close

వెతల కథలు

హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన కేశవస్వామి ప్రాంతీయ సంస్కృతి- ప్రధానంగా పేద కుటుంబాల వ్యథార్త జీవిత యథార్థ గాథలకు ఇచ్చిన అక్షరరూపం ఇది. అలనాటి రాచరిక అవ్యవస్థతో పాటు నవాబుల గరీబు బతుకులనీ ఈ కథల్లో చిత్రించారు. నిలువునా స్వార్థప్రవృత్తీ అవకాశవాద ధోరణీ ప్రబలితే ఎన్ని అనర్థాలు దాపురిస్తాయో తెలిపే కథలు కొన్ని. వైభవప్రాభవాలు అంతరించి నాటి ప్రభుత్వభరణాలే ఆధారమైనవారి దయనీయతను వివరించేవి ఇంకొన్ని. అణచివేత ముళ్లచక్రంలో చిక్కుకుని తల్లడిల్లిన ముదిత దిగ్భ్రాంతికర అనుభవాల్ని ‘సవతి’ వెల్లడిస్తుంది. తిరుగుబాటు బావుటా ఎగరేసిన ప్రేయసీ ప్రియుల చరిత్ర ‘కేవలం మనుషులం’. కథలన్నీ హృదయాన్ని కదిలిస్తాయి.

- అన్నపూర్ణ

 

నెల్లూరి కేశవస్వామి సమగ్ర కథాసంపుటి
పేజీలు: 364: వెల: రూ. 160/-
ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమి


రేపటి సవాళ్లు

తెలుగు సాహిత్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ రచనలు చేసే కొద్దిమందిలో మధు చిత్తర్వు ఒకరు. ఈ కథల సంపుటిలోని ‘జడ్‌’ కథ జీవరసాయన ఆయుధాల గురించి ప్రస్తావిస్తుంది. వాటి పరిణామాలను కళ్లకు కడుతుంది. పరిశోధనలు కట్టుతప్పితే జరిగే విపరిణామాలను ‘కొత్త మందు’లో చూపించారు. హ్యూమనాయిడ్‌ రోబోలు, గ్రహాంతర జీవులు, రోబోడాగ్స్‌ లాంటివి ఈ కథల్లో కనిపిస్తాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరిగే మోసాలను ‘మెడికల్‌ ఫిక్షన్‌’ కథల్లో చర్చించారు. కాల్పనిక కథలే అయినప్పటికీ అన్నీ భవిష్యత్తును ఆవిష్కరిస్తాయి. రాబోయే కాలంలో ఎదుర్కొనబోయే సవాళ్లను ముందే హెచ్చరిస్తాయి. కొత్తదనం కోరుకునేవారికి నచ్చే కథలివి.

- బి.శివప్రసాద్‌

 

‘జడ్‌’ -సైన్స్‌ ఫిక్షన్‌, మరికొన్ని కథలు
రచన: డా।। మధు చిత్తర్వు
పేజీలు: 264: వెల: రూ. 150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


భారతీయ వ్యాపార చరిత్ర

‘సూపర్‌ 30 విజనరీస్‌’ భారతదేశాన్ని వాణిజ్య కోణంలో చూపిస్తుంది. దేశం, ప్రపంచం గర్వించదగ్గ వ్యాపార దిగ్గజాల గురించి వివరంగా రాశారు రచయిత. ఈ పుస్తకం ద్వారా ఆయా వ్యక్తుల వ్యాపార ప్రయాణాన్నీ, దార్శనికతనూ తెలుసుకోవడమే కాదు, 150 ఏళ్ల భారతదేశ వ్యాపార చరిత్రనీ అర్థంచేసుకోవచ్చు. ఆంగ్లేయుల కాలంలో మొదలైన గాద్రేజ్‌, అమృతాంజన్‌, టీవీఎస్‌ సంస్థల నుంచీ ఆర్థిక సంస్కరణల తర్వాత, ఇంటర్నెట్‌ యుగంలో వచ్చిన ఎయిర్‌టెల్‌, నౌకరీడాట్‌కామ్‌, పేటీఎమ్‌ల వరకూ ఆయా సంస్థల వ్యవస్థాపకులు తమ కలల్ని నిజం చేసుకున్న తీరుని చక్కగా వివరించారు. కిరణ్‌ మజుందార్‌ షా, వందనా లూత్రా, కల్పనాసరోజ్‌... లాంటి వారి కథనాలు స్ఫూర్తినిస్తాయి.

- చంద్రశేఖర్‌

 

సూపర్‌ 30 విజనరీస్‌
రచన: సునీల్‌ ధవళ
పేజీలు: 203: వెల: 250/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


బతుకు చిత్రం

జీవన సంఘర్షణల్నీ, వర్తమాన జీవిత స్థితిగతుల్నీ ఆలోచనాత్మకంగా ప్రకటించే కవితా సంకలనమిది. ‘పల్లె గుండె నుంచి పట్నానికి రక్తాన్ని దోచుకెళ్లే రక్తనాళంలా కన్పిస్తోంది బైపాస్‌ రహదారి’ అంటూ నేటి పల్లెల ముఖచిత్రాన్ని కవి వ్యక్తీకరించారు. ‘నిప్పుల్లో కాల్చి నిజాలకు పుటం పెట్టడమే కవిత్వమంటే’ అని కవిత్వానికి విలువైన నిర్వచనాన్ని ఇచ్చారు. ‘అదేంటోరా నువ్వు అచ్చం మా అమ్మలాగే అనిపిస్తావు/ నా ఆకలిని, ఆవేదనల్ని, అమ్మంత స్పష్టంగా గుర్తిస్తావు’ అని స్నేహబంధంలో ఆత్మీయకోణాన్ని దర్శించారు. ‘నీ చేతి స్పర్శలో విత్తనాలకు మొలకెత్తే ధైర్యం వస్తుంది’ అని రైతుల చేతుల్లో ఉన్న సేద్యవిద్య గొప్పతనాన్ని విశ్లేషించారు. ‘మనిషితనం నిండినప్పుడే దేశమైనా, దేహమైనా మానవత్వ పరిమళాల ఊటగా మారుతుంది’ అంటూ మానవీయ భావాలకు పట్టం కట్టారు. ఈ కవిత్వంలో స్పష్టత, దార్శనికత రెండూ కనిపిస్తాయి. భిన్నకోణాల జీవన సంపుటిగా ఈ సంకలనం ప్రతిఫలిస్తుంది.

- లాస్యశ్రీనిధి

 

బతుకు చెట్టు (కవిత్వం)
రచన: వెన్నెల సత్యం
పేజీలు: 144: వెల: రూ.120/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.