close

మెట్టలో మాగాణి

- నండూరి రామచంద్ర రావు

పొద్దున్నే ఫోన్‌ వచ్చింది అమెరికాలో ఉన్న రామరాజుకు- ఇండియాలో ఉన్న తల్లి పార్వతమ్మ నుంచి... ‘తనకు ఒంట్లో స్వస్థతగా లేదనీ ఇక బతుకు బండి గమ్యం చేరే సమయం దగ్గర పడిందనీ ఒకసారి వచ్చి పొమ్మనీ.’
అతి కష్టంమీద ఆఫీసులో సెలవు సంపాదించి, ఆదరా బాదరా ఏలూరుకు బయలుదేరాడు రామరాజు- భార్యా, నాలుగు ఏళ్ల వయసు ఉన్న కొడుకుతో సహా.
బాగా చిక్కిపోయి, నీరసంగా ఎదురు వచ్చింది తల్లి- ఇంటికి చేరుకోగానే. కొడుకునీ కోడల్నీ మనవడినీ చూడగానే సంతోషంతో ముఖం వెలిగినా, ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అని, ఇట్టే అర్థమవుతుంది చూసేవారికి.
ఆ సాయంత్రం డాక్టర్‌గారి దగ్గరకు వెళ్ళాడు రామరాజు. ‘లివర్‌ పూర్తిగా చెడిపోయిందనీ ఇక చేయగలిగింది పెద్దగా లేదనీ’ తేల్చి చెప్పారాయన.
‘అంతదాకా ఎందుకు వచ్చింది, ముందే ఎందుకు జాగ్రత్త పడలేదు...’ అని ఆరా తీస్తే, ‘ముదిరేదాకా తన వద్దకు రాలేదు’ అని జవాబు.
ఇక చేయగలిగిందీ చేయవలసిందీ ఒకటే. ఆమె చివరి రోజులు వీలైనంత సంతోషంగా, సౌఖ్యంగా గడిచిపోయేటట్లు చూడటం.
ఆ రాత్రి తల్లి దగ్గర కూర్చున్న రామరాజును అడిగిందామె ‘‘రామూ, ఒకసారి ప్రభావతిని చూడాలని ఉందిరా.’’
‘‘ప్రభావతి ఎవరు... ఎక్కడ ఉంటారు ఆమె?’’
‘‘ఆమె ఎవరో ఇప్పటిదాకా నాకూ తెలియదు. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు.’’
‘‘మరి...’’
‘‘తెలిస్తే నేనే వెళ్ళి కలిసి ఉండేదాన్ని కదా, నువ్వు ఏదన్నా ఆరా తీయగలవేమో అని ఆశ.’’
‘‘ఏ ఆధారం లేకుండా ఎక్కడని వెతకను అమ్మా?’’
‘‘ఓ చిన్న ఆధారం మాత్రం ఉంది.’’
‘‘ఏంటది?’’
‘‘మన గుర్నాథం మాస్టారిగారి అబ్బాయిని అడిగితే ఏమన్నా చెప్పవచ్చు.’’
‘‘గుర్నాథం గారు..?’’
‘‘ఆయన ఓ రెండు నెలల కిందటే కాలం చేశారు. వారి అబ్బాయి రామాన్ని
అడిగి చూడు.’’
‘‘ఇంతకీ అసలు ఆమె ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఆమెను చూడాలి, కలవాలి అన్న కోరిక మాత్రం గట్టిగా ఉంది. కారణం అంటూ ఏమన్నా ఉందా, చెప్తావా అమ్మా?’’
‘‘చంటివాడు పడుకుంటే, సుజాతను కూడా పిలువు... చెప్తాను.’’
‘‘ఇరవై, ఇరవై అయిదు ఏళ్లక్రితం నాటి సంగతిది. అప్పటి రోజులకీ పరిస్థితులకీ ఇప్పటికీ ఎంతో బేధం ఉంది... ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాలలో.
నేను పెద్దగా చదువుకున్నదాన్ని కాదు. అయిదో తరగతితో చదువు ఆగింది.
ఆ తరువాత కొద్ది సంవత్సరాలకే పెళ్ళి అయింది మీ నాన్నగారితో. పూర్తిగా మంచీ చెడూ ఏదీ తెలీని వయసు. అదీగాక మా ఇద్దరిమధ్యా వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే. అంటే, నాకన్నా మీ నాన్నగారు తొమ్మిది పదేళ్లు పెద్ద. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. కావలసినంత ఆస్తి ఉండేది.
నాకు నువ్వు పుట్టినాక, ఇంటిపనీ, నీ పనీ చూసుకోవటానికే సమయం సరిపోయేది కాదు. ఇవన్నీ అయినాక ఒంట్లో ఓపికా ఉండేది కాదు. ఏది ఏమైతేనేమి, మీ నాన్నగారికి దూరంగా ఉండేదాన్ని. ఆయనా చెడ్డవారేమీ కాదు. కానీ, వయస్సులో ఉన్నవారు. సంసారసుఖం రుచి తెలిసినవారు. ఎన్ని రోజులని ఆగగలరు... ఆయన మాత్రం! మెల్లిగా ధ్యాస మళ్ళించుకోవడం కోసం, నిద్రపట్టడం కోసం... తాగడం అలవాటు చేసుకున్నారు. పోనీలే అనుకున్నాను నేనూనూ. ఒక దుర్గుణం రెండోదానికి తేలిగ్గా చోటు ఇస్తుందిగా. ఆ రకం స్నేహితులు ఎవరో ఒకరు తారసపడతారు. మెల్లిగా పడుపు వృత్తిలో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళటం అలవాటు అయింది ఆయనకు. ముందర ముందర నాకు తెలియలేదు ఈ సంగతి- అలవాటు ముదిరినాక విన్నాను, మళ్ళా పోనీలే అనుకున్నాను.
చివరికి ప్రభావతి అనే ఆమెకు ఆస్తి చాలామటుకు రాసి ఇచ్చేశారు అని తెలిసింది. నేను కళ్లు తెరిచేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. అదీకాక ఆయన మాటకు ఎదురు చెప్పటం అన్నది ఎరుగను నేను. ఈనాటి రోజులూ కావు, ఇంత స్వాతంత్రమూ చదువూ తెలివీ ఆర్థికబలమూ ఆడవారికి లేని రోజులవి. ఆయన ఆరోగ్యమూ ఆస్తీ రెండూ కరిగి పోయాయి.
చివరికి ఆయన పోయేనాటికి ఈ ఇల్లు ఒక్కటీ మిగిలింది. ఆస్తి లేదు, జరుగుబాటుకు ఏ ఆధారమూ లేదు. ఏనాడూ వీధిలోకి వెళ్ళినదాన్ని కాదు నేను. ఎవరో దూరపు బంధువులూ, ఊరిలో ఆయనకు తెలిసినవారు కొందరూ వచ్చారు. కర్మకాండలు అవగానే ఎవరి దారిన వారు, ‘అయ్యో పాపం, ఇకముందు ఎట్లాగో’ అనుకుంటూనే వెళ్ళిపోయారు.
నా పరిస్థితి అయోమయంగా ఉండిపోయింది అని చెప్తే తక్కువ చేసి చెప్పినట్లే.
అదిగో, అటువంటి దుర్దశలో ఉండగా, ఒకరోజు పొద్దున్నే వచ్చారు గుర్నాథం మాస్టారు. ‘‘అమ్మా, మీకేమీ చింతవద్దు. మీవారు, కృష్ణంరాజుగారు, నాకు మంచి మిత్రులు. నోరు తెరచి అడగకుండానే ఒకప్పుడు నాకు ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది. నాకూ నా స్నేహితుడి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీ జరుగుబాటుకూ బాబు చదువుకూ వెతుక్కోనవసరంలేదు. నోరు తెరచి అడగవలసిన అవసరమూ రాదు. ప్రతి నెలా మొదటి తారీఖుకు ముందే మీకు అవసరమైన డబ్బు మీకు అందుతుంది’’ అని చెప్పి ఎక్కువసేపు ఆగకుండా వెళ్ళిపోయారు.
ఈనాటిదాకా- ఈనాడు ఆయన లేకపోయినా, ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయికీ నేను ఇబ్బంది పడలేదు, నోరు తెరచి అడగలేదు. నీ చదువుకు కానీ, నువ్వు అమెరికాకు వెళ్తాను అన్నప్పుడు కానీ. చిన్నప్పటినుంచీ మీ నాన్నగారు లేకపోయినా ఇబ్బంది లేకుండా ఇల్లు గడవడం అలవాటు అయిన నువ్వూ ఏనాడూ అడగలేదు- ‘డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది’ అని. అసలు ఆ ఆలోచనే కలగనియ్యలేదు నీకు.’’
‘‘అమ్మా, ఇంత పెద్ద విషయం చూచాయగా కూడా నాకు తెలియదు. నిజమే, ఏ అవసరం వచ్చినా, బీరువాలోంచి డబ్బు తీసి ఇస్తుంటే, పట్టించుకోలేదు కానీ, నువ్వు అన్నది నిజమే. ఆ బీరువా అక్షయ పాత్ర కాదనీ, డబ్బు ముందరపెడితేగానీ, దానిలోంచి తీయలేమనీ... ఏ రోజూ తట్టలేదు నాకు.
అది సరేగానీ, మరి ఇప్పుడు ఆ ప్రభావతిని కలవాలని ఎందుకు అనుకుంటున్నావు?
ఇన్నేళ్ల తర్వాత ఆమెను చూసి, నిందించాలి అన్న కోరిక పుట్టిందా నీకు?’’
‘‘ప్రభావతి కాదు, ప్రభావతిగారు అను. ఇంకా ఉంది, చెప్తా విను... వారి అంత్య సమయం దగ్గరపడ్డది అన్నాక, గుర్నాథం మాస్టారు వచ్చారు... ‘అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలి... ఇన్నేళ్ళుగా మీకు చెప్పనిది, లేకపోతే నాకు శాంతి ఉండదు’ అంటూ.
‘చెప్పండి’ అన్నాను.
‘అమ్మా కృష్ణంరాజుగారు పోయిన నాటినుంచీ ఈనాటిదాకా నేను మీకు ఇచ్చిన ప్రతి రూపాయీ ప్రభావతి మీకు ఇవ్వమని నాకు ఇచ్చిందే...’
‘ఏమంటున్నారు మీరు... నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయం?’ అన్నాను.
‘ఆమె నా దగ్గర మాట తీసుకున్నారు, మీకు చెప్పనని. చెప్తే మీరు ఏ కారణంతో అయినా నిరాకరిస్తే- ఎట్లా గడుస్తుంది ఇల్లు- అని నన్నే ప్రశ్నించారు ఆమె. నిజమే, కృష్ణంరాజుగారు నాకు మంచి స్నేహితుడే, కానీ వ్యక్తిగతంగా నాకు ఏ సహాయమూ చేయలేని పరిస్థితి. కనీసం, ఈ విధంగా మిత్రధర్మం నిర్వర్తించవచ్చు అని ఒప్పుకోవలసి వచ్చింది. మీరు నన్ను క్షమించాలి, మీ నుంచి ఇన్నేళ్ళు ఈ విషయం దాచినందుకు.’
‘ఇన్ని సంవత్సరాలుగా ఇంత సహాయం చేసిన మిమ్మల్ని నేను మాట అనటం సబబు కాదు- దాచి ఉంచటం నాకు బాధ కలిగించినా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావతిగారు ఎక్కడ ఉన్నారు, అది అయినా చెప్పండి. ఒక్కసారి కలసి వస్తాను.’
‘వారిని అడిగి చెప్పాలి, నాకూ పూర్తిగా తెలియదు. ప్రతి నెలా బ్యాంకులో డబ్బు పడుతుంటే మీకు తెచ్చి ఇస్తున్నాను. అంతే! వారే రెండు మూడు నెలలకు ఒకసారి ఫోన్‌ చేసి, వాకబు చేస్తుంటారు, ‘ఎలా ఉన్నారు, ఏమన్నా డబ్బు అవసరం పడుతుందా?’ అంటూ. అంతే. వారి నంబర్‌ వెతికి ఫోన్‌ చేసి కనుక్కుని చెప్తాను’ అంటూ వెళ్లిపోయారు. ఆయన ఏమాటా చెప్పకముందే, మరణించారు.’’
అప్పటికే చాలా పొద్దుపోయింది, అదీగాక ప్రయాణపు బడలిక. తల్లి ఆరోగ్యం గురించీ తరువాత డాక్టర్‌ చెప్పిన విషయమూ ఇప్పుడు ఈ మాట...
‘‘రేపు పొద్దున మాట్లాడుకుందాం అమ్మా’’ అంటూ పడుకోవటానికి లేచాడు రామరాజు.
మరునాడు గుర్నాథం మాస్టారి అబ్బాయి దగ్గరకు వెళ్ళాడు రామరాజు.
‘‘నాన్నగారు నాకు ఏమీ చెప్పలేదు, కాకపోతే ఒక మార్గం ఉంది రండి’’ అంటూ బ్యాంకు వైపు దారి తీశాడు అతను.
అక్కడ బ్యాంకు మేనేజర్‌గారి దగ్గరకు వెళ్ళి, తనదీ మాస్టారిదీ జాయింటు అకౌంట్‌ వివరాలు ఇచ్చి, ‘‘ప్రతి నెలా డబ్బులు ఎక్కడ నుంచి వచ్చి జమ అవుతున్నాయి అన్నది చెప్పగలరా?’’ అంటూ అడిగాడు.
ఆయన ఓ పది నిమిషాలు వెతికి వెతికి ‘‘తమ భీమవరం బ్రాంచి నుంచి ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నాయి’’ అని చెప్పారు.
‘‘సర్‌, అది మీ బ్యాంకు బ్రాంచే కాబట్టి, కొద్దిగా మీ పలుకుబడి ఉపయోగించి,
అక్కడ అకౌంట్‌ ఎవరిదో కొంచెం కనుక్కుని చెప్పండి, చాలా అవసరం’’ అంటూ ప్రాధేయపడ్డారు ఇద్దరూ.

ఆయన ఆ బ్రాంచ్‌ వారికి ఫోన్‌ చేసి ‘రాజుగారి అప్పడాలు’ అన్న అకౌంట్‌ వారి నుంచి డబ్బులు వస్తున్నాయనీ అంతకుమించి ఇక తానేమీ వివరాలు ఇవ్వలేననీ తేల్చి చెప్పేశారు.
‘‘నేను భీమవరం వెళ్ళి మిగతా విషయం తెలుసుకుంటాను. మీ సహాయానికి థాంక్స్‌’’ అంటూ బయలుదేరాడు రామరాజు.
అక్కడి నుంచే భార్యకు ఫోన్‌ చేసి ‘‘నేను భీమవరం వెళ్లి రాత్రికల్లా వస్తాను, అమ్మను జాగ్రత్తగా చూసుకో’’ అని చెప్పి టాక్సీలో బయలుదేరాడు.
నాలుగైదు దుకాణాలలో అడిగాక, ‘రాజుగారి అప్పడాలు’ తయారుచేసే చిరునామా దొరికింది. అక్కడకు వెళ్ళి, ఆ సంస్థ యజమాని ప్రస్తుతం లేరని తెలిసి మేనేజర్‌ను కలిశాడు రామరాజు.
తిన్నగా విషయంలోకి వస్తూ ‘‘నేను అమెరికాలో ఉంటాను, ప్రస్తుతం ఏలూరు నుండి వస్తున్నాను. నా పేరు రామరాజు. ప్రభావతి గారిని ఒక్కసారి కలవాలి’’ అన్నాడు.
‘‘ప్రభావతిగారు కాశీకి వెళ్లారు. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. మీ పేరు రామరాజు, ఏలూరి నుంచి అన్నారు కదా,
మీ అమ్మగారి పేరు?’’
‘‘పార్వతమ్మగారు’’
‘‘ఒక్క నిమిషం. మీ పేరున ఒక సీల్డ్‌ కవర్‌ ఉంది, ఇస్తాను’’ అంటూ ఒక కవర్‌ తెచ్చి చేతిలో పెట్టాడు ఆయన.
దానిలో కొన్ని ఆస్తి తాలూకు దస్తావేజులూ ఒక ఉత్తరమూ ఉన్నాయి.
ఉత్తరం తెరిచాడు...
‘రామరాజూ, కొడుకులు లేరు నాకు. కొడుకు వయసున్న నువ్వు కొడుకుతో సమానమే. అందుకనే ‘రామరాజుగారూ’ అంటూ మొదలుపెట్టలేదు.
ఈ ఉత్తరం చూసేదాకా వచ్చావూ అంటే, నీకు గతం తెలిసి ఉంటుంది... అలాగే మీ నాన్నగారికీ నాకూ మధ్య ఉన్న సంబంధం గురించి కూడా.
నిజమే, ఒక పడుపు వృత్తిలో ఉన్న ఆడదానిగానే మీ నాన్నగారిని కలవటం జరిగింది. కానీ వారి మంచితనం నాకు ఎంతో నచ్చింది. నాలో తనకు ఏమి కనిపించిందో నాకు తెలియదు, కానీ చాలా గట్టి బంధమే ఏర్పడింది మామధ్య.
అప్పుడే గ్రహించాను- వారి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు. మీ అమ్మగారి గురించీ తెలుసుకున్నాను, నాన్నగారి మాటల ద్వారా. ఏ లోకజ్ఞానమూ లేని మీ అమ్మగారు- ‘నాన్నగారు లేనినాడు, ఆస్తిని కాపాడుకుంటూ ఎట్లా బతుకుతారు, నిన్ను ఎట్లా పెద్ద చేస్తారు’ అన్న ఆలోచన నాలో కలిగింది. ఎక్కడబడితే అక్కడ గద్దలూ రాబందులూ ఉన్న లోకంలో ‘ఒక చిన్న పక్షీ, ఆ పక్షి గుడ్డూ బతకలేవు’ అన్నది నాకు తెలిసిన సత్యం. అందుకే ఆస్తిలో చాలాభాగం నా పేరున రాయించుకున్నాను. ఎందరో చెవులు కొరుక్కున్నా, నాకు వినిపించేటట్లు దుర్భాషలాడినా సహించాను.
కారణం... మీ నాన్నగారు చూపించిన ప్రేమా ఆయన మంచితనమూ మీ భవిత గురించిన చింతా. ఒక్కమాట... మీ నాన్నగారితో పరిచయమయ్యాక పాత వృత్తి జోలికి పోలేదు నేను. ఆయన ఆస్తిని కాపాడుకుంటూ పెంచుకుంటూ మెల్లిగా భీమవరం వచ్చి,
నలుగురు అభాగ్య యువతులను చేరదీసి ఈ సంస్థను మొదలుపెట్టాను. నేడు ఒక యాభై మందికి నీడ ఇస్తూ, తనంతట తాను నిలబడగలిగే స్థితికి వచ్చింది ఈ సంస్థ.
నాన్నగారి పేరు కలవాలనే, దీనికి ‘రాజుగారి అప్పడాలు’ అన్న పేరు పెట్టాను.
రామరాజూ, చివరగా ఒకమాట... మీ నాన్నగారూ అమ్మగారూ నేనూ లోపాలు ఉండి తప్పొప్పులకు లొంగిన మనుషులమే. పరిస్థితులూ అలా వచ్చాయి. సాధారణ మట్టి మనుషులం మేము. కాకపోతే, కొద్దిపాటి మెట్టభూమిని మాగాణి చేసే ప్రయత్నం చేశాం- మాకున్న పరిధిలో అంతే! ఎవరినీ తప్పు పట్టకు.
ఈ దస్తావేజులలో ఉన్నది మీ ఆస్తి.
అమ్మగారి ముందు నిల్చునే ధైర్యం నాకు లేదు. నా నమస్కారాలు చెప్పి, పెద్ద మనసుతో నన్ను క్షమించమని చెప్పు.
ఉంటాను...
ప్రభావతి

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు... అనుకున్నాడు రామరాజు వెనుదిరుగుతూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.