close
వైవిధ్యభరితం

జీవన సంఘర్షణల నుంచి తీసుకున్న సంఘటనలతో సహజంగా సాగే కథలకు వర్ణనలూ సంభాషణలూ వన్నెతెచ్చాయి. ‘జనం బ్యాక్టీరియాలా కదులుతున్నారు..., అతడికి నిద్రలేచిన వెంటనే చచ్చిపోవాలనిపించింది’ వంటి వాక్యప్రయోగాలు కొత్తగా కన్పిస్తాయి. కడుపునిండటానికి తిండి కావాలే తప్ప సిద్ధాంతాల రాద్ధాంతాలు కాదని ‘ఇడ్లీ పొట్లం’ కథలో రచయిత చమత్కారంగా చెబుతారు. ‘నోటుమీద గాంధీతాత అమాయకంగా ఉన్నాడు. ఇన్నేళ్లుగా కరెన్సీ నోట్లమీదే ఉంటున్నా, ఆయన ఆర్థికంగా ఏమీ
ఎదగనట్లుగానే ఉన్నాడు’ అనిపిస్తారు కథలోని ఓ పాత్రతో. గాలివాన, అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ తదితర కథల్లో పాత్రలను మలిచిన తీరూ బిగుతైన శైలీ ఆకట్టుకుంటాయి.

- నీలి వేణుగోపాల్‌

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌
రచన: డా.ఎయం.అయోధ్యారెడ్డి
పేజీలు: 160; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 9399962117


జీవన తరంగాలు

అనుభూతి పరిమళం తోడైన కవనం ఇది. ‘మంచితనం పంచుగుణం- మానవత పెంచు ధనం’ అని చెప్పడంలో మానవీయ విలువలకు పట్టం కట్టారు కవి. ‘మనుగడంటే సుఖమే కాదు దుఃఖం సైతం తప్పదుకదా’ అనే పంక్తులు స్థితప్రజ్ఞతను సూచిస్తాయి. ‘ధర్మం పరిమాణంలో పరిమితమైనా, అపరిమితమైన ఆనందాన్ని అందిస్తుంది’ అని తేల్చిచెప్పారు. ‘మనసు మురవాలన్నా మాధుర్యం కురవాలన్నా జనసమూహంతో కలిసి నడవాల్సిందే’ అంటూ సమైక్యజీవన తత్వాన్ని ఆస్వాదించాల్సిన వైనాన్ని ప్రకటించారు. ‘ఎదగాలన్న కాంక్ష ఉత్సాహపరుస్తుంది- ఎలాగైనా ఎదగాలన్న తీరు ఎంతకైనా దిగజారుస్తుంది’ వంటి జీవనసత్యాలతో కవితలు అలరిస్తాయి..

- విద్వత్‌ శ్రీనిధి

నిరంతర చిరునామా (కవిత్వం)
రచన: డా।।కొల్లు రంగారావు
పేజీలు: 112; వెల: రూ. 80/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


పల్లె పరిమళం

తెలుగుదనం నిండిన నవల ‘వెండిగిన్నెలో పాలబువ్వ’. పల్లె బతుకుల అమాయకత్వానికీ పట్నవాసుల స్వభావాలకీ అద్దంపడుతుంది. ఎవరు ఎక్కడున్నా, మమకార అహంకారాలు ఎవరివి వారివే. కాకుంటే సంక్రాంతి వంటి పండగ సందర్భాల్లో గ్రామాల కళ పట్టణాలకు ఎంత రమ్మన్నారాదు. ‘పిల్లలకి మన ఊళ్ల ఇళ్లూవాకిళ్లను పండగలప్పుడు కాకుండా ఇంకెప్పుడు చూపిస్తావ్‌’ అన్న పెద్దమ్మ మాటతో మొదలుపెట్టి పల్లెతోటల్లో పిల్లల ఆటలు, కాలువల్లో ఈతలతో కథనం హాయిగా సాగుతుంది. కోడిపందాలు, బొమ్మల కొలువులు, ముగ్గుల సందళ్లన్నీ అయ్యాక తిరుగు ప్రయాణమవుతారు. ‘గ్రామీణ మమతల పరిమళాల్ని పట్టణానికి తీసుకెళుతున్నా’మనడంతో నవల ముగుస్తుంది.

- శరత్‌

వెండిగిన్నెలో పాలబువ్వ (నవల)
రచన: సింహప్రసాద్‌
పేజీలు: 160; వెల: రూ. 70/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఈ పిల్లలున్నారే..!

పిల్లల కోణంలో పెద్దల ప్రపంచాన్ని చూపిస్తుంది ‘ఈ పెద్దాళ్లున్నారే...’ కథల సంపుటి. ఇందులో కథలన్నీ చిన్నారుల కోణంనుంచి రాసినవే. ‘ఒక అమ్మానాన్నా...’ కథలో తమ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు నడివయసు దంపతులు. అన్నింటిలోనూ తమను అనుసరించమని చెప్పే అమ్మానాన్నల్ని ఈ విషయంలోనూ అనుసరిస్తానని అమాయకంగా చెబుతుంది ఓ చిన్నారి. దాంతో అమ్మకు పట్టరాని కోపం వస్తుంది. ‘ఒక లా గుణింతం’ కథలో ‘ర’ని ‘ల’గా చదివే ‘లవి’ తన కష్టాల్ని చెప్పిన తీరు తెగ నవ్విస్తుంది. పిల్లలకి పెద్దల విషయాలు ఏమీ తెలియవనీ, వారు గమనించడంలేదనీ అనుకుంటుంటారు చాలామంది. పెద్దల సంభాషణల్ని పిల్లలు ఎంతలా గమనిస్తారో చెప్పే కథ ‘ఒక లాభాలు’. స్వలాభం లేనిదే ఈ ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయరని కూడా ఇది చెెబుతుంది. పిల్లలదిగా కన్పించే ఈ పెద్దల పుస్తకంలో కథలన్నీ కడుపుబ్బా నవ్విస్తూనే ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు’ అంటూ సుతిమెత్తగా చురక అంటిస్తాయి.

- చంద్ర

ఈ పెద్దాళ్లున్నారే...
రచన: బమ్మిడి జగదీశ్వరరావు
పేజీలు: 136; వెల: రూ.80/-
ప్రతులకు: ఫోన్‌- 9490746614

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.