close

మీరూ కావొచ్చు... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

సర్టిఫికెట్‌లకీ, నైపుణ్యాలకీ సంబంధంలేదనీ తమ కంపెనీలో ఇంజినీరింగ్‌ పట్టా లేనివాళ్లు చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారనీ చెబుతారు ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌. ఈ మాట ఆయనది మాత్రమే కాదు, దాదాపు టెక్‌ పరిశ్రమలో ఉండే అందరిదీనూ. అందుకే ‘ఎవరైనా కోడింగ్‌ నేర్చుకోవచ్చు, సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడొచ్చు’ అంటున్నాయి చాలా సంస్థలు. వాటిలో కొన్ని ఇవి!


ఓహో... జోహో!

చెన్నై కేంద్రంగా పనిచేసే ఐటీ ఉత్పత్తుల సంస్థ ‘జోహో’ ఇంటర్మీడియెట్‌, డిప్లొమో చదివి 17-20 మధ్య వయసువారికి సాఫ్ట్‌వేర్‌ విభాగంలో తమ యూనివర్సిటీ ద్వారా రెండేళ్లపాటు శిక్షణ ఇస్తోంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి సంస్థలోనే చోటిస్తుంది. కోర్సు సమయంలో అభ్యర్థులకు రూ.10వేలు స్టైపెండ్‌ కూడా ఇస్తారు. మిగతా రాష్ట్రాలవారికి ఆన్‌లైన్లో, తమిళనాడు వారికి ఆఫ్‌లైన్లో ఎంపిక పరీక్ష పెడతారు. గణితం, ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో విద్యార్థుల సామర్థ్యాల్ని పరీక్షిస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎంపికైన వారికి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ డవలప్‌మెంట్‌ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. విద్యార్థుల ఆసక్తినిబట్టి అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్నీ నేర్పుతారు. వీటితోపాటు డిజైన్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లోనూ శిక్షణ ఇస్తారు. సంస్థ ఉద్యోగులే అభ్యర్థులకు పాఠాలు చెబుతారు. ఇక్కడ పరీక్షలు ఉండవు. నిజమైన ప్రాజెక్టులు ఇచ్చి అవి ఏ మేరకు పూర్తిచేయగలుగుతున్నారో చూస్తారు. గత పద్నాలుగేళ్లలో 800 మందికి శిక్షణ ఇచ్చిందీ యూనివర్సిటీ. జోహో ఉద్యోగుల్లో 15 శాతం ఇక్కడ శిక్షణ పొందినవారే. ఏటా 2-3సార్లు శిక్షణ కోసం అభ్యర్థుల్ని ఎంపికచేస్తుంటారు. ‘ఇంజినీరింగ్‌ చేశాక కూడా నైపుణ్యం ఉండేవాళ్లు దొరకడంలేదు. అప్పుడే సొంత యూనివర్సిటీ ఆలోచన వచ్చింది’ అంటారు సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు.


ఆన్‌లైన్లో ఉచిత శిక్షణ

కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌...  ఈ పదాలు చాలావరకూ ఇంజినీరింగ్‌ విద్యార్థులూ, ఐటీ ఉద్యోగుల నోట వింటుంటాం. కానీ వీటిని పాశ్చాత్య దేశాల్లో స్కూల్‌ విద్యార్థులూ నేర్చుకుంటున్నారు. మనదగ్గరా ఈ ట్రెండ్‌ మొదలైంది. ఎలాంటి విద్యార్హతలూ, ఫీజులూ అడగకుండా కోడింగ్‌ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్లెవరికైనా నేర్చుకునే అవకాశం ఇస్తోంది ‘ఫ్రీకోడ్‌క్యాంప్‌డాట్‌కామ్‌’ వెబ్‌సైట్‌. అమెరికాకు చెందిన క్విన్సీ లార్సన్‌ ఈ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. దీన్లో నిపుణుల సూచనల్ని చదువుకుంటూ కోడింగ్‌ నేర్చుకోవచ్చు. కోడింగ్‌కి అవసరమైన అన్ని లాంగ్వేజ్‌లూ ఇక్కడ నేర్చుకునే వీలుంటుంది. వివిధ టెక్‌ కంపెనీల్లో పనిచేసే కోడింగ్‌ నిపుణులు ఈ వెబ్‌సైట్లో కోర్సుల్ని తయారుచేస్తుంటారు. అభ్యర్థుల్లో ఉత్సాహం నింపేందుకు నిత్యం దీంట్లో ‘100 రోజుల్లో జావా’ లాంటి ‘కోడ్‌ ఛాలెంజ్‌’లు ఉంటాయి. దీన్లో ఎన్జీఓల ఆప్‌, వెబ్‌సైట్‌లకు అవసరమైన కోడింగ్‌లను ఉచితంగా చేసిచ్చే ప్రాజెక్టులూ ఉంటాయి. అవి పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్‌ ఇస్తారు. ఫ్రీకోడ్‌క్యాంప్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. దీన్లో వీడియో పాఠాలు చూసి కూడా కోడింగ్‌ నేర్చుకోవచ్చు!


నేటి గురుకులం

అభిషేక్‌ గుప్తా... ఐఐటీ దిల్లీ పూర్వ విద్యార్థి. ఓ అంకుర సంస్థని ప్రారంభించాడు. తర్వాత దిల్లీ రాష్ట్ర విద్యాశాఖలో సలహాదారుగా చేరాడు. రిషభ్‌ వర్మ ఇంటర్మీడియెట్‌ తర్వాత కాలేజీకి వెళ్లడం మానేశాడు. కానీ తనకు ఇష్టమైన కంప్యూటర్స్‌ రంగంలో స్థిరపడాలని కోడింగ్‌ నేర్చుకుని సొంత సంస్థని పెట్టాడు. ఇతడు కూడా దిల్లీ విద్యాశాఖలో సలహాదారుగా ఉండేవాడు. అక్కడే అభిషేక్‌, రిషభ్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. సాఫ్ట్‌వేర్‌ డవలపర్‌కి పెద్ద చదువులు అక్కర్లేదు, పదో తరగతి చదువుకున్నవాళ్లకైనా కోడింగ్‌ నేర్పిస్తే ఆ పని చేయగలరన్న అభిప్రాయం ఇద్దరిదీనూ. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్న వాళ్లకు కోడింగ్‌ రాయడంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలూ ఇప్పించే సంస్థని పెట్టాలనుకున్నారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘నవ్‌గురుకుల్‌ (navgurukul.com) 17-22 ఏళ్ల మధ్యవారికి పదో తరగతి స్థాయిలో గణితం సామర్థ్యాన్ని పరీక్షించి ఈ శిక్షణకు ఎంపిక చేసి ఏడాదిపాటు పైథాన్‌, జావా స్క్రిప్టు, యాంగ్యులర్‌ జేఎస్‌, హెచ్‌టీఎమ్‌ఎల్‌, సీఎస్‌ఎస్‌... మొదలైన కోడింగ్‌ లాంగ్వేజ్‌లనూ, ఆంగ్లంలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలనీ నేర్పుతారు. నెలవారీ ఆదాయం రూ.15వేలు అంతకంటే తక్కువ ఉన్న కుటుంబాలకు చెందిన యువతకు ప్రాధాన్యం ఇస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగం వచ్చేలా చేస్తారు. ఉద్యోగంలో చేరాక సంస్థకు రూ.1.2 లక్షలు చెల్లించాలి. అబ్బాయిలకు ధర్మశాలలో, అమ్మాయిలకు బెంగళూరులో శిక్షణ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌, క్యాప్‌జెమిని, యాక్సెంచర్‌, సోషల్‌ ఆల్ఫా లాంటి సంస్థలు వీరికి నిధులు అందిస్తున్నాయి. గత నాలుగేళ్లలో 115 మందికి శిక్షణ ఇవ్వగా వారిలో 70 మందికి ఉద్యోగాలు వచ్చాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.