close

ఈ శివాలయం సముద్రంలో దాక్కుంటుంది..!

సాధారణంగా దేవాలయాలు కొండలపైనో, పర్వత ప్రాంతాల్లోనో, గుహల్లోనో, నదీతీరాల్లోనో దర్శనమిస్తుంటాయి. అయితే గుజరాత్‌లోని భావ్‌నగర్‌ సమీపంలోని నిష్కళంక్‌ మహాదేవ్‌ ఆలయం మాత్రం సముద్రం లోపలుంటుంది. నిత్యం ఉప్పొంగే అలలు అభిషేకించే ఆ గుడిలోని శివయ్య కేవలం మధ్యాహ్నం తరవాత కొన్ని గంటలు మాత్రమే దర్శనమిస్తాడు. మిగతా సమయమంతా సముద్రుడిలో ఐక్యమైపోతాడు. ఎందుకంటే...
గుజరాత్‌లోని భావ్‌నగర్‌కి 23 కిలోమీటర్ల దూరంలో, అరేబియా మహాసముద్ర తీరంలో ఉంటుంది కొలియాక్‌ గ్రామం. అక్కడ సముద్ర తీరంలోపల మూడు కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది నిష్కళంక్‌ మహాదేవ్‌ ఆలయం. ఆ ఆలయంలో మహాదేవుడిగా పూజలందుకునే శివయ్యని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకోవడం కుదరదు. ఎందుకంటే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ కోవెలను దాటి మూడు కిలోమీటర్ల ముందు వరకూ ఉధృతమైన అలలు వచ్చేస్తాయి. దాంతో ఆ గుడి సముద్రుడి ఒడిలో బందీ అయిపోతుంది. ఇక మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిదానంగా అలలు వెనక్కి వెళ్లిపోవడంతో గుడి బయటకొస్తుంది. అప్పట్నుంచి రాత్రి ఏడుగంటల వరకూ శివయ్య దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ దాగుడుమూతలు నిత్యకృత్యమైన ఆ ప్రదేశాన్ని సముద్రుడి గుప్పిట్లో శివుడు దాక్కున్నప్పుడు చూస్తే గుడి ఆనవాళ్లే కనిపించవు. ఆ దృశ్యాన్ని చూడాలని ఉదయం పదిగంటల నుంచే సముద్రతీరానికి జనం తాకిడి మొదలవుతుంది. ఆ ఆలయంలో ఐదు శివలింగాలూ, జెండాతో ఓ స్థూపమూ దర్శనమిస్తాయి. భక్తులు ఆ లింగాలకు పాలాభిషేకం చేసి పూలూ, పండ్లతో కొలుస్తారు. అమావాస్యా, పౌర్ణమి రోజుల్లోనూ, మహాశివరాత్రినాడూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కొలియాక్‌ గ్రామస్థులు.

స్థలపురాణం...
మహాభారత యుద్ధంలో కౌరవుల్ని జయించి వారిని సంహరించిన పాండవులు రక్తసంబంధీకుల్ని చంపిన పాపం మూటగట్టుకుంటారు. దాంతో పాండవులు ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుణ్ని ఆశ్రయిస్తారు. అప్పుడు ఒక నల్లని ఆవుకు నలుపు రంగు జెండాను కట్టి అది ఎంత దూరం వెళితే అంతదూరం దాని వెంట వెళ్లమని చెప్పి, ఎప్పుడైతే ఆవూ జెండా రెండూ తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుందని సెలవిస్తాడు కృష్ణుడు. ఆ సూచనల మేరకు పాండవులు రోజుల తరబడి ఆవు వెంటే నడిచివెళతారు. చివరికి కొలియాక్‌ గ్రామ సరిహద్దుల్లోని అరేబియా సముద్ర తీరానికి చేరగానే అవి తెల్లగా మారిపోతాయి. ఆ ప్రదేశంలో పాండవులు శివ నామం జపిస్తూ ఘోర తపస్సు చేస్తారు. దాంతో వారి భక్తికి మెచ్చిన శివుడు పాండవులు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు లింగంగా అవతరిస్తాడు. అమితానందంతో పాండవులు ఆ ఐదు లింగాలకూ పూజలు నిర్వహించి ఆలయాన్ని నిర్మిస్తారు. దాంతో పాండవుల కళంకాలన్నీ తొలగిపోవడంతో ఆ ప్రదేశం నిష్కళంక్‌ మహాదేవ్‌ ఆలయంగా ప్రస్ధిది చెందిందని పురాణ గాథ. కళంకాలను తొలగించే ఆలయంగా వినుతికెక్కిన ఈ గుడి వద్ద కుటుంబ సభ్యుల అస్థికల్ని సముద్రంలో కలిపితే వారి ఆత్మశాంతిస్తుందనే విశ్వాసం కూడా ఉందిక్కడ. అందుకోసం పెద్దఎత్తున జనాలు వస్తుంటారు. ఈ ఆలయానికి వెళ్లాలనుకునేవారు కాకినాడ పోర్ట్‌ నుంచి బయల్దేరి, విజయవాడ, సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే భావ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి భావ్‌నగర్‌కు చేరుకోవచ్చు. అక్కణ్నుంచి బస్సులూ, ఆటోలూ, ట్యాక్సీల ద్వారా కొలియాక్‌ వెళ్లొచ్చు. ప్లైట్‌లో వెళ్లేవారైతే అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో దిగి... అక్కణ్నుంచి అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లి... భావ్‌నగర్‌, మహువా ఎక్స్‌ప్రెస్‌లలో భావ్‌నగర్‌కు చేరుకుని రోడ్డుమార్గంలో వెళ్లి స్వామిని కనులారా వీక్షించొచ్చు.


గుడిలో గంట ఎందుకు కొడతారు?

సాధారణంగా అన్ని దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వేలాడుతూ కనిపిస్తాయి. భక్తులు ఆలయంలోకి అడుగుపెట్టగానే గంట మోగించి ఆ తరవాతే దేవుడి దర్శనానికి ఉపక్రమిస్తారు. అయితే గుడిలో ‘గంట ఎందుకు మోగిస్తాం’ అనే విషయం చాలామందికి తెలియదు. గంటను మోగించినప్పుడు అది విశ్వానికి భగవన్నామం అయిన ఓంకార నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. అలా వెలువడే శబ్దాన్ని మంగళకరమైన ధ్వనిగా పరిగణిస్తారు. ఆ ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తాయనీ, మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను ప్రసాదిస్తాయనీ పురాణాలు చెబుతున్నాయి. అలానే ప్రత్యేక మిశ్రమ లోహాలతో తయారు చేసిన గంటను మోగించినప్పుడు  దాదాపు ఏడు సెకన్ల పాటు మన మెదడులోనూ ఆ శబ్దం ప్రతిధ్వనిస్తుందట. ఆ శబ్దం సకల సుషుప్తావస్థలనూ పటాపంచలు చేసి భక్తుల దృష్టిని భగవంతుడి మీదకు మళ్లిస్తుందని ఓ విశ్వాసం. అంటే భక్తి పారవశ్యత, అంతరంగ శాంతి, ఏకాగ్రతలకు భంగం కలిగించే అమంగళకరమైన అసంబద్ధమైన శబ్దాలూ, వ్యాఖ్యానాలూ భక్తుల చెవులకూ తద్వారా మనసుకూ చేరకుండా ఈ నాదం సహాయపడుతుంది. స్కూళ్లలోనూ పీరియడ్‌కీ పీరియడ్‌కీ మధ్య గంట కొట్టడంలో ఆంతర్యం కూడా విద్యార్థులు అప్పటివరకూ ఉన్న స్థితి నుంచి బయటకొచ్చి ఆ తరవాత అంశాల మీద దృష్టిపెట్టడం కోసమే అంటారు పెద్దలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.