close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఛాన్సులు రాక... ఐస్‌క్రీములమ్మాను!

‘నటుడిగా సత్యరాజ్‌- ఓ చక్కటి కాన్వాస్‌లాంటివారు. విభిన్నమైన పాత్రల్ని పండించడమే కాదు... అప్పటికప్పుడు ముప్ఫై ఏళ్ల కొంటెకుర్రాడిగానూ, ఎనభైఏళ్ల ఒంటరి ముసలివాడిగానూ మారిపోగలరు! - ‘కట్టప్ప’తో పనిచేసిన దర్శకులందరూ ముక్తకంఠంతో అనే మాట ఇది! ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో ఆ మాటల్ని మరోసారి నిజం చేశారు సత్యరాజ్‌. రెండుమూడు నిమిషాల నిడివి ఉన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించిన సత్యరాజ్‌ తమిళంలో టాప్‌హీరోల్లో ఒకరిగా ఎదిగి నూటపాతిక సినిమాలు చేశారు. తర్వాత గేర్‌ మార్చి కట్టప్పయ్యారు! ఆ ప్రస్థానాన్ని ఇలా వివరిస్తున్నారు...

‘ప్రియమైన అమ్మకి... నమస్కారం. నేను వెళ్లిపోతున్నాను. అనుకున్నది సాధించాక కానీ తిరిగి రాను. నా బాగోగులు శివ అన్నయ్య చూసుకుంటానన్నాడు కాబట్టి నువ్వు బెంగపడొద్దు. నీతో చెప్పకుండా వెళుతున్నందుకు క్షమిస్తావనే ఆశతో నీ... రంగరాజ్‌!’ - ఆ రోజు ఆదివారం. ఒకటికి రెండుసార్లు నేను రాసిన ఉత్తరం చదువుకుని, బ్యాగు సర్దుకుని ఇంటి నుంచి బయటకొచ్చేశాను. ఇంటి ఎదురుగానే ఉన్న పోస్ట్‌ బాక్స్‌లో ఆ ఉత్తరం వేసి చెన్నై వెళ్లే బస్సెక్కాను. నేనక్కడ దిగగానే మా పెదనాన్న కొడుకు శివన్నయ్య వచ్చాడు. నాకో పాత మోపెడ్‌, కొంత డబ్బూ ఇచ్చీ... ‘సినిమాల కోసం ప్రతిరోజూ తిరుగుతూనే ఉండు. డబ్బయిపోతే నేను మళ్లీ ఇస్తా!’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ డబ్బుతో ఓ సింగిల్‌ రూమ్‌ అద్దెకు తీసుకుని రోజూ చెన్నైలోని స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించాను. 40 ఏళ్లకిందట నేను వేసిన ఆ తొలి అడుగే... ఇవాళ నన్ను మీముందు నిలిపింది.

జమీందారు ఇంటి బిడ్డని...
మాది కోయంబత్తూరు. అమ్మ నాదాంబ వాళ్లది జమీందారీ కుటుంబం. మా నాన్న సుబ్బయ్య డాక్టరు. ఇంట్లో నా తర్వాత ముగ్గురు చెల్లెళ్లు. కానీ ఎందుకో మా చివరి చెల్లి పుట్టాక అమ్మా నాన్నా విడిపోయారు. నేను అమ్మతోపాటే ఉండిపోయాను. అమ్మతోపాటూ మా పిన్నీ, బాబాయే నన్ను పెంచి పెద్ద చేశారు. నాకేమో ఆరో తరగతి నుంచీ సినిమా పిచ్చి పట్టుకుంది. నాటి తమిళ సూపర్‌స్టార్‌ ఎంజీఆర్‌కి అభిమానిని. ఆయన సినిమా డైలాగులు ఎంత పెద్దవైనా సరే... కంఠతా చెప్పేసేవాణ్ణి. అయినా పదో తరగతి, పీయూసీల్లో మంచి మార్కులు సాధించి బీఎస్సీ చదివాను. డిగ్రీ ముగించేనాటికి మా జమీందారీ మొత్తం పోయింది. వందల ఎకరాలని అమ్మేశారు. ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి అప్పటికి లేకపోయినా... భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందనే భరోసా కనిపించలేదు. అందువల్ల ఉద్యోగ వేటలో పడ్డాను. 1975లో బీఎస్సీ మంచి చదువే అయినా నా స్పెషలైజేషన్‌ బాటనీ కావడం, నాకు ఇంగ్లిషు మాట్లాడటం రాకపోవడంతో ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడే మా పెదనాన్న కొడుకు శివన్న నాలో మరో కోణాన్ని చూశాడు. ఆయన అప్పట్లో సినిమా ఫైనాన్షియర్‌గా ఉండేవాడు. నేను సినిమా డైలాగుల్ని అనర్గళంగా చెప్పగలగడం, అప్పటి నటులందరినీ ఇమిటేట్‌ చేయడం చూసి నన్ను సినిమాల్లో ప్రయత్నించమన్నాడు. ‘అమ్మ ఒప్పుకోదన్నా, నువ్వే వచ్చి మాట్లాడు!’ అన్నాను. ఆయన వచ్చి మాట్లాడితే నేను భయపడ్డట్టే జరిగింది. ఒక్క అమ్మే కాదు... బంధువులందరూ మాపైన విరుచుకుపడ్డారు. ‘మనమేంటీ... మన వంశగౌరవమేంటీ... సినిమాల్లో నటించడమేంటీ!’ అంటూ తిట్టేశారు. నేను ఎంత బతిమాలి చెప్పినా అమ్మ ఒప్పుకోలేదు. అందుకే అలా లెటర్‌ రాసి వచ్చేశాను.

రెండేళ్ల తర్వాత కానీ...
సినిమా కోసం ప్రయత్నిస్తూ మా వూరి వాడైన నటుడు శివకుమార్‌ని (హీరోలు సూర్య, కార్తీవాళ్ల నాన్న) కలిశాను. ఆయన నన్నో రంగస్థల నాటక సంస్థలో చేర్చాడు. వాళ్లు నటన నేర్పించడంతోపాటూ ప్రతి ప్రదర్శన తర్వాతా పది రూపాయలిచ్చేవారు. అలా ఓ పక్షం రోజుల్లో ముప్ఫై రూపాయలు సంపాదించాను. నా తొలి సంపాదన అది! రంగస్థలంలోనే ఆరునెలలు గడిచాయి. చెన్నైలో నేనుంటున్న గది చాలా చిన్నది. నేను ఆరడుగులుంటాను కాబట్టి... కాళ్లు ముడుచుకునే పడుకోవాలి. ఓసారి అక్కడికి మా పెద్ద చెల్లీ, ఆమె భర్తా వచ్చి నేనలా పడుకుని ఉండటం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ‘అక్కడ లంకంత ఇల్లుండగా నీకు ఇదేం ఖర్మరా. మాతో వచ్చెయ్‌!’ అన్నారు.
వాళ్లకేదో సర్దిచెప్పి పంపేస్తే... వెంటనే మా అమ్మ పిన్నినీ బాబాయినీ పంపింది. ‘నీతో ఊర్లో వ్యాపారం పెట్టిస్తా... వచ్చెయ్‌’ అన్నారు వాళ్లిద్దరూ. ‘సినిమాల్లో స్థిరపడ్డాక కానీ ఇంట్లో అడుగుపెట్టను!’ అని భీష్మించుకున్నాను. వాళ్లతో అంత పట్టుదలగా చెప్పినా... ఇక్కడేమన్నా ఆశారేఖ కనిపిస్తోందా అంటే అదీ లేదు. అప్పట్లో దర్శకుడు భారతీరాజా తన రెండో సినిమా కోసం కొత్తవాళ్లని వెతుకుతున్నాడని ఆశగా వెళితే... మొదటి రౌండ్‌లోనే రిజెక్ట్‌ చేశారు. ఆరోజు అసలు నా మొహం నటనకి సెట్‌ కాదేమో అనే సందేహం వచ్చింది. అప్పట్లో ఓ పత్రిక తాము ప్రచురించే సీరియల్‌కు వేసే బొమ్మల కోసం మోడల్స్‌ కావాలని ప్రకటన ఇస్తే వెళ్లాను. నన్ను చూడగానే వెళ్లిపొమ్మన్నారు వాళ్లు. ‘కనీసం సీరియల్‌ బొమ్మగానూ మన ఫేస్‌ సెట్‌కాలేదేమిటీ!’ అనుకుని డీలాపడిపోయాను. అలాంటప్పుడే ఓ సినిమా ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. వాళ్లతో ఆర్నెల్లపాటు పనిచేశాక నా ఒడ్డూపొడవూ చూసి విలన్‌ పక్కన స్టంట్‌మ్యాన్‌గా చిన్న పాత్ర ఇచ్చారు! ఆ సినిమా టైటిల్స్‌లో ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా ‘ఎస్‌.ఎన్‌. రంగరాజ్‌ బీఎస్సీ’ అని నా పేరు వచ్చింది. అంతేకాదు, నటుల వరసల్లో చిట్టచివరిగా నా పేరు పెడతానన్నారు. అందుకోసం- మా పిన్నీవాళ్లబ్బాయి సత్య పేరుకి నా పేరులో చివరిఅర్ధభాగాన్ని తగిలించి సత్యరాజ్‌ అనిపెట్టుకున్నాను. అలా నా మొదటి చిత్రం టైటిల్‌ కార్డులో రెండు విభిన్నమైన పేర్లు ఉంటాయి. మొదటి సినిమా పూర్తయినా రిలీజు ఆలస్యమైంది. ఈలోపు కమల్‌హాసన్‌ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక్కడా విలన్‌కి అసిస్టెంట్‌నేకానీ... మొదటి సినిమాకంటే నా పాత్రకి నిడివి ఎక్కువ. ఈ సినిమానే మొదట రిలీజై పెద్ద హిట్టయ్యింది. నాకు ఐదు వందల రూపాయలిచ్చారు. మొదటిసారి బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌చేశాను. అమ్మకీ, చెల్లెళ్లకీ, పిన్నికీ చీరలు కొని... ఇంటికి వెళ్ళాను. ఎంతో గంభీరంగా ఉండే అమ్మ కంట్లో అప్పుడు చూశాను కన్నీటి తెరని!

వ్యాపారం మునిగిపోయింది...
కమల్‌ సినిమా హిట్టు తర్వాత... అలాంటి పాత్రలే రావడం మొదలుపెట్టాయి. అన్నీ పదినిమిషాల్లోపే ఉండేవి. అయితేనేం... స్థిరమైన ఆదాయం వస్తుండేది. మెల్లగా నాదైన డైలాగ్‌ డెలివరీ, మేనరిజం చూపించడం మొదలుపెట్టాను. అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంతలో నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. పిల్ల మేనరికమే! అప్పుడే పెళ్లెందుకని ఎంత మొత్తుకున్నా ఎవరూ విన్లేదు. నేను మహేశ్వరికి తాళికట్టకా తప్పలేదు. ఇద్దరం ఓ అద్దె ఇంట్లో కాపురానికి దిగాం. చిన్నాచితకా అవకాశాలొస్తున్నా... ఇల్లు గడవాలంటే సరిపోలేదు! దాంతో సినిమాలకి దూరమై తీరాల్సిందేనని నిర్ణయించుకున్నాను! ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ పెడితే మంచి లాభాలుంటాయని ఎవరో చెబితే... చెన్నైలోని మెయిన్‌ సెంటర్‌లో దాన్ని ఏర్పాటుచేశాను. అలా నేనూ, మా ఆవిడా కలిసి ఐస్‌క్రీములమ్మాం. రోజుకి మూడొందలొస్తాయని కలలుకంటే 70 రావడమే గగనమైంది. అప్పుగా తెచ్చుకున్న లక్షరూపాయలు అయిపోయాయి! అలాకాదని, పాత ఇనుప సామాన్ల వ్యాపారం మొదలుపెట్టాను. అప్పట్లో ఓ పెద్ద ఓడ ఒకటి చెడిపోయి చెన్నై తీరంలో కూరుకుపోతే... దాన్ని స్క్రాప్‌గా చేసి అమ్మేకాంట్రాక్టు సాధించాను! ఆ ఓడలాగే నా వ్యాపారం కూడా మునిగిపోయింది. మరో ముప్ఫైవేలు పోయాయి. ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా నిల్చున్న పరిస్థితుల్లో నాకు సినిమాలపైన మళ్లీ నమ్మకం కలిగించాడు మణివన్నన్‌ అనే మిత్రుడు. పీయూసీలో నా క్లాస్‌మేట్‌ వాడు. విభిన్నమైన థ్రిల్లర్‌ కథలతో తాను దర్శకుడై నన్ను వైవిధ్యమైన విలన్‌ని చేశాడు. మూడు సినిమాలతో నా దశ తిరిగిపోయింది. కష్టాలన్నీ గట్టెక్కాయి. రజినీ, కమల్‌లాంటివాళ్ల సినిమాల్లో నేనే ప్రధాన విలనైపోయాను. ఆ తర్వాత యాంటీ-హీరో సినిమాలొచ్చాయి. అవీ సక్సెస్‌ అయిన తర్వాత... భారతీరాజా నన్ను ‘కడలోర కవిదైగళ్‌’(తెలుగులో చిరంజీవి ఆరాధన) సినిమాకి హీరోగా తీసుకున్నాడు. అది సూపర్‌డూపర్‌ హిట్టయ్యింది.

తొలిసారి తెలుగులో...!
రెండుమూడేళ్లలోనే టాప్‌హీరోల జాబితాలో చేరిపోయాను. రజినీ, కమల్‌హాసన్‌, విజయ్‌కాంత్‌ తర్వాతి స్థానం నాదే అయ్యింది. హీరోగా దాదాపు వంద సినిమాలు చేశాను. హీరో వేషాలు తగ్గే కొద్దీ... క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారకతప్పలేదు. కానీ, అందులోనూ నా పాత్ర కాస్త పవర్‌ఫుల్‌గా ఉండాలని కోరుకున్నాను. అలాంటి కథతో తొలిసారి నా కోసం వచ్చాడు డైరెక్టర్‌ శివ. అలా టాలీవుడ్‌లో తొలి స్ట్రెయిట్‌ సినిమాగా వచ్చింది ‘శంఖం’. దానికి మంచి ప్రశంసలొచ్చాక... ‘మిర్చి’ వచ్చింది. ఆ తర్వాత ‘బాహుబలి’ సినిమా ఓ అదృష్టదేవతలా నా తలుపుతట్టింది. నన్ను దేశం మొత్తానికీ కొత్తగా పరిచయం చేసింది. ఆ తర్వాత చాలా అవకాశాలే వచ్చినా ఆచితూచి ఎంచుకుంటున్నాను. ‘బ్రహ్మోత్సవం’, ‘జెర్సీ’ అలాంటివే. ‘ప్రతిరోజూ పండగే’ కూడా ఆ వరసలోనిదే. దర్శకుడు మారుతి వచ్చి సాయిధరమ్‌ తేజ్‌కి తాతగా నటించాలని అడిగినప్పుడు మామూలు కథే అనుకుని వద్దన్నాను. కథ విన్నాక నటించే తీరాలని నిర్ణయించుకున్నాను. ఇందులో ముప్ఫై ఏళ్ల కుర్రాడిగానూ, యాభైల్లో ఉన్నవాడిగానూ, డెబ్భై ఏళ్లవాడిగానూ చేశాను. ఇందులో తెలుగు ప్రేక్షకులెన్నడూ చూడని ‘రెట్రో’ సత్యరాజ్‌ కొంటెతనాలూ చూడొచ్చు!

నేనో పెరియారిస్టుని!
పుస్తకాలే నా నేస్తాలు. ఖాళీ లేకుంటే కల్పించుకుని మరీ చదువుతాను. చిన్నప్పుడే ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి(పెరియార్‌) రచనల ప్రభావంతో నాస్తికుడిగా మారిపోయాను. తమిళనాడులో కులవివక్షకీ, మూఢభక్తికీ వ్యతిరేకంగా గళమెత్తేవాళ్లలో నేనూ ఒక్కణ్ణి. అలా చేయొద్దని ఎంతమంది రాజకీయనాయకులు బెదిరించినా భయపడ్డదిలేదు. ఇక నా కుటుంబం గురించి చెప్పాలంటే... ఇద్దరు పిల్లలు. పెద్దవాడు శిబి న్యూయార్క్‌లో యాక్టింగ్‌ కోర్సు చదివి తమిళంలో హీరోగా చేస్తున్నాడు. కూతురు దివ్య... నాకు అచ్చమైన వారసురాలు. నాలాగే నాస్తికురాలు. కమ్యూనిజంపట్ల ఇష్టం ఉంది తనకి. చెన్నైలోని ప్రముఖ న్యూట్రిషనిస్టుల్లో తనూ ఒకతి. పేద పిల్లల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ ఉంటోంది!


ఇంట్లోవాళ్లకీ చెప్పలేదు!

చారిత్రక, జానపద శైలి చిత్రాలు చేయాలన్న కోరిక నాకు పాతికేళ్లుగా ఉంది. చాలామంది అలాంటి కథలు చెప్పినా అవన్నీ పాత మూసలో ఉండేవి. కానీ రాజమౌళి కట్టప్ప పాత్రని రకరకాల షేడ్స్‌తో తీర్చిదిద్దడం నాకు నచ్చింది. దాని వెనక ఆయన శ్రమ అర్థమైంది. అందుకే ఆనందంగా ఒప్పుకున్నా. ఏ సినిమాకీ లేనంతగా సుమారు 635 రోజులు దానికోసం పనిచేశా! ఇక, మొదటి భాగం విడుదలై... ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న వైరల్‌ అయ్యాక!’ ఉన్నపళంగా నేను ఫేమసైపోయాను. ప్రపంచంలో ఏ విమానాశ్రయానికి వెళ్లినా సరే అదే ప్రశ్న వేసేవాళ్లు. మా బంధువులూ వదల్లేదు. అదో పెద్ద సీక్రెట్‌ కాకపోయినా... నేను మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. చివరికి మా ఇంట్లోవాళ్లకి కూడా. 35 ఏళ్ళ కిందట సినిమాల కోసం నా పేరుని సత్యరాజ్‌ అని నేను మార్చుకుంటే... మళ్లీ ఇన్నాళ్లకి నాకు ‘కట్టప్ప’ అనే కొత్త పేరుని పెట్టి ప్రపంచం మొత్తానికీ కొత్తగా పరిచయం చేసిన ఘనత బాహుబలిదీ... తెలుగు పరిశ్రమదీ!

22 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు