ ఊపిరితిత్తులు పైకి నొక్కుకుపోతుంటాయి. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. పైగా గర్భిణుల్లో రోగనిరోధకశక్తి తక్కువ. అందువల్ల స్వైన్‌ఫ్లూ బారిన పడటమే కాదు, దాని మూలంగా తలెత్తే దుష్ప్రభావాల ముప్పూ ఎక్కువగానే ఉంటుంది. కొందరిలో న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, శ్వాస సమస్యలు, ఒంట్లో నీరు తగ్గిపోవటం, ఇన్ఫెక్షన్ శరీరమంతా విస్తరించటం.. సమస్య మరీ తీవ్రమైతే స్పృహ కోల్పోవటం వంటివీ తలెత్తే అవకాశముంది. కాబట్టి గర్భిణులు స్వైన్‌ఫ్లూ బారినపడకుండా చూసుకోవటం.. ఒకవేళ ఫ్లూ లక్షణాలు కనబడితే సత్వరం చికిత్స తీసుకోవటం అత్యవసరం.
|
నివారణే ఉత్తమం
* తరచుగా చేతులు కడుక్కోవాలి. * ఫ్లూ విజృంభించిన సమయంలో బయటకు వెళ్లినపుడు మాస్క్ ధరించాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. * ఫ్లూ లక్షణాలు గలవారితో చేతులు కలపటం, కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివి చేయరాదు.
ఫ్లూ వచ్చినపుడు కూడా.. ఫ్లూ లక్షణాలు మొదలై 48 గంటల తర్వాత కూడా తగ్గకపోతే శ్వాసలో వైరస్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి ద్వారా ఇతరులకు తేలికగా వ్యాపించే అవకాశముంది. కాబట్టి ఫ్లూ వస్తే ఇంటికే పరిమితం కావాలి. ఇంట్లో కూడా ప్రత్యేకమైన గదిలోనే ఉండేలా చూసుకోవాలి. దగ్గినపుడు, తుమ్మినపుడు నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. ఇంట్లో అందరూ తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఫ్లూ బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లేవారు, సపర్యలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఫ్లూ లక్షణాలు కనబడినా తాత్సారం చేయకుండా చికిత్స తీసుకోవాలి. ఆసుపత్రుల్లో కూడా స్వైన్‌ఫ్లూ బాధితులను ప్రత్యేకమైన గదిలో ఉంచే చికిత్స చేయాలి. వీరి చికిత్స కోసం వాడే పరికరాలను ఇతరులకు ఉపయోగించకూడదు.
|
పందుల నుంచి మొదలు
ఫ్లూ వైరస్లలో ఏ, బీ, సీ అని 3 రకాలున్నాయి. వీటిల్లో ఏ రకం చాలా తీవ్రమైంది, ప్రమాదకరమైంది. ఇది మనుషుల్లోనే కాకుండా పందులు, పక్షుల వంటి వాటిల్లోనూ ఉంటుంది. స్వైన్‌ఫ్లూ వైరస్ ఈ కోవకు చెందిందే. మనుషుల్లో కనిపించే వైరస్‌తో పాటు పక్షుల్లో కనిపించే రకాలు కూడా పందుల్లో ఉంటాయి. సాధారణంగా ఏటా ఈ వైరస్లలో చిన్న చిన్న జన్యుమార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఈ మార్పులు చాలా తీవ్రస్థాయిలో జరగటం వల్ల మహమ్మారి వైరస్లు పుట్టుకొస్తాయి (యాంటీజెనిక్ షిఫ్ట్). ఇలా పురుడుపోసుకున్నదే స్వైన్‌ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్. స్వైన్ అంటే పంది అని అర్థం. హెచ్1ఎన్1 వైరస్ ముందుగా పందుల్లో వచ్చింది కాబట్టి దీనికి స్వైన్‌ఫ్లూ అనే పేరు వచ్చింది. ఇది పందుల నుంచి మనుషులకు మాత్రమే కాదు.. మనుషుల నుంచి మనుషులకూ వ్యాపిస్తుంది.
|
గాలి ఆధారంగా..
హెచ్1ఎన్1 వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నవారు దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ బయటకు వచ్చి గాలిలో కలుస్తుంది. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఇలాంటి గాలిని పీల్చితే వారికి కూడా వైరస్ సోకుతుంది. అలాగే దగ్గు, తుమ్ముల ద్వారా వెలువడిన తుంపర్లు పడిన చోట కూడా వైరస్ అంటుకుని ఉంటుంది. అక్కడ ఎవరైనా ముట్టుకొని.. అదే చేత్తో నోరు, ముక్కు, కళ్ల వంటివి రుద్దుకున్నా కూడా వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. నిజానికిది ఆరోగ్యవంతులను పెద్దగా ఏమీ చేయదు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి తేలికగా సోకుతుంది, త్వరగా తీవ్రంగానూ పరిణమిస్తుంది.

|
తీవ్రతను బట్టి చికిత్స
జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు- ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేని సాధారణ ఆరోగ్యవంతులు ఇంట్లోనే ఉండి తేలికపాటి చికిత్స తీసుకోవచ్చు. ప్యారాసిటమాల్, యాంటీహిస్టమిన్.. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయోటిక్ మందులతోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అదే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు గలవారు, పిల్లలు, వృద్ధులైతే వెంటనే డాక్టర్‌ను సంప్రతించి తగు చికిత్స తీసుకోవాలి. వీరికి అవసరాన్ని బట్టి ఒసాల్టమివిర్ మందును ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఐదు రోజుల పాటు ఇస్తే స్వైన్‌ఫ్లూ తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. దాన్నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. అయితే గర్భిణులకు తొలి మూడు నెలల్లో ఒసాల్టమివిర్ మందును ఇవ్వకూడదు. వీరికి రెలెంజా అనే ఇన్హేలర్ మందు బాగా ఉపయోగపడుతుంది. ఇక జ్వరం వంటి లక్షణాలతో పాటు ఛాతీలో బరువుగా ఉండటం, రక్తపోటు పడిపోవటం, శరీరం రంగు మారటం, దగ్గినపుడు రక్తం పడటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం వంటివి కనబడితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిందే. తీవ్రంగా నీరసించిన పిల్లలనూ ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది.
|
ఆందోళన వదిలి.. అవగాహనతో మెలగాలి
‘‘స్వైన్‌ఫ్లూ మరణాలకు ప్రధాన కారణం లక్షణాలను తొలిదశలోనే గుర్తించలేకపోవటం. దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు సాధారణ మందులకు తగ్గకుండా 48 గంటల తర్వాత కూడా కొనసాగుతుంటే పరీక్షలేవీ చేయకుండానే వెంటనే ఒసాల్టమివిర్ మందును ఆరంభించటం తప్పనిసరి. ఇది కణజాలానికి వైరస్ అతుక్కుపోకుండా చూస్తుంది. సాధారణంగా వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన 48 గంటల తర్వాత కణజాలానికి అతుక్కుపోతుంది. ఆ తర్వాత మందు ఇచ్చినా ప్రయోజనం ఉండదని గుర్తించాలి. అందువల్ల వీలైనంత త్వరగా మందు ఆరంభిస్తే మరణాలను పూర్తిగా నివారించుకోవచ్చు. అయితే మందులను అనవసరంగా వాడకపోవటం కూడా ముఖ్యమే. అవసరం లేకపోయినా వాడితే వైరస్ మందులను తట్టుకునే శక్తిని సంతరించుకుంటుంది. అప్పుడు మందు ఇచ్చినా ఫలితం ఉండదు. అందువల్ల ఎవరికైనా స్వైన్‌ఫ్లూ వస్తే డాక్టర్ సూచన లేకుండా ఇంటిల్లిపాదీ ఫ్లూ మందులు వేసుకోవటం తగదు. ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత మీద అవగాహన లేకపోవటం, సామాజిక బాధ్యత లేకపోవటం కూడా కారణమే. ఫ్లూ లక్షణాలు కనబడుతున్నప్పుడు బయటకు వెళ్లటం.. ముక్కుకు, నోటికి రుమాలు చుట్టుకోకపోవటం వంటివన్నీ వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. ఆసుపత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ బాధితులను విడిగా ఉంచి చికిత్స చేయాలి. ప్రభుత్వ పరంగానూ స్వైన్‌ఫ్లూ మరణాలను ఎప్పటికప్పుడు సమీక్షించే ఏర్పాటు ఉండటం మంచిది.’’
- డా।। కె. శుభాకర్ కామినేని వైద్య విజ్ఞానసంస్థ, హైదరాబాద్
|