close

గడ్డకట్టే నీళ్లలో దిగాల్సిందే!

చలికాలం కాసిన్ని చల్లని నీళ్లు తగిలితే చాలు... ఒళ్లు జివ్వుమంటుంది! కానీ ఈ సైనికులు మాత్రం మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో కావాలనే చల్లటి నీటిగుంటల్లో మెడ వరకూ మునిగేలా నిలుచున్నారు. ఎందుకంటారా... చాలా పాశ్చాత్య దేశాల్లో ఉష్ణోగ్రతలు బాగా తక్కువ ఉంటాయి కదా! చలికాలంలో అయితే మొత్తం మంచుతో నిండిపోతుంది. అయినా సరే సరిహద్దుల్లో కాపలా కాయడం చాలా ముఖ్యం. అందుకే అక్కడి సైనికులకు ప్రత్యేకంగా ‘ఐస్‌ వెదర్‌ ట్రైనింగ్‌’ అనే శిక్షణ ఇస్తారు. అందులో మంచును తవ్వి చిన్నపాటి గుహల్లా ఏర్పాటు చేసుకోవడం వంటివి నేర్పిస్తారు. ఇలా చల్లటి నీటిలో మునగడం కూడా ఆ శిక్షణలో ఒక భాగం. తొలుత శిక్షకులు గడ్డకట్టిన సరస్సుల్లో ఒకచోట మంచును తవ్వి నీటి కొలనులా తయారుచేస్తారు. సైనికులంతా వరసగా అందులోకి దూకి మళ్లీ వారంతట వారే బయటకు రావాలి. చెప్పుకోవడానికి సులభంగా అనిపిస్తుంది కానీ ఆ నీటి చల్లదనానికి క్షణంలోనే శరీరం మొద్దుబారిపోతుందట. ఎక్కువసేపు ఉంటే ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే అలాంటి పరిస్థితుల్ని అలవాటు చేయడం కోసం ఈ శిక్షణ ఇస్తుంటారు.


వచ్చిందండి... ఫ్యాషన్‌ బండి!

డిజైనర్‌ దుస్తులు వేసుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది కానీ అందరి వల్లా కాదు కదా! అలాంటి వారికి కూడా మనీష్‌మల్హోత్రా వంటి ఫేమస్‌ డిజైనర్లు తయారుచేసిన డ్రెస్సులు వేసుకునే అవకాశం కల్పిస్తోందీ స్టేజ్‌ 3 ఫ్యాషన్‌ ఆన్‌ వీల్స్‌. దిల్లీకి చెందిన సంచిత్‌ బవేజా, సబేనా పూరి అనే యువ వ్యాపారులదీ ఆలోచన. ఈ అద్దాల బస్సులో డిజైనర్‌ దుస్తులను పెట్టి దిల్లీలోని ముఖ్య ప్రదేశాల్లో ఉంచుతున్నారు. దుస్తుల్ని చూసి కోరుకున్నవారికి అద్దెకు ఇస్తున్నారు. డ్రెస్సులు తీసుకునేవారు అవి తమకు నప్పుతాయో లేదో చూసుకునేందుకు ఈ బస్సులోనే ట్రయల్‌రూమ్‌ ఉంది. అవసరమైతే ఫిట్టింగ్‌ చేసేందుకు టైలర్‌ కూడా ఉంటారు. ఒక పెద్ద అద్దం ముందు నుంచుని ఫొటోలు తీసుకునేలా సెల్ఫీ స్పాట్‌ సైతం ఉందండోయ్‌! ఇది విజయవంతం కావడంతో ఇతర నగరాల్లోనూ ఇలాంటి బస్సులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట.


గాల్లో సైకిల్‌ సవారీ!

చిన్నప్పుడు సైకిల్‌ తొక్కడం నేర్చుకుంటుంటే మోకాలినిండా దెబ్బలే! నేల మీద తొక్కడానికే అంత ప్రాక్టీస్‌ అవసరం కదా... మరి గాల్లో తొక్కితే ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభూతి పొందాలనుకునే సాహసికుల కోసమే హిమాచల్‌ప్రదేశ్‌లో స్కై సైక్లింగ్‌పార్క్‌ ఏర్పాటు చేశారు. మనాలీ సమీపంలో సముద్రమట్టానికి 9000 అడుగుల ఎత్తులో ఉందీ పార్క్‌. ఇంతకీ సైకిల్‌ గాల్లో ఎలా తొక్కుతాం అనేగా మీ సందేహం... రెండు చిన్నపాటి కొండల మధ్యలో ఒక తాడు కడతారు. దాని మీదే సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాలి. కిందపడిపోకుండా సపోర్ట్‌ ఉండేందుకు ఆ తాడుకు సమాంతరంగా పైన మరో తాడును కడతారు. దానికే మన సైకిల్‌ వేలాడుతుందన్నమాట. అలా రెండు తాళ్ల మధ్య ఉన్న సైకిల్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటూ తొక్కాలి. అంత ఎత్తు నుంచి చూస్తే చుట్టూ చాలా అందంగా కనిపిస్తుందట. అదే సమయంలో అలా సైకిల్‌ తొక్కడం థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుందట. అందుకే ఈ అనుభవం కోసం పర్యటకులు ఇప్పటికే క్యూ కడుతున్నారు.


పీపాలోనే తిండీ నిద్రా!

రికార్డుల కోసం కొందరు చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నన్‌ క్రూగర్‌ మాత్రం ఇంకో అడుగు ముందుకేసి 80 అడుగుల ఎత్తులో 80 రోజులపాటు నివాసం
ఉంటున్నాడు. అంటే అదేదో ఇంట్లో అనుకునేరు... కానే కాదు. కేవలం ఒక మనిషి నిలబడగలిగేలాంటి చెక్క పీపాలో ఉంటున్నాడు! రోజంతా ఆ పీపాలోనే గడుపుతూ అక్కడే తింటూ అక్కడే నిద్రపోతూ ఇప్పటికే 60 రోజులకుపైగా గడిపాడట. గతంలోనూ ఇలాగే 54 రోజులు ఉండి రికార్డు నెలకొల్పాడట క్రూగర్‌. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలుకొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అతనికి కావాల్సినవన్నీ కింద నుంచి అందించడానికి ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఓ తాడుకు బకెట్‌ కట్టి ఇతనికి ఆహారం, దుప్పట్లు వంటివి అందిస్తున్నారు... కాలకృత్యాలూ ఈ విధంగానే! ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటే ఇదేనేమో!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.