close
పిల్లలకీ వంట తెలియాలి

పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం లేదని బాధపడేకన్నా వంట చేసేటప్పుడు వాళ్లకు చిన్న చిన్న పనులు చెబుతూ వంటలో భాగస్వామ్యం కల్పించడం లేదా టీవీలో వచ్చే కుకింగ్‌ షోలు చూపించడం వల్ల తిండిమీద ఆసక్తి పెరగడంతోపాటు పోషక పదార్థాలను తినడం కూడా అలవాటు అవుతుందని నెదర్లాండ్స్‌కు చెందిన టిల్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు పది నుంచి పన్నెండేళ్లలోపు పిల్లల్ని ఎంపికచేసుకుని టీవీలో వాళ్లు చూసే ప్రోగ్రాముల గురించి ప్రశ్నించారట. అందులో కొందరు కేవలం పిల్లలకోసం రూపొందించిన ప్రోగ్రాములు మాత్రమే చూడగా, కొందరు మాత్రం ఆరోగ్యకరమైన ఆహారం గురించి చెప్పే కుకింగ్‌ షోలు చూస్తామని చెప్పారట. అలా చూసేవాళ్లలో చాలామంది పిల్లలు ఆపిల్‌, కీరా... వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తీసుకోవడంతోబాటు అప్పుడప్పుడూ తమకు కావాల్సిన వాటితో వంట చేసుకుంటామనీ చెప్పారట. అదే ఇతర కార్యక్రమాలు మాత్రమే చూసేవాళ్లకి పోషకపదార్థాల మీద పెద్ద అవగాహన లేదని తేలిందట. సో, పిల్లలకు చిన్నతనం నుంచీ వంటిల్లుని పరిచయం చేయడం మంచిదన్నమాట.


మతిమరుపుకీ మందుంది..!

ఆల్జీమర్స్‌తో బాధపడేవాళ్లకు కొద్దిపాళ్లలో లిథియంను ఇవ్వడం వల్ల అది మరింత తీవ్రతరం కాకుండా ఉంటుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ క్యుబెక్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. వీళ్లు చేసిన ఓ పరిశీలనలో లిథియం అధిక శాతంలో ఉన్న నీటిని తాగేవాళ్లలో మతిమరుపు తక్కువగా ఉన్నట్లు గుర్తించారట. దాంతో ఆల్జీమర్స్‌తో బాధపడేవాళ్లకి ప్రస్తుతం వాడుతున్న మందులతో పోలిస్తే లిథియంను కొద్దిపాళ్లలో ఇవ్వడం వల్ల ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఎలుకల్లో ఈ విషయాన్ని పరిశీలించి చూశారట. వరసగా పన్నెండు వారాలపాటు వాటికి అత్యంత తక్కువ మోతాదులో లిథియంను ఇవ్వడంవల్ల వాటికి జ్ఞాపకశక్తి పెరిగినట్లు గుర్తించారట. దాంతో మతిమరుపు నివారణకి మందు దొరికిందని భావిస్తున్నారు సదరు నిపుణులు.


గచ్చకాయ... వాడుతున్నారా?!

గచ్చకాయ... అంటే చాలామంది అదేదో అరగదీస్తే వేడిగా అయిపోయే రాయి అనే అనుకుంటారు. కానీ అదో చెట్టు విత్తనం. దీన్నే ఫీవర్‌నట్‌ అనీ పిలుస్తారు. ముళ్లు ఎక్కువగా ఉండే ఈ చెట్లను కంచెగా వేస్తే పంటపొలాల్లోకి ఉడతలు రావట. ఇందులో అద్భుతమైన ఔషధగుణాలు ఉండటంతో ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా గర్భాశయ సమస్యలకి ఇది మంచి మందు. నెలసరిలో భాగంగా వచ్చే పొట్ట నొప్పికి ఈ గింజల్ని వేయించి పొడి చేసి నేతితో కలిపి ఇస్తే నొప్పి తగ్గుతుందట. ఒకలాంటి చేదు రుచితో ఉండే ఈ కాయని కఫ, వాత దోష నివారణకి ఉపయోగిస్తారు. ఇంకా కాలేయం, ప్లీహం, నులిపురుగుల సమస్యలకీ దీన్ని వాడుతుంటారు. ఈ గింజల నుంచి తీసిన నూనెతో మర్దన చేస్తే కీళ్ల సమస్యలూ తగ్గుతాయి. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే ఈ గింజల్ని ముద్దలా చేసి తేనెతో తీసుకుంటే తగ్గుతుందట. ఇంకా డయేరియా, డీసెంట్రీ, చర్మ వ్యాధులు, ఆస్తమా, దగ్గు, నులిపురుగులు, మధుమేహం, జ్వరం... ఇలా రకరకాల వ్యాధుల నివారణలో గచ్చకాయల్ని వాడుతుంటారు. ముఖ్యంగా మలేరియా జ్వరానికి ఇది అద్భుతమైన మందు అని చెబుతారు ఆయుర్వేద నిపుణులు.


ఇక, ఫ్లూ జ్వరం రాదు!

ప్రస్తుతం వ్యాక్సిన్‌ ఏదైనా ఎక్కువగా ఇంజెక్షన్‌ రూపంలోనే ఇస్తుంటారు. అయితే కొత్తగా ఫ్లూ జ్వరానికి మాత్రం ట్యాబ్లెట్‌ వ్యాక్సిన్‌ను రూపొందించారు. నిజానికి ఇంజెక్షన్‌తో పోలిస్తే ఓరల్‌ వ్యాక్సిన్‌ను తక్కువ ధరకే రూపొందించవచ్చుగానీ జీర్ణాశయ వ్యవస్థ కారణంగా వాటిని తయారుచేయడమే పెద్ద సవాల్‌గా పరిణమిస్తోంది. అయినప్పటికీ వక్సార్ట్‌ అనే బయోటెక్నాలజీ కంపెనీ సంవత్సరాల తరబడి నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్ల తయారీకోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇటీవల ఆ కంపెనీ తయారుచేసిన ఓరల్‌ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రయోగపూర్వకంగా 179 మందికి ఇచ్చి చూశారట. 90 రోజుల తరవాత మళ్లీ వాళ్లను పరిశీలించగా- అందరిలో ఆ వైరస్‌ను తట్టుకోగలిగే శక్తి పెరిగినట్లు గుర్తించారు. అంటే- ఫ్లూ జ్వరాలు రాకుండా మున్ముందు ఈ వ్యాక్సిన్‌తో అడ్డుకోవచ్చన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.