close

చిన్ని గుండెకు సమస్యా... నేనున్నా!

కంట్లో నలుసు పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది గుండెకు చిల్లు పడితే... అదీ చిన్నారులకైతే... ఆ బాధ వర్ణనాతీతం. ఆ వేదన హృదయ విదారకం. ఆర్థికంగా బాగున్న వారు తమ పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించి పునర్జన్మ ప్రసాదిస్తారు. మరి పేదలు..? తమ దీనావస్థను తలచుకుంటూ, దేవుడిపైనే భారంవేసి మౌనంగా రోదిస్తారు. అలాంటి పేద పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ దేవుడిలా ఆదుకుంటున్నాడు ఓ వైద్యుడు.

దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు ఏడు లక్షల మంది పిల్లలు గుండె సంబంధిత వ్యాధులతోనే లోకం చూస్తున్నారు. తమ ఆశలపంట ఇంట్లోకి వచ్చిందని ఆనందించేలోపే... ఆ చిన్ని గుండెకు చిల్లు పడిందని తెలిస్తే తల్లిదండ్రుల హృదయాలు ఆవేదనతో బరువెక్కుతాయి. డబ్బు ఉన్న కుటుంబాలైతే ఎంత ఖర్చైనా లెక్కచేయక ఆపరేషన్‌ చేయించి చిన్నారిని బతికించుకుంటాయి. పేదలు మాత్రం తమ పిల్లలకు ఆపరేషన్‌ చేయించలేక గుండెలు బాదుకుంటారు. ఆపరేషన్‌కు నోచుకోక ఎంతో మంది చిన్నారులు కళ్లు మూస్తున్నారు కూడా. గుండెకు చిల్లు పడిన ఒక్కో చిన్నారికి ఆపరేషన్‌ చేయించడానికి యాభై వేల నుంచీ రెండు లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. అంతటి ఖర్చును భరించే స్థోమత పేదలకు ఉండదు. అలాంటి పేదల దుఃఖాన్ని చూసి చలించిన వైద్యుడు రమణ దన్నపునేని... గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ అండగా నిలుస్తున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో...
జగిత్యాలకు చెందిన రమణ దన్నపునేనిది సాధారణ కుటుంబం. అక్కడే ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తిచేసిన అతడు కాకినాడలోని ‘రంగరాయ మెడికల్‌ కాలేజీ’లో వైద్యవిద్యను అభ్యసించాడు. చిన్నారులు గుండె సంబంధ వ్యాధులతో పుట్టారనీ, వారికి ఆపరేషన్లు చేయించే స్థోమత లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారనీ చిన్నతనంలో పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూస్తుండేవాడు రమణ. పెరిగి పెద్దయ్యాక డాక్టరై వారిని ఆదుకోవాలని అనుకునేవాడు. తన ఆశయ సాధన కోసం కష్టపడి చదివి కార్డియాలజిస్ట్‌ అయ్యాడు. అనంతరం లండన్‌లోని ఆల్డర్‌ హే చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్‌గా చేరిపోయాడు. అప్పటికే ఆ ఆస్పత్రి... గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ‘హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌’ సాయంతో ఉచితంగా ఆపరేషన్లు చేస్తోంది. ఇది రమణలో కొత్త ఉత్తేజాన్ని నింపి, పేద పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయాలన్న ఆకాంక్షను రెట్టింపు చేసింది. తన ఆశయానికి తోడు సంస్థ స్ఫూర్తితో అతడు 2015 నుంచీ ఇప్పటి దాకా తెలుగు రాష్ట్రాల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 250 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేశారు. లండన్‌ నుంచి తరచూ వస్తూ... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిన్నారులకు విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో, తెలంగాణ ప్రాంత చిన్నారులకు కరీంనగర్‌లోని ప్రతిమ హాస్పిటల్‌లో ఆపరేషన్లు చేస్తున్నాడు. అందుకయ్యే ఖర్చుల్నీ సొంతంగానే భరిస్తున్నాడు.

1200 ఆపరేషన్లు!
హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు భారత్‌లో పన్నెండు వందల మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేశారు. కశ్మీర్‌, పాండిచ్చెరి, గుజరాత్‌, పశ్చిమ్‌ బంగ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ ఆపరేషన్లు చేయించింది హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌. వీటిలో ఎక్కువ ఆపరేషన్లలో రమణ ప్రధానంగా పాలుపంచుకోవడం విశేషం.  అతడి సేవలకు గుర్తింపుగా బ్రిటీష్‌ హార్ట్‌ కేర్‌ సంస్థ ‘హెల్త్‌కేర్‌ హార్ట్‌ హీరో’ అవార్డుతోనూ, లండన్‌ తెలుగు అసోసియేషన్‌ ‘లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌’ అవార్డుతోనూ సత్కరించాయి. పిల్లల గుండెకు పడిన చిల్లుల్ని కొన్ని నెలల్లోనే సరిచేయాలనీ, లేకపోతే వారి ప్రాణానికే ప్రమాదమనీ అంటున్న రమణ-పిల్లలకు ఆపరేషన్లు చేయించి వారిని బతికించుకునే ఆర్థిక స్థోమత పేదలకు ఉండదనీ, అలాంటి వారిని ఆదుకోవడానికే ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నాననీ చెబుతున్నాడు!

- పి.ఎస్‌.రంగారావు, ఎం.చంద్రప్రకాశ్‌రావు, న్యూస్‌టుడే, జగిత్యాల

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.