close
ఆకలితో ఉన్నారా... అన్నం పెడతారు!

‘ఊరు మనకు ఎంతో ఇచ్చింది... తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం’... ఓ సినిమాలోని డైలాగ్‌ ఇది. ఇలాంటి స్ఫూర్తితోనే కొందరు వ్యక్తులు... ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నం పెడుతూ అండగా ఉంటున్నారు. తమ సంపాదనలోంచి కొంత భాగాన్ని పేదలకోసం వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

పేదలకు కన్న కొడుకుగా...

కోల్‌కతాలోని బరనగర్‌కు చెందిన దేవ్‌ కుమార్‌ మల్లిక్‌ది పేద కుటుంబం. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబ పోషణ కోసం తల్లి సమీప పరిశ్రమలోకి పనులకు వెళ్తుండేది. అమ్మ కష్టాన్ని చూడలేక దేవ్‌ కుమార్‌ ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు ఖాళీ సమయంలో క్యాటరింగ్‌ సంస్థలో పనిచేస్తుండేవాడు. తల్లికి వృద్ధాప్యం రావడంతో చదువు మానేసి ఎంబ్రాయిడరీ సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగిగా చేరిపోయాడు. ఆ తరవాత కొన్ని రోజులకు బరనగర్‌లోనే సొంతంగా గార్మెంటరీ దుకాణాన్ని ప్రారంభించాడు. కుటుంబ పోషణకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో, ఆకలి విలువ తెలిసిన దేవ్‌ కుమార్‌... పేదల కడుపు నింపాలని అనుకున్నాడు. ఇలా... మొదట ప్రతిరోజూ పది మందికి రెండు పూటలా అన్నం పెట్టేవాడు. ప్రస్తుతం బరనగర్‌తోపాటు అక్కడి అగర్‌పుర, పానిహతి, సోడేపూర్‌ తదితర ప్రాంతాల్లోని మూడు వందల మంది పేదలకు ప్రతి రోజూ రెండు పూటలా అన్నం పెడుతూ ఆకలి తీరుస్తున్నాడు. అదేవిధంగా నిరాశ్రయుల కోసం బరనగర్‌లోనే ఓ హాల్‌ను నిర్మించాడు. పేదల అంతిమ సంస్కారాలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నాడు. రోగుల కోసం ఉచిత ఆంబులెన్స్‌ సౌకర్యాన్నీ ఏర్పాటు చేశాడు. దేవ్‌ కుమార్‌ గురించి ప్రస్తావిస్తే చాలు... ‘పేగు తెంచుకు పుట్టకపోతేనేం, మా కొడుకే’ అని ఆనందంగా చెబుతారు బరనగర్‌ ప్రాంతంలోని పేదలు.

రోగుల బంధువులకు ఆసరా

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంతో మంది మానసిక రోగులు వస్తుంటారు. చికిత్స కోసం నెలల తరబడి ఆసుపత్రిలోనే ఉండాలి. రోగులకు ఆసుపత్రిలోనే భోజనం అందిస్తారు. మరి, వారి బంధువుల పరిస్థితి...? హోటళ్లలో భోజనం చేసే ఆర్థిక స్థోమత వారికి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులకు భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది మానవ సేవా సమితి ఛారిటబుల్‌ ట్రస్ట్‌. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం సమీపంలోని మోడల్‌ కాలనీకి చెందిన సాయి, బుచ్చిబాబు, మాచారావు, రవీంద్రబాబు, శ్రీనివాస్‌... మానవ సేవా సమితి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలోని పేదలకు వేసవిలో మజ్జిగ, పెరుగన్నం అందించేవారు. చికిత్సకోసం మానసిక చికిత్సాలయానికి వచ్చే రోగులూ, వారి కుటుంబసభ్యుల పరిస్థితినీ అదే సమయంలో చూస్తుండేవారు. అందులో ఎక్కువగా పేదలే ఉన్నారని గుర్తించిన ట్రస్ట్‌ సభ్యులు... రోగుల కుటుంబసభ్యులకు ఆసరాగా నిలవాలని అనుకున్నారు. 2016 నుంచి రోజు మూడు వందల మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పంపిణీ చేస్తూ వారి ఆకలి బాధ తీరుస్తున్నాం.

- టి.రంజిత్‌కుమార్‌, ఈనాడు, హైదరాబాద్‌.

 

ఇంటి దగ్గరే ఫుడ్‌బ్యాంక్‌

‘ఆకలి కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, దాని ప్రభావం సమాజంపైన ఎంతో ఉంటుంది’ అన్న ఆలోచనతో ఇంటి దగ్గరే ఫుడ్‌ బ్యాంక్‌ ప్రారంభించాడు అరవై ఆరేళ్ల అబ్దుల్లా ఖాదర్‌. కేరళలోని తిరుచ్చూరుకు చెందిన ఖాదర్‌... ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. మూడు దశాబ్దాలపాటు అక్కడే ఉన్నాడు. ఆకలిని తట్టుకోలేక జరిగిన ఎన్నో దొంగతనాలూ, నేరాల గురించి విన్నాడు. చాలా నేరాలకు అదే కారణమని భావించిన అతడు... పేదల ఆకలి బాధ తీర్చడానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. గత సంవత్సరం స్వగ్రామానికి చేరుకున్నాడు. తరవాత అక్టోబర్‌ 2న తిరుచ్చూరులోని ఇరంజికూడలో తన ఇంటి వద్దనే భార్య సునీతతో కలిసి ఫుడ్‌బ్యాంక్‌ను ప్రారంభించాడు. దీనికోసం ఓ ఫ్రిజ్‌నూ కొనుగోలు చేశారు ఆ దంపతులు. ప్రతి రోజూ తాము తినే ఆహారంతోపాటే అదనంగా ఇరవై నుంచి ముప్ఫై మందికి సరిపడా ఆహారాన్ని తయారు చేస్తూ ఫ్రిజ్‌లో ఉంచుతున్నారు. ఆ ఆహారం పూర్తవగానే మరికొంత సిద్ధం చేసి పెడతారు. తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్‌బ్యాంక్‌కు వచ్చి ఆహారాన్ని తీసుకునే పేదల సంఖ్య పెరిగిందనీ, భవిష్యత్తులో మరికొందరికి సరిపడా ఆహారాన్ని అందుబాటులో ఉంచుతామనీ అంటున్నారు అబ్దుల్లా ఖాదర్‌, సునీత దంపతులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.