close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సపోటా పొడి... సపోటా రవ్వ... అన్నీ దొరుకుతాయిక్కడ..!

‘ఐస్‌క్రీమ్‌ పార్లర్‌, బ్యూటీపార్లర్‌ వంటి పేర్లు అన్నిచోట్లా వినిపించేవే, కనిపించేవే. సపోటా పార్లర్లు చూడాలంటే మాత్రం మహారాష్ట్రలోని మా బోర్దీ గ్రామానికి రావాల్సిందే’ అంటున్నారు దీని సంస్థాపకులైన మహేష్‌ చూరి. ఆ సపోటాల కథేంటో తెలుసుకోవాలంటే కచ్చితంగా వెళ్లాల్సిందే ..!

ముంబయికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది బోర్దీ గ్రామం. ఒకవైపు చల్లని గాలులతో మైమరిపించే సాగరజలాలూ మరోవైపు తియ్యని పరిమళంతో ఆకట్టుకునే సపోటా తోటలతో నగరవాసుల్ని రారమ్మని ఆహ్వానిస్తుంటుంది బోర్దీ. 19వ శతాబ్దంలో టెక్స్‌టైల్‌ దిగ్గజం సర్‌ దిన్‌షా మనేక్‌జీ పెటిట్‌ విదేశాల నుంచి సపోటా మొక్కల్ని తెప్పించి ముంబయిలోని తన తోటల్లో నాటించాడట. ఆ ఎస్టేట్‌ మేనేజర్‌, అర్దేషిర్‌ ఇరానీ ఓసారి కొన్ని మొక్కల్ని సొంతూరు బోర్దీకి తీసుకువచ్చి తన పొలంలో నాటాడట. అలా మెల్లగా ఊరంతా సపోటా తోటల్ని పెంచడం అలవాటుచేసుకున్నారు. దాంతో ఇప్పుడు అక్కడ వ్యవసాయం అంటే సపోటా తోటల పెంపకమే. ఊళ్లోని రైతులంతా సపోటా తోటలో పనిచేస్తే, మహిళలు ఆ పండ్లతో పచ్చళ్లూ చిప్సూ చేసే పనిలో బిజీగా ఉంటారు. ఇలా చేసినవాటిని ఏటా ఆ ఊళ్లో నిర్వహించే సపోటా వేడుకలో విక్రయిస్తారు. అయితే కొన్నిసార్లు ధర లేకనో తుపానుల కారణంగానో పండ్లలో ఎక్కువ శాతం వృథా అయ్యేవి. అది గమనించిన మహేష్‌, తమ గ్రామానికే ప్రత్యేకమైన ఈ సపోటా ఉత్పత్తుల్ని మరింత విస్తృతం చేసి వాటికి ప్రాచుర్యం కల్పించాలనుకున్నాడు. నేరుగా రైతుల నుంచి సపోటాల్ని కొని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ద్వారా స్థానిక మహిళలకు ఉపాధినీ కల్పించాడు. అప్పటికే ఎలక్ట్రికల్‌ పరికరాల్ని ఎగుమతి చేసే వ్యాపారంలో ఉన్న మహేష్‌, తన దగ్గర ఉన్న మెషినరీ సాయంతో సపోటాల్ని రుబ్బి పొడీ, రవ్వా చేయడానికి ప్రయత్నించాడు. కానీ సపోటా గుజ్జు జిగటగా ఉండటంతో రుబ్బడానికి సరిగ్గా కుదిరేది కాదు, ఎండబెడితే ఎండేది కాదు. దాంతో ప్రత్యేక పరికరాల్ని రూపొందించాడు. కాయల్ని పలుచగా కోసి సోలార్‌ టెంటుల్లో ఎండబెట్టడం ప్రారంభించాడు. ఎట్టకేలకు ప్రిజర్వేటివ్‌లూ ఫ్లేవర్లూ వాడకుండా స్వచ్ఛమైన సపోటా పొడీ, రవ్వా చేసి వాటిని స్థానిక దుకాణాలకి వేసేవాడు. అయితే వాటితో ఏం చేసుకోవాలో తెలియక ఎవరూ పెద్దగా కొనేవాళ్లు కాదు.


అప్పుడు విటమిన్‌ ఇ, ఎ, సిలతోబాటు పాలీఫినాల్సూ, కాపర్‌, మాంగనీస్‌, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలన్నీ సపోటాలో ఉంటాయనీ; ఇవి ఆరోగ్యవంతమైన చర్మానికీ కండరాలూ కణజాలాల పెరుగుదలకీ తోడ్పడతాయనీ అవగాహన కలిగిస్తూనే ఐదారేళ్లపాటు సపోటాలతో చేయగల వంటలమీద పెద్ద పరిశోధనే చేశాడు మహేష్‌. అలా 2017 డిసెంబరులో ‘సబ్‌ కుచ్‌ చీకూ’ నినాదంతో మొదలైందే సపోటా పార్లర్‌. బర్పీ, కట్లీ, మోదక్‌, పెడా, హల్వా వంటి స్వీట్ల నుంచి ఐస్‌క్రీములూ టాఫీలూ మిల్క్‌షేక్‌ల వరకూ సర్వం సపోటామయమే. మిగిలిన స్వీట్లలోలా ఎక్కువ తీపి లేకుండా ఆరోగ్యకరమైన పద్ధతుల్లో చేసే ఈ సపోటా స్నాక్స్‌, డెజర్ట్‌ల రుచి మెల్లగా జనంలోకి వెళ్లింది. దాంతో పార్లర్ల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వీళ్ల ఆదాయం కోటి రూపాయల పైనే. ఎటు చూసినా సపోటా రుచులే కన్పించే ఆ పార్లర్లోకి అడుగుపెట్టిన వాళ్లు సపోటాకి ఇంత సీనుందా అని ఆశ్చర్యంతో నోరు తెరుస్తారంటే... అందులో సందేహమేముంది!

 

 

 


ఆదివాసీలు... అమెరికాకి సాయం చేశారు!

సాధారణంగా హాలీవుడ్‌ సినిమాల్లో... ప్రపంచానికి ఏ పెనుముప్పు వచ్చినా అమెరికన్లు రంగంలోకి దిగి అందర్నీ రక్షిస్తున్నట్టు చూపిస్తుంటారు కదా! అలాంటిది అమెరికాలోని జంతుజాలానికి ఓ పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు వాళ్లు భారత్‌వైపే చూడాల్సి వచ్చింది. అదీ ఇక్కడున్న ఓ ఆదివాసీ తెగవైపు. ఆ తెగకి చెందిన ఇద్దరు ‘హీరోలు’ అమెరికాలోని ఫ్లోరిడాకి వెళ్లి అక్కడి పర్యావరణానికి పెనుముప్పుగా మారిన కొండచిలువల పనిపట్టి మరీ వచ్చారు. అక్కడి శాస్త్రవేత్తలూ, సాంకేతిక నిపుణులెవరూ చేయలేనిదాన్ని తాము చేసి చూపారు!

ఎవర్‌గ్లేడ్స్‌... అమెరికాలోని ఫ్లోరిడాలో ఇదో పెద్ద అభయారణ్యం. పునుగుపిల్లిలాంటి ‘రకూన్‌’ జాతి కుక్కలూ, పులిలాగా ఉండే బాబ్‌క్యాట్‌ అనే పిల్లులూ, ఇతర మొసళ్లూ, జింకలకీ ఇది ప్రసిద్ధి. కాకపోతే గత పదేళ్లుగా అక్కడ ఈ జీవాల సంఖ్య భారీగా తగ్గింది. పరిశోధన చేస్తే... ఈ అరణ్యంలోకి 1980లలో వచ్చి చేరిన ఆసియా కొండ చిలువలకి అవి ఆహారం కావడమే కారణమని తేలింది. ఈ కొండచిలువల్ని ఒకప్పుడు ఫ్లోరిడాలోని ధనవంతులు భారత్‌, మయన్మార్‌ల నుంచి తీసుకెళ్ళి పెంచుకుంటుండేవారు. వాళ్ల దగ్గర్నుంచి తప్పించుకునో లేదా వాళ్లే వదిలేయడం వల్లో కొండచిలువలు ఎవర్‌గ్లేడ్స్‌ అరణ్యంలోకి చొచ్చుకెళ్లడం మొదలుపెట్టాయి. సాధారణంగా ఆసియాకి చెందిన పాములు ఫ్లోరిడాలోని చలికి తట్టుకోలేక చనిపోతుంటాయి కాబట్టి ఇవీ అలాగే అంతరిస్తాయనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ అలాకాలేదు.ఈ కొండచిలువలు అమెరికా వాతావరణానికి తగ్గట్టు తమని తాము మార్చుకుని ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. అక్కడున్న జంతువులేవీ వీటి పెరుగుదలని ఆపలేకపోయాయి. 2012లో వీటివల్ల ఏర్పడుతున్న ముప్పుని శాస్త్రవేత్తలు గుర్తించినా... అప్పటికే ఆలస్యమైపోయింది. అభయారణ్యంలో గడ్డి ఎక్కువ కాబట్టి వీటిని గుర్తించడం కష్టంగా మారింది. డ్రోన్లనీ, రేడియో ట్రాన్స్‌మిటర్లనీ, ఒక రకం వేటకుక్కలనీ ప్రయోగించి చూశారు కానీ ఏవీ ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. ప్రఖ్యాత సర్ప శాస్త్రవేత్తల్నీ, పాముల వేటగాళ్లనీ పిలిపించినా పనికాలేదు. అప్పుడే ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకుల దృష్టి తమిళనాడుకి చెందిన ‘ఇరుళ’ ఆదివాసీలపైన పడింది.

ప్రాణాలు కాపాడుతున్నారు...
‘ప్రపంచంలోని అత్యుత్తమ పాముల వేటగాళ్లు ఇరుళ తెగవారే...’ అనంటారు గత అరవైఏళ్లుగా వీళ్లతో కలిసి పనిచేస్తున్న ఇండో-అమెరికన్‌ సర్ప శాస్త్రవేత్త రోములస్‌ విటేకర్‌. తమిళనాడులో ఎన్నో తరాలుగా పాముల వేటనే జీవనాధారంగా చేసుకున్న ఆదివాసీలు వీళ్లు. ఓ చోటకి పాము వచ్చివెళ్లిన గంట తర్వాత కూడా వీళ్లు అది ఎట్నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్లిందో ఇప్పుడు ఎక్కడుందో కూడా చెప్పగలరు. అంతేకాదు ‘పాముని గుర్తుపట్టాక దాన్ని ఎక్కువ హింసకి గురిచేయకుండా వీళ్లు పట్టుకునే విధానం కూడా ఓ అద్భుతం...’ అంటాడు విటేకర్‌. ఆయన ఈ ఆదివాసీ కుటుంబాల చేత 1975లో ఓ సహకార సంఘాన్ని ఏర్పాటుచేయించాడు. దాని ద్వారా వీళ్లు పాముల్ని పట్టి వాటి విషం తీసి విరుగుడు మందు(యాంటీ వెనమ్‌) తయారుచేసే సంస్థలకి విక్రయించేలా ప్రోత్సహించాడు. నాటి నుంచీ గత 45 ఏళ్లుగా మనదేశంలోని విరుగుడు మందుల తయారీకి కావాల్సిన 80 శాతం విషాన్ని ఈ ఆదివాసీలే సరఫరా చేస్తున్నారు. తమ సహకార సంఘం ద్వారా ఏడాదికి 20 లక్షల మందు బాటిళ్ల(వయల్స్‌) తయారీకి కావాల్సిన విషాన్ని అందిస్తూ... ఏడాదికి కోటిన్నర టర్నోవర్‌ సాధిస్తున్నారు. మనదేశంలో ఏటా మూడు లక్షల మంది విషసర్పాల కాటుకి గురవుతున్నారని అంచనా. వాళ్లలో 45 వేల మంది చనిపోతున్నారట. మిగతావాళ్లలో ఎక్కువశాతం మంది బతికి బట్టకట్టడానికి ఈ ఆదివాసీలు అందిస్తున్న విషమే కారణమని చెప్పాలి!  ఈ నేపథ్యంలోనే తమకి తలనొప్పిగా మారిన కొండచిలువల్ని అంతమొందించేందుకు సాయం రావాలంటూ ఫ్లోరిడా ప్రభుత్వం వీరిని సంప్రదించింది.

పట్టేశారంతే...!
చెన్నై నుంచి మాసి, వడివేలు అనే ఇద్దరు ఇరుళ తెగవాళ్లు రోములస్‌తోపాటూ ఫ్లోరిడాకి వెళ్లారు. వెళ్లిన మూడో రోజు నుంచే కొండచిలువల ఆనుపానుల్ని తమదైన సంప్రదాయ విజ్ఞానంతో పట్టుకోవడం ప్రారంభించారు. అభయారణ్యంలో శిథిలమైపోయున్న ఓ పాత మిస్సైల్‌ పరీక్షా కేంద్రంలోని టన్నెల్స్‌లో గుట్టలుగుట్టలుగా ఉన్న పాముల్ని కనిపెట్టారు. 15 నుంచి 20 మీటర్ల పొడవున్న వాటినీ లాఘవంగా పట్టి బయటకు తేవడం పెద్ద సంచలనమే సృష్టించింది. అక్కడి మీడియా వీళ్లని ‘హీరోలుగా’ అభివర్ణిస్తూ వేనోళ్లా కొనియాడింది. తాము అక్కడున్న నెల రోజుల్లో దాదాపు నలభై పెద్ద కొండచిలువల్ని పట్టి తెచ్చి రికార్డు సృష్టించారు! ఫ్లోరిడా ప్రభుత్వం వీళ్లకి ఐదు లక్షల రూపాయల నగదు బహుమతీ అందించింది. అంతేకాదు, అక్షరం కూడా రాని వీళ్ల చేత తమ శాస్త్రవేత్తలూ, విద్యార్థులకి గెస్ట్‌ లెక్చర్లూ, శిక్షణా తరగతులూ ఇప్పించింది. ఇదంతా జరిగి ఏడాదిన్నర అవుతోంది. మాసి, వడివేలు చెన్నైకి తిరిగొచ్చేసినా... ఇప్పటికీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాఠాలు చెబుతూనే ఉన్నారు!


కుర్రాళ్ళకి కిర్రెక్కిస్తున్న కొత్త సాహసం!

కొండల్లో చేసే సాహసాలు అనగానే మనకి ఇప్పటిదాకా రాక్‌ క్లైంబింగ్‌, రాపెల్లింగ్‌, బంగీ జంప్‌ల్లాంటివే తెలుసు. సాహసాలు కోరుకునే యువతకి వీటిని మించిన కిక్కిస్తానంటోంది ‘హైలైనింగ్‌’. ఒళ్లు గగుర్పొడిచే ఈ సాహసక్రీడ వెనకున్న విశేషాలివి...

పైన ఆకాశం... కింద వేల అడుగుల లోతున నేల... మధ్యలో మనం... మన పాదాలకింద కేవలం అంగుళం మందం ఉన్న తాడు... రెండు కొండశిఖరాల మధ్య కట్టిన ఆ తాడుపైన శరీరాన్ని బ్యాలన్స్‌ చేస్తూ నడక... ఆ ఊహే ఎంతో భయపెడుతోంది కదూ! మనదేశంలోని కొందరు యువకులకి మాత్రం అది భలే కిక్కిస్తోంది. పట్టుతప్పితే ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా... కొండల మధ్య సాహసాలకి సై అనిపిస్తోంది. వాళ్లని హైలైనింగ్‌ వైపు నడిపిస్తోంది. విదేశాల్లో ఎప్పటి నుంచో ఉన్న ఈ హైలైనింగ్‌ క్రీడ పదేళ్లకిందటే మనదేశంలోకి వచ్చింది. గత నాలుగేళ్ల నుంచీ వీటి కోసం ప్రత్యేకంగా క్రీడోత్సవాలు నిర్వహించేంతగా యువతని ఆకట్టుకొంటోంది. ఈ ఉత్సవాల్లో పుణె దగ్గర లోనవాలా వేదికగా ప్రతి ఏటా డిసెంబర్‌ 31న నిర్వహించే ‘బిట్వీన్‌ ఇయర్స్‌ ఫెస్టివల్‌’ అతిపెద్దది. ఇందులో దేశవిదేశాల నుంచీ 250 మంది పాల్గొంటున్నారు. సమర్‌ ఫరూఖీ దీని నిర్వాహకుడు. ఈ సాహసక్రీడని న్యూజిలాండ్‌లో నేర్చుకుని, ‘శ్లాక్‌లైఫ్‌ ఇంక్‌’ అనే సంస్థని ఏర్పాటుచేసి ముంబయి కేంద్రంగా శిక్షణ అందిస్తున్నాడు సమర్‌. మొదట్లో అతను కొండల మధ్య ఇలా తాడుకట్టుకుని నడవడం చూసి ముంబయి పోలీసులు అరెస్టు చేశారట కూడా! 2014లో పోలండ్‌లో జరిగిన ప్రపంచ హైలైనింగ్‌ పోటీల్లోనూ పాల్గొని వచ్చిన సమర్‌ క్రీడాస్ఫూర్తిని మెచ్చుకుని క్రికెటర్‌ మురళీ విజయ్‌ ‘బిట్వీన్‌ ఇయర్స్‌’ క్రీడోత్సవాలకి స్పాన్సర్‌షిప్‌ అందిస్తున్నాడు. బిట్వీన్‌ ఇయర్స్‌ స్థాయిలో కాకున్నా కర్ణాటకలోని బాదామి, హంపీ, పుదుచ్చేరిలోని ఆరోవిల్లే, కేరళ మున్నారు, గోవాల్లోనూ ఏడాది పొడవునా క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు.

హైలైనింగ్‌లో కొండల మధ్య ఇరవై నుంచీ రెండువందల మీటర్లదాకా నడుస్తుంటారు. నడిచేటప్పుడు చేతులకి ఊతమూ, శరీరానికి దన్నూ లేకున్నా కాళ్లకీ తాడుకీ మధ్య ఓ కొక్కీ ఉంటుంది... బ్యాలన్స్‌ తప్పితే కింద లోయలోకిపడిపోకుండా ఇది కాపాడుతుంది. అసలు కొక్కీలేవీ వాడకుండానే నడిచే ‘ఫ్రీ సోల్‌’ పోటీలూ, కళ్లకి గంతలు కట్టుకుని మరీ తాడుపైన వెళ్లే ‘బ్లైండ్‌ ఫోల్డెడ్‌’ పోటీలూ ఉన్నా వాటిని క్రీడోత్సవాల్లో అనుమతించడంలేదు. ప్రస్తుతానికి అవి వ్యక్తిగత పోటీలకే పరిమితం!

 


అంకురాల విప్లవం... ఫ్లిప్‌కార్ట్‌ మాఫియా!

భారతీయ అంకుర సంస్థల్లో ఫ్లిప్‌కార్ట్‌ది ప్రత్యేక స్థానం. రూ.లక్ష కోట్ల ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్‌ కొనుగోలు ఒప్పందం ఓ మైలురాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ కథ అక్కడితో ముగిసిపోలేదు. సంస్థ వ్యవస్థాపకులూ, మాజీ ఉద్యోగులూ స్టార్టప్‌ వ్యవస్థలో మరెన్నో విజయవంతమైన కంపెనీల్ని నెలకొల్పుతున్నారు. ‘ఫ్లిప్‌కార్ట్‌ మాఫియా’గా పిలిచే సంస్థ మాజీ ఉద్యోగులు భాగంగా ఉన్న అంకురాల సంఖ్య వందల్లో ఉంది!

సిలికాన్‌ వ్యాలీ కంపెనీ ‘పేపాల్‌’ని ఈబే సంస్థ 2002లో కొనుగోలు చేసింది. దానిద్వారా వచ్చిన డబ్బుతో పేపాల్‌ సహ వ్యవస్థాపకులు అంకుర సంస్థల్ని ప్రారంభించడమో, కొత్తవాటిలో పెట్టుబడులు పెట్టడమో చేశారు. వారికే ‘పేపాల్‌ మాఫియా’ అని పేరు. ఉబర్‌, ఎయిర్‌ బీఎన్‌బీ, లింక్డిన్‌, యూట్యూబ్‌, టెస్లా, యల్ప్‌... మొదలైన ప్రపంచ ప్రసిద్ధ సంస్థల వెనక పేపాల్‌ మాఫియా ఉంది. అలాంటి కథే భారత్‌లో ఫ్లిప్‌కార్ట్‌ మాఫియా రాస్తోంది. 300కిపైగా కంపెనీల్లోఫ్లిప్‌కార్ట్‌ మాఫియా ప్రారంభించిందని అంచనా. 2007లో ప్రారంభమైన  ఫ్లిప్‌కార్ట్‌ 2014నాటికి రూ.40వేల కోట్ల విలువైన కంపెనీగా గుర్తింపు సాధించింది. దాంతో  2015-2017 మధ్య సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న అనేకమంది బయటకు వెళ్లి అంకుర సంస్థల్ని ప్రారంభించారు.

ఉడాన్‌ మరో యూనికార్న్‌...
పెద్ద వ్యాపారులు తమ ఉత్పత్తుల్ని మధ్యస్థాయి, చిరువ్యాపారులకు టోకున అందించే వేదిక ఉడాన్‌. ఫ్లిప్‌కార్ట్‌ మాజీ ఉద్యోగులు సుజీత్‌ కుమార్‌(ప్రెసిడెంట్‌ ఆపరేషన్స్‌), అమోద్‌ మాలవియా(చీఫ్‌ టెక్నాలజీ
ఆఫీసర్‌), వైభవ్‌ గుప్తా(సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌) 2016లో ఉడాన్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న 25 వేల అమ్మకందార్లని 30 లక్షల కొనుగోలుదార్లతో కలుపుతోంది. వ్యాపారులకు రుణాలూ ఇస్తుంది. ఈ కంపెనీ విలువ రూ.20వేల కోట్లు. ఫ్లిప్‌కార్ట్‌ మాఫియా ప్రారంభించిన అతిపెద్ద అంకుర సంస్థ ప్రస్తుతానికి ఇదే. ఫ్లిప్‌కార్ట్‌లో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా పనిచేసిన అంకిత్‌ నాగోరి, హెడ్‌ ఆఫ్‌ కామర్స్‌ హోదాలో పనిచేసిన ముకేశ్‌ బన్సాల్‌ 2016లోనే ఫ్లిప్‌కార్ట్‌ని వదిలి బయటకు వచ్చి ఆరోగ్యం, వ్యాయామ విభాగంలో పనిచేస్తున్న ‘క్యూర్‌ఫిట్‌’ను ప్రారంభించారు. ముకేశ్‌ బన్సాల్‌ మింత్రా వ్యవస్థాపకుడు కూడా. ఈ సంస్థకు ప్రారంభంలో ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్‌, అదే సంస్థకు చెందిన మింత్రా మాజీ సీఈఓ అనంత్‌ నారాయణన్‌ నుంచి పెట్టుబడి అందడం గమనార్హం. మెట్రో నగరాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.5600 కోట్లు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన లలిత్‌ కెశ్రే ఫ్లిప్‌కార్ట్‌లో ‘గ్రూప్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌’ హోదాలో పనిచేసేవాడు. సొంత కంపెనీ ప్రారంభిద్దామన్న ఆలోచనని సహోద్యోగులు హర్ష్‌ జైన్‌, నీరజ్‌ సింగ్‌, ఇషాన్‌ బన్సాల్‌లతో పంచుకున్నాడు. వారు సరేననడంతో 2016 మేలో ‘గ్రో’ అనే సంస్థను పెట్టాడు. వెబ్‌సైట్‌, ఆప్‌ద్వారా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం ఇచ్చే వేదిక ఇది. దీని ప్రస్తుత విలువ రూ.4000 కోట్లపైనే. ఫ్లిప్‌కార్ట్‌లో చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ హోదాలో పనిచేశారు పుతిన్‌ సోనీ. తర్వాత ‘సుకీ’ పేరుతో వైద్య రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే యంత్రాల్ని అభివృద్ధి చేసే కంపెనీని ప్రారంభించారు.

ఆర్థిక ఆసరా...
కంపెనీలు పెట్టడమే కాదు, పెట్టుబడి పెడుతూ కూడా మరిన్ని సంస్థలకు ఆర్థిక చేయూతనిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌ మాఫియా. ఫ్లిప్‌కార్ట్‌ మాజీ ఉద్యోగులైన మెకిన్‌ మహేశ్వరి, కార్తిక్‌రెడ్డి ‘బ్లూమ్‌ వెంచర్స్‌’ పెట్టుబడి సంస్థలో భాగంగా ఉంటూ అంకుర సంస్థలకు నిధులు అందిస్తున్నారు. సచిన్‌, బిన్నీ ఫ్లిప్‌కార్ట్‌ని నడుపుతున్న సమయంలో ఆ సంస్థ కూడా అనేక అంకురాల్లో పెట్టుబడులు పెట్టింది. సచిన్‌ వ్యక్తిగతంగా 20కిపైగా అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు. వాటిలో జోపర్‌, టీమ్‌ ఇండస్‌, క్లోజీ, అన్‌ అకాడమీ, ట్రూ హెచ్‌బీ, ఇన్‌ షార్ట్స్‌, స్పూన్‌ జాయ్‌ లాంటి సంస్థలు ఉన్నాయి. వీటిలో సగంవరకూ ఫ్లిఫ్‌కార్ట్‌ మాజీ ఉద్యోగులు ప్రారంభించినవే. మరో సహ వ్యవస్థాపకుడు బిన్నీ కూడా 20కిపైగా సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు. ఫ్లిప్‌కార్ట్‌లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేసిన రవి గరికపాటి ‘డేవింటా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌’ పేరుతో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీని ప్రారంభించాడు. ఈ సంస్థ చిన్న, మధ్య తరహా వ్యాపారులకు రుణాలు ఇస్తోంది. టెక్‌ అంకురాల విభాగంలో అద్భుతంగా రాణిస్తోన్న క్రియో, సెల్లర్‌ వర్క్స్‌, కనెక్ట్‌ ఎకో, పర్హై, అర్జూ, హేన్సెల్‌... సహా మరెన్నో సంస్థలు ఫ్లిప్‌కార్ట్‌ మాఫియా ప్రారంభించినవే. వీటిలో కొన్నైనా ఫ్లిప్‌కార్ట్‌ని మించిన కంపెనీలు అవుతాయనడంలో సందేహం లేదు!

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.