close

అపోలో పల్లెబాట!

ప్రభుత్వ ఆస్పత్రులంటే- సమయానికి వైద్యులు ఉంటారో ఉండరో, సరైన వైద్యం అందుతుందో లేదో... ఎన్నో సందేహాలు. కార్పొరేట్‌ ఆస్పత్రులంటే- అమ్మో, ఆ ఖరీదైన వైద్యం సంపన్నులకే కానీ సామాన్యులకు సాధ్యమా... అన్న అనుమానం. ఆ అనుమానం అక్కర్లేదంటూ ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి పల్లెబాట పట్టింది. ప్రజల ముంగిటికే ఆధునికవైద్య వసతుల్ని తీసుకెళ్తోంది. రోగాలు వచ్చేదాకా ఎందుకు, రాకుండానే చూసుకుందామంటూ మొత్తంగా ఆ పల్లె ప్రజల జీవన విధానాన్నే మార్చేస్తోంది. సామాజిక బాధ్యతగా అపోలో చేపట్టిన ఓ పథకం చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని పల్లెల్లో సంపూర్ణ ఆరోగ్యానికి అర్థం చెబుతోంది.

‘తనకేమన్నా అయితే...’ ఎంత మర్చిపోదామన్నా భారతికి ఆ సంఘటన మరపునకు రావటంలేదు. ఇంకొన్నాళ్లు అలాగే గడిపి ఉంటే ముసలి అమ్మానాన్నలూ చదువు పూర్తికాని ఇద్దరు పిల్లలూ అనాథలయ్యేవారు. ‘దేవుడే పంపించినట్లు సమయానికి వారు రాబట్టి సరిపోయింది కానీ...’ అని రోజుకోసారైనా అనుకుంటూనే ఉంటుందామె.

భారతికి నలభై ఐదేళ్లు. భర్త వదిలేసి పోయాడు. పొలమూ ఆస్తులూ ఏమీ లేవు, రెండు ఆవుల్ని పెట్టుకుని పాలమ్మగా వచ్చిన డబ్బుతో కష్టమ్మీద ఇల్లు గడుపుతోంది. చాలా రోజులుగా ఒంట్లో నలతగా ఉంటే పంటి బిగువున భరించడమే తప్ప ఆస్పత్రికి వెళ్లే ధైర్యం చేయలేదు. అలాగే ఇంకొన్నాళ్లు కొనసాగితే ఏమయ్యేదో కానీ ఆమె ఉంటున్న ఊరికే ఆస్పత్రి వచ్చింది. ఒక్కొక్కరినీ పేరుపేరునా పిలిచి పరీక్షలు చేసింది. భారతికి సర్వైకల్‌ క్యాన్సర్‌ ఉందని ఆ పరీక్షలో తేలింది. వణికిపోయిన ఆమెకు పర్వాలేదు తగ్గిపోతుందని అక్కడి సిబ్బందే ధైర్యం చెప్పారు. టౌన్లో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి ఆపరేషన్‌ చేయించారు. ఇప్పటికీ క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తూ ఆమె ఆరోగ్యానికి తాము భరోసా అన్నట్లుంటారు. రూపాయి ఖర్చులేకుండా క్యాన్సర్‌ నుంచి విముక్తి పొందానంటే అది వారి చలవేనంటుంది భారతి.

రామయ్యది మరో కథ. పొలం పనులన్నీ ఒంటిచేత్తో చేసుకునేవాడు. అలాంటిది ఆ మధ్య ఉండుండీ కళ్లు మసకేసినట్లు అవుతోంటే వయసు పెరుగుతోంది కదా అనుకున్నాడు. మొబైల్‌ హెల్త్‌చెకప్‌ వ్యాన్‌ ఓ రోజు వాళ్ల ఊరు వచ్చింది. అందరితో పాటు రామయ్య కూడా వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. అతడికి షుగర్‌ చాలా ఎక్కువగా ఉంది. ఇంకొన్నాళ్లయితే గుండె, కిడ్నీల మీదా ఆ దెబ్బ పడేదే. డాక్టరు అతడిని కూర్చోపెట్టి క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరాన్నీ ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తల్నీ వివరించారు. ఆయన చెప్పినట్లే చేసిన రామయ్య షుగర్‌ని అదుపులోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడతను రోజూ ఉదయాన్నే లేచి వాకింగ్‌కి వెళ్తాడు, యోగా చేస్తాడు. వాటివల్లే ఎలాంటి ఆందోళనలూ లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నానంటాడు రామయ్య. భారతి, రామయ్య లాంటి వాళ్లు ఆ ఊళ్లలో ఇంకా ఎందరో..!

ఐదారేళ్ల క్రితం వరకూ తవణంపల్లె మండలంలో ఉన్న దాదాపు రెండొందల పల్లెలకీ రాష్ట్రంలోని మిగతా పల్లెలకీ ఏమంత తేడా ఉండేది కాదు. చాలా కాన్పులు ఇళ్ల దగ్గరే అయ్యేవి. పురిట్లోనే బిడ్డ పోతే... ప్రాప్తం లేదనుకుని నిట్టూర్చేవారు. గర్భిణుల్లో, పాలిచ్చే తల్లుల్లో, పెరిగే పిల్లల్లో, వృద్ధుల్లో... పోషకాహారలోపమో రక్తహీనతో లేనివారు అరుదు. ఐదేళ్లొచ్చిన పిల్లలందరినీ బడిలో చేర్చినా యుక్తవయసు వచ్చేసరికి బడికెళ్లే ఆడపిల్లల సంఖ్య సగానికి సగం తగ్గిపోయేది. బడిలో సరైన టాయ్‌లెట్లుండవు. చాలా మందికి ఇళ్లల్లోనూ ఉండవు. తాగడానికి మంచినీళ్లూ ఉండేవి కావు. కష్టపడి పెద్ద చదువులు చదువుకున్నవారు నగరాల్లో ఉద్యోగాలు చేసేవారు కానీ పదో ఇంటరో చదివి మానేసిన వాళ్లు అటు వ్యవసాయమూ చేయలేక ఇటు తాము చేయగల ఉద్యోగమూ లేక ఖాళీగా తిరుగుతుండేవారు. వయసు పైబడినవారికి మనసు నిండా బాధ్యతలు తొలిచేస్తుంటే ఇక, శరీరాన్ని పట్టించుకునే తీరిక ఎక్కడ. అందుకే ప్రాణం మీదికి వచ్చేదాకా ఆస్పత్రి మొహం చూసేవారు కాదు... ఏళ్ల తరబడి ఏ పల్లెలో చూసినా అదే పరిస్థితి.

అలాంటి చోటికి ఓరోజు కొందరు వచ్చారు. ప్రతి గడపకీ తిరిగి కుటుంబసభ్యుల వివరాలన్నీ రాసుకున్నారు. పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రి నుంచి వచ్చామన్నారు. ఆ ఆస్పత్రి తమ మండలంలో పుట్టిపెరిగిన వ్యక్తి పెట్టిందేనని ఆ ఊళ్లలోని చాలామందికి తెలుసు. అందుకే ఆనందంగా సహకరించారు. ఫలితం... ఇప్పుడు తవణంపల్లె మండలంలోని ఊళ్లకీ ఇతర మండలాల్లోని ఊళ్లకీ మధ్య చాలా తేడా ఉంది. ఏమిటా తేడా అంటే...

తొలి శ్వాస నుంచి...
అపోలో ఆస్పత్రి వ్యవస్థాపకుడైన ప్రతాపరెడ్డి సొంతూరు తవణంపల్లె మండలంలోని అరగొండ గ్రామం. అక్కడ ఓ నర్సింగ్‌ కళాశాలనీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలనీ పెట్టిన ఆయన పుట్టిన ఊరి రుణం తీర్చుకున్నాననీ అంతటితో తన బాధ్యత తీరిపోయిందనీ అనుకోలేదు. ఆరోగ్యరంగంలో తమ ఆస్పత్రులు అందిస్తున్న సేవల్ని ఎక్కడెక్కడినుంచో విదేశీయులూ వచ్చి పొందుతున్నప్పుడు తన ఊరివారికి మాత్రం ఆ సేవలు ఎందుకు అందించకూడదూ అనుకున్నారు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే- ‘సంపూర్ణ ఆరోగ్యం’ అన్న పథకం. తల్లి కడుపులో బిడ్డ ఊపిరిపోసుకుంది మొదలు వృద్ధాప్యంతో చివరి శ్వాస వదిలే వరకూ మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం అంటే కేవలం భౌతికం కాదు, మానసికం, సామాజికం, ఆధ్యాత్మికం... అన్నిరకాలుగానూ- అప్పుడే అది సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది. వచ్చే అవకాశమున్న రోగాల్ని రాకముందే కనిపెట్టాలి. రాకుండా నివారించాలి. అందుకు- అనువైన పరిసరాలూ మంచి ఆహారమూ ఉపాధికి ఊతమూ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు ఆ ఊళ్లు ఆరోగ్యానికి చిరునామాలవుతాయి. ఆనందానికి కేరాఫ్‌ అడ్రసులవుతాయి. అలాంటి ఊళ్లను తయారుచేయడానికి అపోలో నిపుణులు ఒక పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు... అమలుచేశారు.

ఇంటింటి సర్వే
ప్రణాళికలో మొదటి దశ- ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పద్ధతిలో ప్రశ్నలు రాసుకున్నారు. 2013 నాటి సంగతిది. మొత్తం ముప్ఫైవేలమందిని ప్రశ్నించి సేకరించిన సమాచారం ఆధారంగా సంపూర్ణ ఆరోగ్యానికి అంచెలంచెల ప్రణాళిక వేసి కార్యాచరణ మొదలుపెట్టారు. అందులో తొలి లక్ష్యం- అప్పటికే ఉన్న అనారోగ్యాల్ని పారదోలడం. అందుకుగానూ మొబైల్‌ హెల్త్‌వ్యాన్లలో వైద్యసిబ్బంది పల్లెలకు వెళ్లారు. అందరికీ వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య గుర్తింపు కార్డులు ఇచ్చారు. ప్రతి వ్యక్తి వయసునీ అలవాట్లనీ ఆరోగ్య సమస్యల్నీ దృష్టిలో పెట్టుకుని అవసరమైన పరీక్షలు చేశారు. ఆ పరీక్షలు ఎన్నో విషయాల్ని వెల్లడించాయి.

గుండెజబ్బులూ మధుమేహమూ క్యాన్సర్లూ లాంటి జీవనశైలి వ్యాధులు నగరాల్లోని వారికే వస్తాయని ఒక అపోహ. ఈ సర్వే ఫలితాలు దాన్ని పటాపంచలు చేశాయి. రెండు వేలమందికి మధుమేహం తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలిసింది. క్షయ తదితర వ్యాధుల గురించి 400 మందికి చేసిన పరీక్షల్లో కొంతకాలం చికిత్స పొంది వ్యాధి పూర్తిగా నయం కాకముందే కొందరు చికిత్స ఆపేసినట్లు వెల్లడైంది. వారికి ఏ క్షణానైనా వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంది. రెండు హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులూ బయటపడ్డాయి.

దాదాపు మూడున్నర వేల మంది మహిళలకు పరీక్షలు చేయగా వారిలో పదిహేడు మందికి క్యాన్సర్లు బయటపడ్డాయి. వారందరికీ అవసరమైన శస్త్రచికిత్సలని నెల్లూరు, చెన్నైలలోని తమ ఆస్పత్రుల్లో ఉచితంగా చేయించింది అపోలో టోటల్‌ హెల్త్‌ విభాగం.

అత్యవసరంగా పట్టించుకోవాల్సిన విషయం కాబట్టి తొలి ప్రాధాన్యం ఇచ్చి బయటపడిన రోగాలకు చికిత్సలు చేయించారు. తర్వాత దశ అసలు రోగాలే రాకుండా నివారించడం- అందుకు పలుకోణాల్లో కార్యక్రమాల్ని విస్తరించారు.

తల్లీబిడ్డల ఆరోగ్యం
గర్భిణులు ఆరోగ్యంగా ఉంటే కాన్పు సులభమవుతుంది. పండంటి పిల్లలు పుడతారు. కానీ పోషకాహార లోపంతో ఉంటే తల్లికీ బిడ్డకూ కూడా ప్రమాదం. గ్రామాల్లో పరిస్థితి అదే. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలంటే బస్సెక్కి పట్టణానికి వెళ్లాలి. వెంట మరొకరు తోడుండాలి. అంత శ్రమ ఎందుకని ఇంట్లోనే ఉండిపోయేవారు. ఇప్పుడలా కాదు... మొబైల్‌ వ్యాన్లలో ఊరూరా తిరిగే టోటల్‌ హెల్త్‌ బృందంలోని వైద్యులు పదిహేను రోజులకోసారి గర్భిణులను పరీక్షిస్తారు. పల్లెల్లో ఏర్పాటుచేసిన పోషకాహార కేంద్రాల ద్వారా వారికి బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తారు. పాలూ గుడ్డూ ఖర్జూరాలూ పల్లీ చిక్కీలూ లాంటివి అందులో ఉంటాయి. నిజానికి అంగన్‌వాడీల ద్వారా ప్రభుత్వం కూడా గర్భిణులూ బాలింతలకోసం పోషకాహారాన్ని సరఫరా చేస్తుంది. ఎంతైనా అమ్మలు కదా... దాన్ని తీసుకెళ్లి ఇంటిల్లిపాదికీ పంచి పెట్టేస్తున్నారు. దాంతో పథకం అసలు ఉద్దేశం నెరవేరడంలేదు. ఇదంతా గమనించిన టోటల్‌ హెల్త్‌ బృందం ఆహారాన్ని ఇంటికి ఇవ్వకుండా న్యూట్రిషన్‌ సెంటర్లను నెలకొల్పి వారు రోజూ మధ్యాహ్న భోజనం అక్కడే చేసే ఏర్పాటుచేసింది. అలాగని వారు మొహమాటపడకుండా ఆ సమయాన్ని గృహిణులు అందరూ కలుసుకుని ఆనందంగా గడిపే సమయంగా మార్చేసింది. నెలలు నిండిన వారికి సీమంతం చేయడం, గోరింటాకు పెట్టడం లాంటివి చేస్తూ అదే సమయంలో తల్లులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ తెలియజేస్తారు. సుఖప్రసవానికి యోగా నేర్పిస్తారు. కాన్పులన్నీ తప్పనిసరిగా ఆస్పత్రిలో అయ్యేలా చూడడంతో ఒకప్పుడు 18 ఉన్న శిశుమరణాల రేటు ఇప్పుడు సున్నా అయింది. కాన్పు అయ్యాక రెండేళ్ల వరకూ తల్లీబిడ్డలకు పోషకాహారాన్ని అందిస్తారు. పసిపిల్లల ఆరోగ్యాన్ని తల్లులే జాగ్రత్తగా పర్యవేక్షించుకోగలిగేలా అవసరమైన శిక్షణే కాక థర్మామీటర్‌ లాంటి పరికరాలూ ఇస్తారు. అలా... తొలి దశ గాడిలో పడింది.

ఆరోగ్య రక్షకులు
తల్లీబిడ్డా ఆరోగ్యం తర్వాత చూడాల్సింది బడిఈడు పిల్లల బాగోగులు. అంగన్‌వాడీలూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడువేల మందికి పైగా పిల్లలకూ ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైనవారికి చికిత్సలూ చేయించారు. ఆ తర్వాత బడులలో మౌలిక వసతులపైన దృష్టి పెట్టి మరుగుదొడ్లు కట్టించి పిల్లలందరూ వాటిని వినియోగించేలా చూస్తున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడమే కాక బల్లలూ ఇతరత్రా సౌకర్యాలూ ఏర్పాటుచేసి పాఠశాలల ఆవరణలో తోటలను పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. డెటాల్‌ తయారీ సంస్థతో ఒప్పందం చేసుకుని ‘ఆరోగ్య రక్షక్‌’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. చేతుల్ని శుభ్రం చేసుకోవడమూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమూ అంటువ్యాధుల నివారణకు ఎలా తోడ్పడుతుందో పిల్లలకు వివరిస్తున్నారు. వారికి ఉచితంగా హ్యాండ్‌వాష్‌ ద్రావణాలను సరఫరా చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ప్రవర్తన పిల్లలకు ఒకసారి అలవాటైతే చాలు, జీవితకాలం వారు దానిని పాటిస్తారు. చుట్టూ ఉన్నవారినీ పాటించేలా చేస్తారు. అందుకే మూడేళ్ల వ్యవధిలో అన్ని పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలసరి సమయంలో ఇబ్బంది పడకుండా ఆడపిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటన్నిటి ఫలితంగా క్రమంగా స్కూళ్లలో హాజరు పెరిగింది. ప్రతిభావంతులైన పిల్లల్ని ప్రోత్సహించడానికి ఏటా అపోలో వైద్య కళాశాలలో రెండు మెడికల్‌ సీట్లు కేటాయిస్తామనీ, ఒక ఐఐటీ సీటు స్పాన్సర్‌ చేస్తామనీ ప్రకటించారు అపోలో ఛైర్మన్‌.

ఉపాధీ... ఉల్లాసం...
యువతరానికి చేతినిండా పని ఉండాలి. ఆ పని వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కుటుంబానికి అండగా నిలబెడుతుంది. అందుకే నిరుద్యోగుల కోసం వృత్తివిద్యా శిక్షణ కేంద్రం పెట్టారు. ఏసీల మరమ్మతు లాంటి పనుల్లో యువకులూ, జనపనార ఉత్పత్తులూ, ఆస్పత్రికి ఉపయోగపడే దుస్తుల తయారీ లాంటి వాటిల్లో మహిళలూ శిక్షణ పొంది తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు. ఉచితంగా క్రీడాపరికరాలు అందించి ప్రోత్సహించడంతో యువకులు వాలీబాల్‌, కబడ్డీ తదితర టీములు తయారుచేసుకుని ఉత్సాహంగా పోటీలు పెట్టుకుంటున్నారు. యోగా నేర్చుకున్న యువత తామే టీచర్లుగా మారి ఇతరులకు నేర్పిస్తూ ఉపాధి పొందుతున్నారు. అపోలో టోటల్‌ హెల్త్‌ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు మినహా దాదాపు వందమంది వరకూ ఉన్న సిబ్బంది అంతా శిక్షణ పొందిన స్థానికులే.

చిన్నాపెద్దా ఎవరి పనుల్లో వాళ్లుంటే వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతారు. వారినీ ఉత్సాహంగా ఉంచేందుకు టోటల్‌ హెల్త్‌ కృషిచేస్తోంది. మొబైల్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయడమే కాదు, వృద్ధులకోసమూ పోషకాహార కేంద్రాలను ఏర్పాటుచేసి మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ కేంద్రాల్లో అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఏ వైకుంఠపాళీనో ఆడుకుంటూ కాలక్షేపం చేయవచ్చు. తరచూ కంటివైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

పర్యావరణ ఆరోగ్యానికి...
మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టూ ఉన్న పరిసరాలూ శుభ్రంగా ఉండాలి. అందుకూ రకరకాల కార్యక్రమాలను టోటల్‌హెల్త్‌ చేపట్టింది.
* రసాయన ఎరువులూ క్రిమి సంహారకాలూ లేని కూరగాయలు పండించుకునేందుకు గృహిణులకు పెరటి తోటల పెంపకంలో శిక్షణ ఇచ్చి విత్తనాలనూ ఇస్తున్నారు. దాదాపు ఆరువేల కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందాయి. మునగాకూ బొప్పాయీ వాడకాన్ని ప్రోత్సహిస్తూ గ్రామాలలో ఇరవై వేల చెట్లు నాటారు.
* ఇళ్లల్లో టాయ్‌లెట్లు కట్టించుకునే స్తోమత లేని కొన్ని వందల కుటుంబాలకు మరుగుదొడ్లు కట్టించి ఇచ్చారు.
* డజను మంచినీటి ప్లాంట్లు నిర్మించి దాదాపు 110 గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తున్నారు.
* తడి పొడి చెత్తను విడిగా వేసేలా ఇంటింటికీ చెత్తబుట్టలు సరఫరా చేయడంతో వీధులు శుభ్రంగా ఉంటున్నాయి.
* అలోపతీ మందులకే పరిమితం కాకుండా కీళ్లనొప్పులూ నడుంనొప్పులూ లాంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారికి ఆయుష్‌ సెంటర్‌ ద్వారా ప్రత్యామ్నాయ చికిత్సలూ అందిస్తారు. సామూహిక యోగా తరగతులు నిర్వహిస్తూ జీవనశైలి మార్పుల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
* మొక్కలు నాటడమే కాక నాటిన ప్రతి మొక్కనూ కాపాడుతూ పచ్చదనాన్ని పెంచుతున్నారు.

మార్పు... హార్వర్డ్‌ దృష్టికి...
మొత్తంగా 32 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న దాదాపు రెండు వందల గ్రామాల్లో అమలవుతూ 60వేల మంది జనాభాని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్న టోటల్‌ హెల్త్‌ కార్యక్రమం హార్వర్డ్‌ లాంటి విదేశీ విశ్వవిద్యాలయాన్నీ ఆకట్టుకుంది. అక్కడ సామాజిక ఆరోగ్యం విభాగంలో పరిశోధన చేసే విద్యార్థుల బృందం నెలన్నర పాటు ఈ గ్రామాల్లో ఉండి ప్రజల్లో వచ్చిన మార్పును ప్రత్యక్షంగా చూసి వెళ్లింది. వచ్చే అక్టోబరులో ఈ కార్యక్రమం పూర్వాపరాల గురించి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగించడానికి అపోలో చైర్మన్‌కి ఆహ్వానమూ అందింది.

ఆయన 2013 నవంబరులో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఏడేళ్ల లక్ష్యం పెట్టుకున్నారు. ఆ తర్వాత సమీక్షించుకుని విస్తరణ గురించి ఆలోచించాలనుకున్నారు. ఆ సమీక్షకు వేళవుతోందిక..!

జీవితం విలువైనది... అంటారు ప్రతాపరెడ్డి. ఆ విలువైన జీవితాన్ని తన ఊరివారే కాక చుట్టుపక్కలవారూ ఆరోగ్యంగా ఆనందంగా గడపాలన్న ఆయన కోరిక ‘సంపూర్ణ ఆరోగ్యం’తో సాకారమైనట్లే!


అందరూ సంతోషంగా ఉండాలని..!
- ప్రతాపరెడ్డి

నుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకెళ్లేటప్పుడు ఒక ముక్క కింద పడిందనీ, అదే మా ఊరు అరగొండనీ నా చిన్నప్పుడు పెద్దలు చెప్పుకునేవారు. అక్కడ పుట్టిపెరిగిన నన్ను అమ్మానాన్నలు చదివించడం వల్ల డాక్టర్నయ్యాను. విదేశాలకూ వెళ్లాను. నేను అక్కడ ఉండగా నాన్న ఒక ఉత్తరం రాశారు. అందులో ఎప్పటిలా బంధువులందరూ పేరుపేరునా అడిగినట్లు చెప్పారని లేదు. ‘నువ్వేం చేసినా మేమిద్దరమూ ఎలాగూ ఆనందిస్తాం. కానీ సొంతూరికి ఏమైనా చేస్తే ఊరంతా ఆనందపడతారు కదా’... అని రాశారు. తిరిగి వచ్చెయ్యమని నేరుగా అడగలేదు కానీ, ఆయన ఉద్దేశం నాకర్థమైంది. అలా స్వదేశానికి తిరిగొచ్చాను. ఇరవై ఏళ్ళ క్రితమే అరగొండలో యాభై పడకల ఆస్పత్రి, నర్సింగ్‌ కళాశాల ప్రారంభించాం. ఆ తర్వాత ఇంగ్లిష్‌ నేర్చుకునే అవకాశం ఊరి పిల్లలకూ ఇవ్వాలని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల పెట్టాం. అంతటితో ఆగిపోకుండా మొత్తం మండలంలోని పల్లెలన్నీ లబ్ధిపొందాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనతో మొదలుపెట్టిందే ‘సంపూర్ణ ఆరోగ్యం’ అన్న పథకం. ఆరోగ్యం అంటే మందులు కాదు, ఆనందం. ఆనందంగా నవ్వుతూ ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. తొలి శ్వాస నుంచి మలి శ్వాస వరకూ అలాంటి ఆరోగ్యాన్ని ప్రజలకు అందించడమే ఈ పథకం ఆశయం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.