close

అంతిమ సేవలకే ఈ స్టార్టప్‌లు

పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాల్ని సజావుగా జరిపించుకోవడం కోసం రకరకాల ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అదే అంతిమ సంస్కారాలకు సంబంధించిన తంతులు నిర్వహించే సంస్థలంటే కాస్త ఆలోచించాల్సిందే. ముఖ్యంగా సిటీల్లో ఆ ఏర్పాట్లు ఇబ్బందిగానే ఉంటాయి. అందుకే వీళ్లు స్టార్టప్‌లు పెట్టి అంతిమ కార్యక్రమాలకు సంబంధించిన సేవలందిస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్టప్‌లు ఏంటంటే...


అన్నీ తామై...

హ్మదాబాద్‌కి చెందిన బిల్వా దేశాయ్‌ తల్లి ఆరేళ్ల క్రితం చనిపోయింది. ఆ సమయంలో దగ్గరి బంధువులూ, తెలిసినవాళ్లెవరూ దగ్గరలేకపోవడంతో ఒంటరిగా ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడింది. డెత్‌సర్టిఫికెట్‌, ఇన్సూరెన్స్‌ దరఖాస్తు చేసుకునే క్రమంలో చాలా సమస్యలు ఎదుర్కొంది. అప్పుడే ఆమెకి అలాంటి పనులన్నీ చేసి పెట్టేవాళ్లుంటే బాగుంటుందనిపించింది. ఆ తరవాత తనలాంటి వాళ్లెందరో అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడటం కూడా కళ్లారా చూసింది. దాంతో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి అంతిమ క్రియలు నిర్వహించేందుకు ‘మోక్షశిల్‌’ పేరుతో స్టార్టప్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అవయవదానం ఏర్పాట్లూ, ఆసుపత్రి నుంచి శవాన్ని ఇంటికి చేర్చడం, డెత్‌ సర్టిఫికెట్లు, బీమా దరఖాస్తుకు సంబంధించిన పత్రాలను ఇప్పించడం, పండితుల్ని పిలిపించడం, దహన సంస్కారాల ఏర్పాట్ల వంటివన్నీ చేస్తుంది. అలానే పిల్లలు విదేశాలకు వెళ్లడంతో ఒంటరైన తల్లిదండ్రులూ, మంచానపడ్డ వృద్ధులూ ముందుగానే మోక్షశిల్‌ సేవల్ని ప్రీబుకింగ్‌ చేసుకుని మరణానంతరం ఆ సంస్థ సేవల్ని పొందడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలానే విదేశాల్లో ఉన్న వాళ్లు రావడానికి ఆలస్యమైతే బాడీకి ఎంబామింగ్‌ చేయడం, ఫ్రీజర్‌లో ఉంచడం వంటివీ చేస్తుందీ సంస్థ. 


ఆ సామగ్రి అందిస్తారు

ముంబయికి చెందిన నితేశ్‌ మెహతా హార్డ్‌వేర్‌ డిజైనర్‌. అతని కజిన్‌ అయిన హితేన్‌ ధృవ్‌ బ్యాంకర్‌, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌. మూడేళ్ల క్రితం వీళ్ల స్నేహితుడు ఓ ప్రమాదంలో మరణించడంతో దహన సంస్కారం, అంతిమక్రియలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ వాళ్లే చూసుకున్నారు. ఆ సమయంలో వాళ్లిద్దరికీ ఎదురైన ఓ అనుభవమే స్టార్టప్‌ ఏర్పాటుకు కారణమైంది. అదేంటంటే... కర్మకాండల సమయంలో జరిగే తంతుకు గంగా జలం ఉపయోగిస్తారు. ఆ జలం కోసం ముంబయిలో దాదాపు రెండురోజులపాటు వెతికితేగానీ దొరకలేదు. అలానే ఇతర పూజా సామగ్రి కోసం కూడా పలు షాపులు తిరగాల్సి వచ్చింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అంత సమయం సామగ్రికే వెచ్చించడం కష్టమే. అందుకే ఆ సామగ్రిని ఒకే బాక్సులో పెట్టి ఆన్‌లైన్‌లో ఇంటికే అందిస్తే బాగుంటుంది అనుకున్నారు. అలా 2017లో ‘నితిన్‌ వెంచర్స్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించి కర్మకాండలకు కావల్సిన సామగ్రిని ‘సర్వపూజ’ పేరుతో ఇంటికే పంపుతున్నారు. ఆ కిట్‌లో మట్టికుండలు, ప్రమిదలు, కర్పూరం, వక్కలు, దారాలు, నల్ల నువ్వుల వంటివి దాదాపు 38 రకాల వస్తువులుంటాయి. ప్రాంతం, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కిట్లను అందిస్తున్నారు. వీటితోపాటు పిడకలూ, గోమూత్రం, గంగాజలం, సత్యనారాయణ స్వామి వ్రతం కిట్‌ వంటివన్నీ కూడా సర్వపూజా సైట్లో అందుబాటులో ఉంచారు. అలానే ముంబయి, గుజరాత్‌, హైదరాబాద్‌లోని పూజా సామగ్రి షాపుల్లోనూ, అంబులెన్సు సర్వీసుల వాళ్ల వద్ద కూడా ఈ కిట్లు అందుబాటులో ఉంచారు.


సంప్రదాయాన్ని బట్టి...

హైదరాబాద్‌కు చెందిన శృతి రెడ్డి భర్త ఉద్యోగరీత్యా కోల్‌కతాలో స్థిరపడింది. కొన్నాళ్లు ఐటీ ఉద్యోగం కూడా చేసింది. ఆమె మామగారు చనిపోవడంతో పంజాబీ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించే పండితుల కోసం ఎంతగానో వెతికారు. చివరికి ఎవరూ దొరక్క పంజాబ్‌ నుంచి పిలిపించుకోవల్సి వచ్చింది. ఆ అనుభవంతోనే శృతి అంతిమ క్రియలకు సంబంధించిన సేవలు అందించడానికి ‘అంత్యస్థి’ పేరుతో ఓ స్టార్టప్‌ను మొదలుపెట్టింది. దీని ద్వారా శవాల్ని ఉంచడానికి ఐసుపెట్టెలు, శవయాత్రలకు వాహనాలు, మృతదేహం కుళ్లిపోకుండా ఎంబామింగ్‌ ఇంజక్షన్లు ఇవ్వడం, అన్నసంతర్పణలు, ఆయా సంప్రదాయాలకు అనుగుణంగా దశదిన కర్మల ఏర్పాట్ల వంటివి చూస్తుంది. అలానే విదేశీ రోగులను స్వస్థలానికి చేర్చడానికి ఆయా దేశాల ఎంబసీల్లో తగిన పత్రాలు అందించి క్లియరెన్స్‌ ఇప్పిస్తుంది ఈ స్టార్టప్‌. శవానికి ఎంబామింగ్‌ చేసి ఎయిర్‌లైన్‌ పార్సిల్‌ ప్యాకింగ్‌ చేస్తుంది. ఈ సేవలు కోల్‌కతాతోపాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌, దిల్లీ, జైపుర్‌లలోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ అంతిమ సేవలకుగానూ కేంద్రప్రభుత్వం నుంచి నేషనల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డును అందుకుంది శృతి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.